వీసీ సజ్జనార్‌.. డబుల్‌ భరోసా! | Ensuring Centers in Hyderabad | Sakshi
Sakshi News home page

డబుల్‌ భరోసా!

Dec 23 2019 10:00 AM | Updated on Dec 23 2019 10:00 AM

Ensuring Centers in Hyderabad - Sakshi

భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్‌ సెషన్‌ (ఫైల్‌)

సాక్షి,సిటీబ్యూరో: అత్యాచార బాధితులతో పాటు లైంగిక వేధింపులు ఎదుర్కొన్న చిన్నారులు, మహిళలు, విద్యార్థినులు, యువతులు.. ఇలా ఎవరైనా సరే వారికి అందించే ‘భరోసా’ సేవలను సైబరాబాద్‌ పోలీసులు రెట్టింపు చేయనున్నారు. మహిళా బాధితులు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా వారికి వైద్య, న్యాయ సహాయంతో పాటు కేసు నమోదు నుంచి నిందితులకు శిక్ష పడే దాకా అన్ని రకాలుగా అండగా ఉంటారు. ఇందుకోసం ప్రస్తుతమున్న రెండు భరోసా కేంద్రాలకు అదనంగా మరో ఐదు కేంద్రాలను అందుబాటులోకి తేవాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌నిర్ణయించారు. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో ఆయా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నివేదికను ఇప్పటికే కిందిస్థాయి అధికారులు సిద్ధం చేసి సీపీ సజ్జనార్‌కు సమర్పించి అందుకు తగిన పనులను వేగవంతం చేశారు. అంతా సజావుగా ఉంటే మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ఈ భరోసా కేంద్రాలను అందుబాటులోకితీసుకొచ్చే అవకాశముందని పోలీసు వర్గాలుభావిస్తున్నాయి. 

ఎక్కడెక్కడ అంటే..
ప్రస్తుతం కొండాపూర్, అల్వాల్‌లో భరోసా కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా జీడిమెట్ల, పేట్‌బషీరాబాద్, శంషాబాద్, షాద్‌నగర్, రాజేంద్రనగర్‌లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా అత్యాచారం, ఇతర లైంగిక వేధింపులు, గృహ హింస, ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ ఆఫెన్స్‌(పోక్సో) సంబంధిత కేసులు ఈ కేంద్రాల్లో పర్యవేక్షిస్తారు. అందుకు తగిన సిబ్బందిని నియమించుకునే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు.

భరోసా కేంద్రానికి రాగానే చేసేది..
చిన్నారులు, మహిళలు, విద్యార్థినులు, యువతులు భరోసా కేంద్రానికి ఎవరొచ్చినా ముందు వారి నుంచి ఫిర్యాదు తీసుకుంటారు. తర్వాత వెంటనే కౌన్సెలర్‌ కేసు నమోదు చేసేందుకు అనుగుణంగా మార్చి ఫిర్యాదును కంప్యూటర్‌లో రికార్డు చేస్తారు. ఇలా కౌన్సెలర్‌ నుంచి వచ్చిన రికార్డు ఆధారంగా బాధితురాలిని పోలీసులు విచారిస్తారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రాథమిక విచారణ చేసి ఎఫ్‌ఐఆర్, ఎన్‌సీఆర్, డీఐఆర్‌ నమోదు చేస్తారు. కేసు పరిష్కారమయ్యే దాకా పర్యవేక్షిస్తారు. కోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి తీర్పు వచ్చేవరకు న్యాయ సేవలను ఉచితంగా అందించేందుకు న్యాయ నిపుణులు అందుబాటులో ఉంటారు. వీరు బాధితులతో మాట్లాడి విచారణ సందర్భంగా ఎలాంటి అంశాలు మాట్లాడాలి? ఎవరి వద్దకు వెళ్లాలని సూచిస్తారు. కేసు పూర్తయ్యే వరకు న్యాయ సహాయం అందిస్తారు.

కోర్టుకు హాజరు కాలేని పక్షంలో..  
అత్యాచార బాధితులు, తీవ్రమైన బాధలు ఎదుర్కొంటున్నవారు పోలీసు స్టేషన్లకు వెళ్లడం, కోర్టు విచారణకు హాజరైనప్పుడు సామాజిక వివక్షను ఎదుర్కొనే అవకాశాముంది. దీం తో పాటు న్యాయస్థానానికి వెళ్లినప్పుడు ప్రత్యర్థులు, నిందితులు బెదిరించే అవకాశాలెక్కువ. దీని దృష్ట్యా కోర్టులో హాజరు కాకుండా భరోసా కేంద్రంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బాధితులను విచారణ చేసే సౌకర్యం కల్పిస్తారు.

ఆధారం లేనివారికి చేయూత
కుటుంబ సభ్యుల నుంచి సహకారం లేని, ఎలాంటి ఆధారం లేని బాధితులు, మహిళలకు స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు, దాతల సహాయంతో పునరాసం కల్పిస్తారు. బాధితులకు వచ్చిన విద్యతో పాటు వారికి జీవన నైపుణ్యాలు నేర్పించి విక్టిమ్‌ అసిస్టెంట్‌ ఫండ్‌ పేరుతో వారికి సహాయం అందిస్తారు. చిరు వ్యాపారాలు చేసుకునేందుకు పూర్తి సహాయం చేస్తారు. అత్యాచార బాధితులు, చిత్రహింసలు ఎదుర్కొని పారిపోయి వచ్చిన వారికి వెంటనే వైద్య సేవలు అందించేందుకు బృందం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ బాధితులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే ప్రాథమిక చికిత్స అందించి వెంటనే అంబులెన్స్‌ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తారు. ఇందుకోసం భరోసా కేంద్రం వద్ద అంబులెన్స్‌ను ఉంచుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement