ప్రైవేటు భారం.. ప్రభుత్వమే ఆధారం

Dalit and tribals are more in Government schools - Sakshi

సర్కారీ బడుల్లో దళిత, గిరిజనులే ఎక్కువ

మూడోస్థానంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులు

విద్య, బోధన, అభ్యసనంపై పరిశీలనలో వెలుగులోకి నిజాలు

సాక్షి, హైదరాబాద్‌: దళిత, గిరిజనులకు ప్రైవేటు విద్య భారమవుతోంది. ఆయా కుటుంబాల ఆర్థిక స్థితిగతుల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలకే పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఎక్కువ భాగం దళిత, గిరిజనులే. ఆ తర్వాతి స్థానంలో వెనుకబడిన కులాలకు చెందిన పిల్లలుంటున్నారు. సెస్‌(సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌) ఆధ్వర్యంలో యంగ్‌లైవ్స్‌ అనే సంస్థ రాష్ట్రంలో విద్య, అభ్యాసన అనే అంశాలపై సర్వే నిర్వహించింది. 2009 నుంచి 2016 మధ్య కాలం నాటి పరిస్థితులను ప్రామాణికంగా తీసుకుని పరిశీలన చేపట్టింది. దీనికి సంబంధించిన నివేదికను ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ విడుదల చేశారు.

ఈ పరిశీలనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. విద్యాపరంగా అభివృద్ధి వేగవంతమవుతున్నప్పటికీ అందులో మార్పులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2009 సంవత్సర గణాంకాలను, 2016 సంవత్సర గణాంకాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ పిల్లలే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్లు బయటపడింది. ఎస్సీల్లో 84.7 శాతం పిల్లలు, ఎస్టీల్లో 72.7, బీసీలు 56.4, ఇతర కులాల పిల్లలు 30.2 శాతం మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మిగతా వారంతా ప్రైవేటు బాట పట్టినట్లు ఈ సర్వే స్పష్టం చేస్తోంది. 

నమోదు భళా...: 2009 నాటి పరిస్థితులతో పోలిస్తే స్కూళ్లకు వెళ్లే పిల్లల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మార్పు ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీలు, ఇతర కేటగిరీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో అధికంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీలున్నాయి. సామాజిక పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం కావడంతోపాటు అన్ని వర్గాల్లో చైతన్యం వస్తుండటంతో ఈ మార్పు సాధ్యమైందని తెలుస్తోంది. ఈ క్రమంలో 2009 గణాంకాలతో పోలిస్తే ప్రస్తుతం బడికి వెళ్తున్న పిల్లల్లో ఎస్సీల్లో 23 శాతం పెరగగా, ఎస్టీల్లో 32 శాతం పెరిగింది. బీసీల్లో 24 శాతం, ఇతర కేటగిరీల్లో 13.8 శాతం పెరుగుదల కనిపించింది. వచ్చే ఐదేళ్లలో పాఠశాలల్లో నమోదు వంద శాతానికి చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

సామర్థ్యం డీలా..
పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా పెరిగినప్పటికీ వారిలో సామర్థ్యం మాత్రం డీలా పడుతున్నట్లు పరిశీలనలో తేలింది. ప్రవేశం పొందిన నాటి నుంచి పైతరగతులకు వెళ్తున్నకొద్దీ వారిలో ప్రతిభాపాటవాలు సన్నగిల్లుతున్నాయి. విద్యార్థుల కనీస సామర్థ్యాల గణనలో... చదవడం, రాయడంతోపాటు చతుర్విద ప్రక్రియలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ఆయా వర్గాల పిల్లల కనీస సామర్థ్యాలు పరిశీలిస్తే ఫలితాలు తిరోగమనంలో నమోదు కావడం గమనార్హం. 2009 నాటి పరిస్థితులతో పోలిస్తే 2016 నాటికి సగానికి పడిపోయినట్లు పరిశీలనలో తేలింది. 2009తో పోలిస్తే ఎస్సీ విద్యార్థుల్లో 7.5 శాతం పిల్లలు చతుర్విద ప్రక్రియల్లో ఉత్తీర్ణులు కాగా, 2016లో కేవలం 5.3 శాతం మాత్రమే పాసయ్యారు. ఎస్టీల్లో 15 శాతం నుంచి 7 శాతానికి, బీసీల్లో 11.3 శాతం నుంచి 6.2 శాతానికి, ఓసీల్లో 17.6 శాతం నుంచి 11.3 శాతానికి తగ్గినట్లు తేలింది. సరైన సమాధానాలు ఇచ్చినవారిలో ప్రైవేటు పాఠశాలల పిల్లలు కొంత మెరుగ్గా ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం తక్కువగా ఉంది. దీనికి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన పిల్లల తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోవడమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top