మెదక్‌ పర్యాటక ప్రాంతాలను చూద్దాం..విహరిద్దాం

Attractive Tourist Places In Medak - Sakshi

సాక్షి, కొండాపూర్‌(సంగారెడ్డి): జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉన్న ప్రాంతం కొండాపూర్‌. ఎల్తైన  కొండలపై పచ్చని పైర్ల నడుమ మ్యూజియాన్ని అప్పటి పురావస్తు శాఖ అధికారులు అంగరంగ వైభవంగా నిర్మించారు.  క్రీశ  2 వ శతాబ్ద కాలంలో వాడిన  మట్టి వస్తువులు, గాజు వస్తువులు, వ్యవసాయ పనిముట్లు,గృహ పరికరాలు, వ్యవసాయ పరికరాలు, ఆభరణాలు, నాణెలు, పెద్దపెద్దని మట్టిగోశాలు, ఇటుకలు, పూసలు, ఇనుప వస్తువులు, గొడ్డళ్లు, అప్పటి క్రీస్తూపూర్వం 200, క్రీస్తూ శకం రూ.200 మధ్య కాలానికి సంబంధించిన వస్తువులను అమర్చి  చారిత్రక సంపదను కొండాపూర్‌ మ్యూజియలో భద్రపర్చారు.

నూతన శిలయుగపు మానవుడు ఉపయోగించిన రాతి పనిముట్లు 5 వేల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ జనజీవనం ఉన్నట్లు తెలిపే ఆధారాలు కొండాపూర్‌లో కొలువై ఉన్నాయి.ప్రదానంగా కంకణముల ముక్కలు,చేతిగోరుతో గీయబడిన చిత్రముల గల తాయెత్తులు.గవ్వరాగి గాజు పదార్థముతో తయారు చేయబడి న కంకణములు కూడా కలవు.కంఠముల నందు వేలాడుచు ధరించుటకు వీలుగా వుండే రోమ¯Œ నాణెములకు అనుకరణములుగా వుండే మట్టి పతకాలు సైతం తవ్వకాలలో లభించాయి. 

చేరుకోవడం ఇలా..  
ఫీజు వివరాలు: 15 సంవత్సరాల లోపు చిన్నారులకు ప్రవేశం ఉచితంగానే ఉంటుంది. పెద్దవాళ్ళకు ప్రవేశ రుసుం కేవలం రూ.5 మాత్రమే. 
ప్రవేశ సమయం: ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుంది.  ప్రతీ శుక్రవారం సెలవు. సంగారెడ్డి పట్టణానికి 15 కిమీ దూరంలో వుంటుంది. సంగారెడ్డి నుంచి సీహెచ్‌ కోనాపూర్‌కు వెళ్ళే బస్సులు కొండాపూర్‌ మీదుగా వెళ్తాయి. ఉదయం 9–00, మధ్యాహ్నం 2.00, సాయంత్రం 5 గంటలకు,రాత్రి 9 గంటలకు సంగారెడ్డి డిపో నుంచి బస్సులు అందుబాటులో వుంటాయి.

దీంతో పాటు సంగారెడ్డి నుండి ఆటోలో పెద్దాపూర్‌కు చేరుకెవాలి. పెద్దాపూర్‌ నుంచి ఉదయం 7 గంటల  నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఆటోలు అందుబాటులో ఉంటాయి. జిల్లా కేంద్రం సంగారెడ్డికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికి టూరిజం బస్సులు సంగారెడ్డి నుంచి సదాశివపేట మీదుగా ప్రయాణిస్తాయి. కాని కొండాపూర్‌లోని మ్యూజియం వైపు పర్యాటక సిబ్బంది రారు.

సంగారెడ్డి ప్రత్యేకత: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో  మీని ట్యాంకుబండ్‌ (మహబూబ్‌సాగర్‌ ) చెరువు పర్యటన కేంద్రంగా మారనున్నది. ఇక్కడ కుర్చిలు, హైమాస్ట్‌ లైట్లు, చిన్నారులకు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉండటంతో ఇక్కడికి ఆహ్లదం కోసం ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. జిల్లాలో జలాశయాలు ఎండుముఖం పట్టినప్పటికి మహబూబ్‌సాగర్‌ చెరువులో 75శాతం నీరు ఉండటంతో ఆయకట్టు పరిధిలో ఖరీఫ్‌లో వరి సాగు చేశారు. దీంతో కనుచూపుమేర పచ్చదనం కనిపిస్తోంది. 

చుట్టూ ఆధ్యాత్మిక  కేంద్రాలు... 
మినీ తిరుపతిగా పేరుగాంచిన  వైకుంఠపురం చెరువు కట్ట సమీపంలో ఉంది. దీంతో పట్టణ, జిల్లా ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చెరువు కట్టపైకి వచ్చి సేద తీరుతున్నారు. సోమేశ్వర ఆలయం, హనుమాన్‌ టెంపుల్, మజీదులు, చర్చిలు, నిర్మాణంలో ఉన్న బీరప్ప ఆలయాలు ఉన్నాయి.

కాకతీయుల ఖిల్లా– మెదక్‌ ఖిల్లా 
జిల్లా కేంద్రంలోని ఖిల్లా నిర్మాణం కాకతీయుకాలంలో నిర్మించారు. దీనిని ప్రతాపరుద్రుడు అనే రాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. దీనిని పర్యాటక కేంద్రంగా దశాబ్దకాలం నుంచి గుర్తించిన పాలకులు అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఖిల్లాపై పర్యాటకుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన హరితహోటల్‌తోపాటు అద్దె గదులను అందుబాటులో ఉంచారు.  

సందర్శన వేళలు..  
24గంటలపాటు ఎప్పుడైన సందర్శించేందుకు పర్యాటకశాఖ అవకాశం కల్పించింది.  దర్శించే వేళలు ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు ఉంటుంది.  

ఇలా వెళ్లాలి..
హైదరాబాద్‌ నగరం నుంచే వచ్చే పర్యాటకులు మెదక్‌ పట్టణంలో దిగి కాలినడకన సైతం ఖిల్లాకు వెళ్లే అవకాశం ఉంది. 

గోదావరి తీరాన..చిన్నకోడూరు(సిద్దిపేట)  
చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు వచ్చి పర్యాటక కేంద్రంగా మారనుంది. కట్ట సమీపంలో వాటర్‌ గేమ్స్, చిన్నారులకు, పెద్దలకు ఆహ్లాదాన్ని నింపేందుకు పార్కుల ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే వాటర్‌ గేమ్స్‌ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  

కట్టపైన, సమీపంలో రోడ్లు, కరంట్‌ కనెక్టివిటీ, కాటేజ్‌ నిర్మాణం, పార్కు నిర్మాణం వంటివి చేపట్టనున్నారు. టూరిజం స్పార్ట్‌లో  కాన్ఫరెన్స్‌హాల్, హాల్‌లో వేడుకలు జరుపుకునేలా తయారు చేయనున్నారు. ఆర్టిఫిషియల్‌ బీచ్‌ రూపొందచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గుజరాత్‌లోని నర్మదా డ్యామ్, మైసూర్‌లోని బృందావనాలకు దీటుగా ఆహ్లాద వాతావరణం ఉండేలా పార్కుల, గార్డెల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే రంగనాయక సాగర్‌ కట్ట పనులతో పాటు పల్లగుట్టపై ఫోర్‌సూట్‌ గెస్టు హౌస్, ప్రాజెక్టు ఎస్‌ఈ కార్యాలయ నిర్మాణాలు పూర్తయ్యాయి.

కొండా..కోనల్లో.. 
హుస్నాబాద్‌ ప్రత్యేకత: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ డివిజన్‌ కేంద్రానికి 4 కి.మీ దూరంలోనే ఉమ్మాపూర్‌ అటవీ ప్రాంతము ఉంది. ఇక్కడి అటవీ ప్రాంతములో 800 మీటర్ల ఎల్తైన గుట్టలు ఉండగా వీటికి కోటగిరి గట్లుగా పిలుస్తారు. ఎతైన గుట్టల పై ఆనాడు నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సర్వాయి పాపన్న సామ్రాజ్యంను ఏర్పాటు చేసుకోని తిరుగుబాటు చేశాడు.

పాపన్న ఖిల్లా పై ఆనాటి కోట కట్టడాలు ఇప్పటికి ఉండటం విశేషం. కోటగిరి గట్లకు తూర్పున డీరు పార్కు నిర్మాణం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దక్షణ వైపు రాయికల్‌ జలపాతలు పర్యటకులను ఆకట్టుకుంటాయి. పడమర,ఉత్తరంను జలాశయలను నిర్మించడం వల్ల పర్యటకులకు నీటి అందాలు కనువిందు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ వారసత్వశాఖ అధికారులు ఇక్కడ పర్యాటక కేంద్రము ఏర్పాటు చేసేందుకు పర్యటించి వెళ్లారు.

కోటగిరి గట్లకు దారి 
హుస్నాబాద్‌ డివిజన్‌  కేంద్రముకు సిద్దిపేట,హన్మకొండ,కరీంనగర్, స్టేషన్‌  జనగామ జిల్లాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. హుస్నాబాద్‌ నుంచి ఆటోల ద్వార పర్యటక ప్రాంతాలకు చేరుకోవచ్చు. రాయికల్‌ జలపాతలను చూడాలంటే మహ్మదాపూర్‌ మీదుగా రాయికల్‌ జలపాతలకు చేరుకోనేందుకు రోడ్డు మార్గం ఉంది. 3,222 విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతమును చూసేందుకు ఒక రోజు సమయం ఇక్కడే సరిపోతుంది. ఎతైన గుట్టలపైకి చేరాలంటే స్థానికుల సహకారంతో  5 గంటల సమయం పడుతుంది.

