మద్యం ముట్టరు.. నాన్న సస్పెన్షన్‌ ఎత్తివేయండి

Constable Daughter Requesting Hyderabad Police Commisioner Anjani Kumar - Sakshi

సీపీకి ఓ చిన్నారి విజ్ఞప్తి..

సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ అప్పటికప్పుడు ఉత్తర్వులు

కుటుంబాన్ని గౌరవించాలని ఆడియో సందేశం విడుదల చేసిన కొత్వాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : ఓ కానిస్టేబుల్‌ కుమార్తె నగర కొత్వాల్‌ను కదిలించింది. కొన్నాళ్ళ క్రితం సస్పెండైన తన తండ్రి కోసం కొత్వాల్‌ను కలసి తమ కుటుంబం మొత్తం మద్యానికి దూరంగా ఉంటామంటూ హామీనిచ్చింది. చిన్నారి ఆత్మవిశ్వాసానికి కదిలిపోయిన నగర కమిషనర్‌ అంజనీ కుమార్‌..ఆమె తండ్రి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు టైప్‌ చేయించి చిన్నారి చేతికందించారు. ఈ సందర్భంగా ఆయన ఆ బాలికతో ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ వాట్సాప్‌లో శుక్రవారం ఓ ఆడియోను విడుదల చేశారు.  

ఆడియో సందేశం ఆయన మాటల్లోనే.. 
‘‘గుడ్‌ మార్నింగ్‌ కానిస్టేబుల్‌ ఆఫీసర్స్‌. ఈ రోజు మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకొస్తున్నాను. కొన్ని రోజుల క్రితం నేను ఆఫీస్‌లో పని చేస్తుండగా ఓ చిన్నారి ఫోన్‌ చేసి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అని కోరింది. ఆమె మాటల్లో ఉన్న ఆత్రుతని గమనించి తక్షణం రమ్మన్నా. దాదాపు గంటన్నర తర్వాత తన తల్లితో కలసి వచ్చింది. ఆ చిన్నారి నగర పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ కుమార్తెగా పరిచయం చేసుకుంది. ఆ చిన్నారి తొమ్మిదో తరగతి చదువుతోందని మాటల్లో తెలిసింది.

విధుల్లో ఉండగా మద్యం తాగి అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలపై ఐదారు నెలల క్రితం ఆమె తండ్రి సస్పెన్షన్‌కు గురయ్యారు. తన తండ్రి ఇక జీవితంలో మద్యం ముట్టడని ఆ చిన్నారి నాకు హామీనిచ్చింది. కేవలం తన తండ్రే కాదు కుటుంబంలో ఎవరూ మద్యం జోలికి పోరని స్పష్టం చేసింది. ఆ చిన్నారి ఆత్మవిశ్వాసం చూసిన తర్వాత ఆమెను నిరాశ పరచకూడదని నిర్ణయించుకున్నా. అప్పటికే సాయంత్రం కావటంతో క్లర్క్స్‌ అంతా ఇళ్ళకు వెళ్లిపోయారు. అప్పటికప్పుడు క్లర్క్‌ను ఇంటి నుంచి రప్పించి సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఉత్తర్వులు టైప్‌ చేయించాను.

ఆ ఉత్తర్వులతో పాటుగా ఓ స్వీట్‌ ప్యాకెట్‌ను ఆ బాలిక చేతికి అందించాను. రెండు మూడు రోజులుగా ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆకాంక్షించా. నా దగ్గరకొచ్చి తన తండ్రి గురించి మాట్లాడిన ఆ బాలికకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. మీ అందరినీ ఒకటే కోరుతున్నా. మీ పిల్లలపై శ్రద్ధ తీసుకోండి. వారి కనీస అవసరాలను తెలుసుకుని తీర్చండి. వారితో అవసరమైనంత సమయాన్ని గడపటం, వీలున్నప్పుడు విహారానికి వెళ్ళడం ఇవన్నీ మీకు ఎంతో సంతృప్తినిస్తాయి. ఓ భవనమో, కారో ఖరీదు చేసినప్పుడు కూడా ఇంతటి ఆనందం కలగదు. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.
 
    మీ అంజనీ కుమార్, 
    కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్, హైదరాబాద్‌’’ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top