వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు

Covid:19 Telangana Police Have Made E Pass System Available - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పర్యాటకం, విద్య, ఉద్యోగం ఇతర కారణాల వల్ల తమ సొంత ప్రాంతానికి వెళ్లలేని వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ–పాస్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తమ సొంత ఊరు, రాష్ట్రం వెళ్లాలనుకునేవారు https://tsp.koopid.ai/epass లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఈ–పాస్‌ పొందవచ్చని తెలిపారు. ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్‌ మాత్రమే జారీ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ–పాస్‌ అవసరమైన వారు సంబంధిత పేరు, మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్, ప్రాంతం, ఇతర వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో పొందుపర్చిన వివరాల ఆధారంగా అన్ని అంశాల్ని పరిశీలించిన తర్వాత ఆన్‌లైన్‌లోనే ఈ పాసులు జారీ చేస్తామని, వాటి సహాయంతో సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు.  (పోలీసులపై దాష్టీకాలా?)

కోవిడ్‌ ’ఫ్రీ’ చేసి పంపండి 

రెవెన్యూ, పోలీస్, మెడికల్‌ అధికారులతో కూడిన బృందాలు స్క్రీనింగ్‌ చేయాలి 
ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ ఉత్తర్వులు
 

లాక్‌డౌన్‌ కారణంగా ఉండిపోయి ఇప్పుడు తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారిని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి అంతర్రాష్ట్ర సరిహద్దుకు 2, 3 కిలోమీటర్ల ముందే పరీక్షలు నిర్వహించాలి.

రెవెన్యూ, పోలీస్, మెడికల్‌ అధికారులతో కూడిన బృందం వారందరికీ పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో పరీక్షించాలి. లేవని నిర్ధారిస్తూ ప్రభుత్వం సూచించిన ఫార్మాట్‌లో సర్టిఫై చేయాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వాహనాలకు కూడా నిర్దేశిత నమూనాలో పర్మిట్లు జారీ చేయాలి. వాహనం నంబర్‌తో పాటు ఎంతమంది ప్రయాణిస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారనే అంశాలను పర్మిట్‌లో పేర్కొనాలి. స్క్రీనింగ్‌ చేసే బృందాలు అవసరం మేరకు 24 గంటలు పనిచేసే విధంగా సిద్ధం చేసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top