అప్పులే..ముప్పుగా మారాయి..! | Farmer suicides | Sakshi
Sakshi News home page

అప్పులే..ముప్పుగా మారాయి..!

Aug 22 2015 3:25 AM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పులే..ముప్పుగా మారాయి..! - Sakshi

అప్పులే..ముప్పుగా మారాయి..!

దేశానికి అన్నం పెట్టే రైతు.. బతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు.. పది మందికి అన్నం పెట్టే రైతన్నలు

 పదకొండురోజుల్లో జిల్లాలో ఇద్దరు రైతుల ఆత్మహత్యలు
కరువు కోరల్లో మెతుకు జిల్లా
కరువు ప్రాంతంగా {పకటించి అన్నదాతలను ఆదుకోవటమే మార్గం
 
 మెదక్ రూరల్ : దేశానికి అన్నం పెట్టే రైతు.. బతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు.. పది మందికి అన్నం పెట్టే  రైతన్నలు  11 రోజుల తేడాలో మెదక్ మండలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాలం పోయి కరువు కోరల్లో చిక్కుకున్న రైతుకు  ఎవరూ భరోసా ఇవ్వటంలేదు.  మెదక్ మండలంలో చెరువులు, కుంటలు తప్ప చెప్పుకోదగిన సాగునీటి ప్రాజెక్టులు, నీటివనరులు లేవు, దీంతో ఈ ప్రాంత రైతులు పూర్తిగా చెరువులు, కుంటలు, బోరుబావులపై ఆధారపడి ఆరుతడి పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. కాగా గత రెండు సంవత్సరాలుగా చెప్పుకోతగిన వర్షాలు  కురియక పోవటంతో చెరువులు, కుంటలు నెర్రెలు బారటంతోపాటు బోరుబావుల్లో నీటి ఊటలు పూర్తిగా అడుగంటాయి. దీంతో  రైతులు ఆత్మహత్య ఒక్కటే మార్గమని  ఉసురు తీసుకుంటున్నారు.

 పంటచేతికందని స్థితిలో..
 మండల  పరిధిలోని మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన రాజెల్లిపేట సత్యనారాయణ (35) అనే యువరైతు ఈనెల 6న ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణ, లక్ష్మి దంపతులకు 8 సంవత్సరాలలోపు ఇద్దరు సంతానం ఉన్నారు. రెండెకరాల వ్యవసాయ పొలం ఉన్న సత్యనారాయణ రెండు సంవత్సరాల క్రితం  దుబాయి వెళ్లాడు.  ఏడాది పాటు పనిచేసిన సత్యనారాయణను అక్కడి వారు వెనక్కి పంపారు. దీంతో సత్యనారాయణ దుబాయ్ వెళ్లేందుకు చేసిన అప్పులను తీర్చకుండానే తిరిగి సొంత ఊరికి వచ్చి బోరువద్ద ఉన్న రెండెకరాల పొలంలో ఎకరం నాటు వేశాడు, మరొక ఎకరం బీడుగానే ఉంది. కాగా బోరుబావిలో  నీటి ఊటలు తగ్గిపోయాయి. పంట సాగుకోసం చేసిన అప్పులు, ఒకవైపు, దుబాయి వెళ్లేందుకు చేసిన అప్పులు బాధించడంతో ఈ నెల 6న ఆత్మహత్యచేసుకున్నాడు.  

 మొక్కజొన్న తోటలోనే..
 ఇదే మండలం రాజ్‌పల్లి పంచాయతీ పరిధిలోని తిమ్మక్కపల్లి పెద్దబాయి తండాకు చెందిన మాలావత్ బన్సీ(40) మీరి దంపతులకు 20 సంవత్సరాల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి మూడెకరాల  పొలం ఉంది. అందులో సాగునీటి కోసం రెండు బోర్లను తవ్వారు. చుక్కనీరు కూడా రాకపోవడంతో పిల్లలతో పట్టణానికి వలస వెళ్లారు. అక్కడ   అడ్డా కూలీలుగా పనిచేసి, కూతురు పెళ్లి చేశారు. కాగా ఏదో సమస్య వచ్చి కూతురుకు విడాకులయ్యాయి. ఈ యేడు ముందుగా మురిపించిన వర్షాలకు బన్సీ, మీరీలు పట్టణం నుంచి తండాకు వచ్చి అప్పు చేసి మక్క పంట వేశారు.  చినుకు జాడలేకపోవటంతో పంట ఎండిపోయింది.

ఫలితంగా  చేసిన అప్పులు ముప్పయ్యాయి. దీంతో ఈనెల 17వ తేదీ రాత్రి బన్సీ ఆత్మహత్య చేసుకున్నాడు.  ఇది ఒక్కమెదక్ మండలంలోని పరిస్థితే కాదు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement