బందూకు నుంచి.. బ్యాలెట్‌ దాకా..

Armed Strugglers Won In Elections In Nalgonda Constituency - Sakshi

     ఎన్నికల్లో పోటీ చేసిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాట యోధులు 

     పోరుబిడ్డలను ఆదరించిన ఉమ్మడి జిల్లా ఓటర్లు

     ఆయా నియోజకవర్గాల్లో వరుస విజయాలు సాధించిన నేతలెందరో.. 

సాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను పోరాటంలోనే కాకుండా ఎన్నికల్లో కూడా ఓటర్లు ఆదరించారు. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని అప్పటి నిజాంనవాబు ప్రకటించారు. దాంతో పాటు ఖాసిం రజ్వీ రాజకార్ల ఉద్యమాన్ని ప్రారంభించి దోపిడీతో పాటు అణచివేతకు తెరలేపాడు. దీంతో తెలంగాణ రైతాంగసాయుధ పోరాటం లో అప్పటి కమ్యూనిస్టు ఉద్యమ నేతలు పాల్గొన్నారు. ఆ ఉద్యమంతో హైదరాబాద్‌ సంస్థానం దేశంలో కలిసింది. తెలంగాణ సాయుధ పోరాటం అప్పట్లో ఉవ్వెత్తున ఎగిసింది. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంతో మంది నాయకులు ఆస్తిపాస్తులను సైతం లెక్కచేయకుండా నిజాంనవాబును ఎదిరించారు. ఉద్యమంలో పాల్గొన్న నేతలు భారత దేశంలో తొలిసారిగా ప్రజా స్వామ్య పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో పోటీ చేశారు. ఉద్యమంలో ప్రజల మద్దతు కూడగట్టిన నేతలకు ఓటర్లు కూడా మద్దతు తెలిపి శాసనసభకు పంపారు. 
సాయుధపోరాటం నుంచి..
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన దంపతులు ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, అదే విధంగా అన్నాచెల్లెళ్లు భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం ఉన్నారు. వారితో పాటు బొమ్మగాని ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డి, నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, నర్రా రాఘవరెడ్డి ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించారు.

‘ఆరుట్ల’ దంపతులు :
 
తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి దంపతులు. కమలాదేవిది ఆలేరు మండలం మంతపురి. ఆమె మేనమామ కుమారుడు రామచంద్రారెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆమె అసలు పేరు రుక్మిణి కాగా వివాహ అనంతరం కమలాదేవిగా పేరు మార్చుకున్నారు. ఆమె  ఆంధ్రామహాసభలో పాల్గొనడంతో పాటు రజాకార్లను ఎదుర్కోవడానికి గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసింది. నిజాం విమోచన ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లింది. ఆమెతో పాటు భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డిది భువనగిరి సమీపంలో ఉన్న కొలనుపాక గ్రామం. హైదరాబాద్‌లోని రెడ్డిహాస్టల్‌లోఉండి చదువుకుని 1947లో గెరిళ్లా శిక్షణ పొంది ఉద్యమం వైపునకు అడుగులు వేశారు. పోరాట సమయంలో పోలీసులకు చిక్కి 1952 వరకు నిర్బంధంలోనే ఉన్నాడు. వీరిద్దరు 1962లో ఒకేసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా ఒకేసారి శాసనసభలో ఉండటం విశేషం.  ఆరుట్ల కమలాదేవి ఆలేరు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు 1952, 1957, 1962లో విజయం సాధించారు. ఆమె భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి భువనగిరి నియోజకవర్గం నుంచి 1962లో ఒకసారి, మ రోసారి మెదక్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించి శాసనసభకు ఎన్నికయ్యారు.  

