
గడపగడపకూ వైఎస్ పథకాలు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారని...
సంగారెడ్డి క్రైం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో పార్టీ మరింత బలపడుతోందని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్ర భిక్షపతి అన్నారు. సోమవారం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు తప్పకుండా లభిస్తుందన్నారు.
హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ర్ట పార్టీ కార్యాలయాన్ని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ విభాగానికి ఒక చాంబర్ కేటాయించారని, ఇందుకు జగన్‌మోహన్‌రెడ్డి కి, విజయమ్మకు, షర్మిలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతమవుతోందన్నారు. గతం లో వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాల పై వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వంలో అన్ని గ్రామాల్లో గడప గడపకూ తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలోని రైతులకు భరోసా ఇవ్వకపోవడం వల్లనే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి రైతు ల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ హైదరాబాద్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శివకుమార్, మురళి తదితరులు పాల్గొన్నారు.