ఊరూరా డెంగీ

Dengue Disease Causes In Karimnagar Villages - Sakshi

జిల్లావ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. ఊరూవాడ.. పట్టణం, నగరం.. తేడా లేకుండా ప్రజలను మంచం పట్టిస్తోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సకాలంలో వైద్యం అందితే సరి.. లేకుంటే అంతే. సంబంధిత వైద్యాధికారులు మాత్రం డెంగీ కేసులు పెద్దగా నమోదు కాలేదని, ఇక మరణాలు అసలే లేవని చెబుతున్నారు.

కరీంనగర్‌ హెల్త్‌: ఇటీవల కురిసిన వర్షాలు, వాతా వరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో జిల్లాలో డెంగీతోపాటు విషజ్వరాలు కూడా తీవ్రస్థాయిలో విజృభిస్తున్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో డెంగీ మరణాలు లేవని, కేవలం 44 డెంగీ కేసులు మాత్రమే నమోదు అయినట్లు తెలుపుతున్నా.. కేసుల నమోదుకంటే రెట్టింపు మరణాలు జరిగాయి. జూలై పదో తేదీ వరకు కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదు కాగా.. సెప్టెంబర్‌ 8వరకు 27 పీహెచ్‌సీ పరిధిలో ఏకంగా 44 కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం అధికారుల రికార్డుల మేరకే.. అనధికారికంగా అనేకమంది బాధపడుతున్నా.. వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. 

27 పీహెచ్‌సీ పరిధిలో నమోదైన కేసులు.. 
జిల్లాలోని 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 44 డెంగీ కేసులు నమోదు అయినట్లు వైద్యధికారులు తెలిపారు. కరీంనగర్‌ అర్బన్‌లోని హౌసింగ్‌బోర్డు కాలనీ పీహెచ్‌సీ పరిధిలో రెండు, సప్తగిరి కాలనీ పీహెచ్‌సీ పరిధిలో నాలుగు, కొత్తపల్లి పీహెచ్‌సీ పరిధి చింతకుంటలో రెండు, సీతారాంపూర్‌లో ఒకటి, మల్కాపూర్‌లో రెండు, గోపాల్‌పూర్‌లో ఒకటి, చేగుర్తిలో ఒకటి, వెల్ధి పీహెచ్‌సీ పరిధిలోని ఊటూర్‌లో ఒకటి, మానకొండూర్‌ పీహెచ్‌సీ పరిధిలోని నిజాయితీగూడెంలో రెండు, ఖాదర్‌గూడెంలో ఒకటి, చిగురుమామిడి పీహెచ్‌సీ పరిధి నవాబుపేటలో ఒకటి, రేకొండలో నాలుగు, బొమ్మనపల్లిలో ఒకటి, చొప్పదండి పీహెచ్‌సీ పరిధి భూపాలపట్నంలో ఒకటి, కాట్నపల్లిలో ఒకటి, తిమ్మాపూర్‌ పీహెచ్‌సీ పరిధి నుస్తులాపూర్‌లో ఒకటి, గొల్లపల్లిలో ఒకటి, శంకరపట్నం పీహెచ్‌సీ పరిధి కన్నాపూర్‌లో ఒకటి, అంబాల్‌పూర్‌లో ఒకటి, కాచాపూర్‌లో రెండు, ఎరడపల్లిలో రెండు, చెల్పూర్‌ పీహెచ్‌సీ పరిధిలోని హుజురాబాద్‌లో ఒకటి, చెల్పూర్‌లో ఒకటి, సైదాపూర్‌ పీహెచ్‌సీ పరిధి ఎక్లాస్‌పూర్‌లో ఒకటి, వావిలాల పీహెచ్‌సీ పరిధి వావిలాలలో ఒకటి, వీణవంక పీహెచ్‌సీ పరిధి వీణవంకలో ఒకటి, ఇల్లందకుంట పీహెచ్‌సీ పరిధి పాతర్లపల్లిలో ఆరు కేసుల చొప్పున మొత్తం 44 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. కానీ.. అనధికారికంగా అనేక మంది డెంగీబారిన పడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. ఇప్పటికీ తీసుకుంటూనే ఉన్నారు.

రెట్టింపు మరణాలు
జిల్లాలో డెంగీవ్యాధితో మరణాలు లేవని అధికారిక లెక్కలు తెలుపుతున్నా.. 100కుపైగా మరణాలు జరిగినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌కు చెందిన గౌడ సరస్వతి (60) డెంగీతో మరణించిన విషయం విదితమే. ఈ మధ్యకాలంలో డెంగీతోపాటు వాతావరణ మార్పులతో విషజ్వరాలు ప్రబలి ప్రజలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. విషజ్వరాల కారణంగా ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు పడకలు వేసి సేవలు అందించాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా 7,  చికున్‌గున్యా 51 కేసులు, మలేరియా నాలు కేసులు మాత్రమే నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top