భీమిరెడ్డి, మల్లు స్వరాజ్యం :

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి భీమిరెడ్డి నర్సింహారెడ్డి గుండెకాయ. ఉద్యమ నేతగా ఉన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం అన్నాచెల్లెళ్లు. వీరిది సూర్యాపుట తాలూకాలోని కరివిరాల గ్రామం.వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సాయుధపోరాటంలో పాల్గొని ప్రజలను చైతన్యం చేశారు. వీరిద్దరు కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసి 1957లో గెలిచారు. ఆ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో సీపీఎం తరఫున పోటీ చేసిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి 1967లో గెలిచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన చెల్లెలు మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి 1978, 1983లో గెలిచారు. అదే విధంగా భీమిరెడ్డి నర్సింహారెడ్డి మిర్యాలగూడ పార్లమెంట్‌ నియోజకవర్గం సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు.  

నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి:

భూస్వామ్య కుటుంబంలో పుట్టిన నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్నారు. నిజాం నవాబును ఎదిరించడానికి ఉద్యమంలో పాల్గొన్నాడు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి నకిరేకల్‌ నియోజకవర్గంలో 1962లో విజయం సాధించారు. తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్నారు. సీపీఐ తరఫున పోటీ చేసి గెలుపొందారు

నర్రా రాఘవరెడ్డి:

రాజకీయ నేతలకు ఆదర్శ నాయకుడు. అహంబావాలు, ఢాంబికాలు లేని శాసనసభ్యుడిగా పేరెన్నికగన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నర్రా రాఘవరెడ్డి ఉద్యమంలో ఆయన బుర్రకథల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. ఆయన మొట్టమొదటిసారి 1959లో చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. ఆయన నకిరేకల్‌ అసెంబ్లీ నియోకవర్గంలో తిరుగులేని వ్యక్తిగా విజయం సాధించారు. వరుసగా ఐదు పర్యాయాలు విజయం సాధించి రికార్డు బ్రేక్‌ చేశారు. మొత్తంగా ఆరు పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై ఎమ్మెల్యేగా పని చేశారు. 1967 నుంచి 1972 మినహా వరుసగా 1978, 1983, 1985, 1989, 1994లో విజయం సాధించారు.  

ధర్మభిక్షం :

సూర్యాపేటకు చెందిన బొమ్మగాని ధర్మభిక్షం తెలంగాణ సాయుధ పోరాటంలో పాటాలు నేర్పిన వ్యక్తి. విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ధర్మభిక్షం పేరు వింటే నిజాంనవాబుకు వణుకు పుట్టేది. ఆయన శాసనసభతో పాటు పార్లమెంట్‌కు కూడా ఎన్నికయ్యారు. సూర్యాపేట, నల్లగొండ, నకిరేకల్‌ నియోజకవర్గాల నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సూర్యాపేటలలో 1952లో, నకిరేకల్‌లో 1957లో పీడీఎఫ్‌ తరఫున పోటీ చేశారు. అదే విధంగా 1962లో సీపీఐ తరఫున నల్లగొండలో   పోటీ చేసి విజయం సా«ధించారు. అంతే కాకుండా నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి రెండు పర్యాయాలు 1991, 1996లో ఎంపీగా ఎన్నికయ్యారు.  

రావి నారాయణరెడ్డి:

ఆంధ్రా మహాసభ, ఆంధ్రా జనసంఘం ఏర్పాటు చేశారు. రెడ్డి హాస్టల్‌లో విద్యార్థిగా ఉండి స్వాతంత్య్ర పోరాటంలో సైతం పాల్గొన్నారు. ఆయన స్వగ్రామం భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామం. తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న రావి నారాయణరెడ్డి ఎన్నికల తొలినాళ్లలో పోటీ చేసి విజయం సాధించారు. ఆయన భువనగిరి నియోజకవర్గంలో 1952లో పీడీఎఫ్‌ తరఫున పోటీ చేశారు. అదే సమయంలో నల్లగొండ లోక్‌సభకు కూడా ఎన్నిక కావడం వల్ల రాజీనామా చేశారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి భారతదేశ ప్రధాని నెహ్రూకంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిం చారు. అనంతరం 1957లో మరోసారి భువనగిరి ఎమ్మెల్యేగా పీడీఎఫ్‌ తరఫున పోటీచేసి గెలుపొందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top