గూడు.. గోడు

Delayed Double Bedroom Housing Scheme in Hyderabad - Sakshi

రూ.కోట్లు ఖర్చయినా దక్కని ఫలితం  

సౌకర్యాల లేమితోలబ్ధిదారుల అనాసక్తి  

ఇళ్ల కోసం పేదలఎదురుచూపులు  

‘డబుల్‌’ గృహాలపై ఆశలు   

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని ఎంతోమంది పేదలు ఇళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చింది. నగరంలో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతోంది. అయితే అవి ఎప్పటికి పూర్తవుతాయో? ఎవరికి అందుతాయో? తెలియని పరిస్థితి. ఇదిలా ఉండగా గత ప్రభుత్వాల హయాంలో రూ.వేల కోట్లతో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే పథకాల కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వాటిలో 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. కానీ వాటిలోకొన్నింటిని లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన రూ.కోట్ల వ్యయం వృథా అవుతోంది. గ్రేటర్‌ పరిధిలోని నాలుగు జిల్లాల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే గృహాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద 78,746 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని తొలుత నిర్ణయించారు. ఇందుకు రూ.1,124 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే తర్వాత వాటిని 45,951కి తగ్గించగా... 43,511 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిలో 35,997 ఇళ్లనే లబ్ధిదారులకు కేటాయించారు. ఇక 6,608 వాంబే గృహాల నిర్మాణం చేపట్టగా... అవన్నీ పూర్తయ్యాయి. కానీ 3,416 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు.

కారణాలెన్నో...  
పూర్తయిన ఇళ్లల్లో కనీస సదుపాయాలు లేకపోవడం, అవి ఉపాధి అవకాశాలకు దూరంగా ఉండడం తదితర కారణాలతో లబ్ధిదారులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లకు లబ్ధిదారులు తమవంతు వాటాగా 20శాతం, మరో 50 శాతం బ్యాంకు రుణం ద్వారా పొంది తిరిగి చెల్లించాల్సి రావడం లాంటి కారణాలతో అందరిలో అనాసక్తి నెలకొంది. మరోవైపు ప్రభుత్వం ఉచితంగానే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తుండడం.. అవి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే గృహాల కంటే పెద్దవిగా ఉండడం కూడా ఇందుకు కారణమవుతోంది. దాదాపు దశాబ్దం క్రితం నాటి ధరల మేరకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల అంచనా విలువ రూ.లక్ష  నుంచి రూ.2.50 లక్షల వరకు ఉంది. అప్పట్లో లబ్ధిదారులకు తమవంతు కంట్రిబ్యూషన్‌ చెల్లించే స్తోమత లేకపోవడం, వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడం తదితర కారణాలతోనూ ఆ పథకాలు నిరాదరణకు గురయ్యాయి. పూర్తయిన ఇళ్లలో చేరేందుకు లబ్ధిదారులు వెనకడుగు వేస్తుండటంతో వాటిల్లోని  దర్వాజాలు, తలుపుల దొంగలపాలవుతున్నాయి. సకాలంలో నిర్మాణాలు, కేటాయింపులు పూర్తికాకపోవడంతో రూ.వేల కోట్ల పథకాలకు  ప్రయోజనం లేకుండా పోయింది.  

ఇళ్లు ఇలా..
ఈ రెండు పథకాల కింద మొత్తం 52,559 ఇళ్ల నిర్మాణం చేపట్టగా, 50,119పూర్తయ్యాయి. అయితే వీటిలో 39,413 ఇళ్లనే లబ్ధిదారులకుఅప్పగించారు. అర్హులు తమవంతు వాటా చెల్లించకపోవడం, బ్యాంకు రుణాలు అందకపోవడం, అధికారుల అశ్రద్ధ, లబ్ధిదారుల అనాసక్తిఇందుకు కారణాలు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top