అందాల అభయారణ్యం 
ఎన్నోరకాల వన్యప్రాణులకు నిలయం ఈ అభయారణ్యంలో. కళ్లముందె చెంగుచెంగున ఎగురుతూ పరిగెత్తే జింకలు.. మరోపక్కన పురివిప్పి నాట్యమాడే మయూరాలు. నిలువెత్తు ఆకారాలతో బయపెట్టే సాంబరులు గంతులేస్తూ ఉరుకులు తీసే కుందేళ్లు కనువిందు చేస్తాయి.  

రవాణా సౌకర్యం.. 
మెదక్‌–కామారెడ్డి జిల్లాల సరిహద్దులోగల పోచారం అభయారణ్యం హైదరాబాద్‌ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా జిల్లాకేంద్రమైన సంగారెడ్డి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెదక్‌ పట్టణానికి మాత్రం కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ అభయారణ్యంలో జింకల ప్రత్యుత్పత్తికేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో  రెండు  డీర్‌బీడింగ్‌ సెంటర్‌లను(డీసీబీ) ఏర్పాటు చేశారు.

1వ, డీబీసి 125.33 హెక్టార్‌ అడవి విస్తరించి ఉండగా,  2వడిబిసి 39.30 హెక్టార్ల అడవి విస్తరించి ఉంది. మొత్తం సుమారు 500 ఎకరాలుండగా వీటి చుట్టుకంచెవేసి అందులో రకరకాల జంతువులను పెంచుతున్నారు. ఇందులో కృష్ణజింకలు, జింకలు,  చీతల్, సాంబారు, నీల్గాయి, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు, నెమళ్లు,   పాటు పలురకాల జంతువులు ఉన్నాయి. డీబీసీ 1లో 4.5 కిలోమీటర్ల దూరంలో రోడ్డును వేశారు. కాగా జంతువులను చూడాలంటే ముందుగా సంబంధిత అధికారుల అనుమతులు తీసుకొని వెళ్లాలి. 

మంజీర నాదాలు.. 
సంగారెడ్డి మండలం కల్పగూర్‌ శివారులో గల  మంజీర బ్యారేజి పర్యాటకులకు మంచి పిక్నిక్‌ స్పాట్‌గా మారింది. ఇక్కడి అభయారణ్యం  ఆధ్వర్యంలోని పర్యవరణ విద్యా కేంద్రానికి వచ్చే  పర్యాటకులకు  విజ్ఞానాన్ని పంచుతుండగా వివిధ జతువులు, పక్షుల జీవన విధానంలో అనేక అంశాలపై అవగాహన కలిగిస్తాయి.  విదేశీ కొంగలు, మొసళ్ల పెంపకం ఇక్కడ ఉంటుంది.

విజ్ఞానాన్ని అందించే లైబ్రరీ ఉంది. ఇదిలా ఉండగా పర్యవరణ కేంద్రం ఆవరణలో  వివిధ రకాల పక్షులు, కుందేళ్లు, జింకలను పెంచుతున్నారు.వీటిలో లవ్‌ బర్డ్స్, రంగు రంగుల చిలకలు, పిట్టల కిచకిచలాటకు  సందర్శకులు ఆనంద పడుతుంటారు. పర్యవేక్షణ కేంద్రం పక్కనే మొసళ్లు పెంపక కేంద్రం ఉంది.  ఈ కేంద్రంలో  సుమారు 46  మొసళ్లు ఉండగా పిల్లలు 52కి  పైగా ఉంటాయి. వీటిని కూడా సందర్శకులు వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

మెదక్‌ సీఎస్‌ఐ చర్చి
ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం మెదక్‌లోని కరుణామయుని కోవెల సీఎస్‌ఐ చర్చి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చ్‌ను నిర్మించి 96సంవత్సరాలు కావస్తుంది. ఆకర్షణీయంగా దేవదారు కర్రతో, పక్షిరాజు ఆకృతిలో తయారుచేసి పరిశుద్ధ గ్రంథ వేదిక.  ప్రసంగ వేదికను బాల్‌స్టో¯Œ తోరూపొందించారు. ఫర్నిచర్‌కోసం రంగు టేకు కర్రను, ఇతరత్రా ఆసనాలకు గులాబీ కర్రలను వినియోగించారు. ఈ చర్చ్‌ కట్టడాలను తిలకించిన పర్యాటకులు మళ్లీ మళ్లీ వస్తుండటం ఇక్కడి నిర్మాణ శైలి ప్రత్యేకత.  

సందర్శన వేళలు.., 
సందర్శించే వేళలు ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు ఉంటుంది. డిసెంబర్‌ 25, గుడ్‌ఫ్రైడే రోజుల్లో మాత్రం 24గంటలపాటు దర్శించుకునేందుకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం చర్చ్‌ ఆవరణలో ప్రత్యేక అద్దె గదులు ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడ వంటలు చేసుకునే అవకాశం ఉంది.   

  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top