breaking news
-
TS MLC: ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ పరిశీలనలో ఐదుగురు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 18వ తేదీ వరకు గడువు ఉంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది. సామాజిక సమీకరాణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల పోటీలో బీసీ సామాజికవర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్రి అనిల్ పేర్లను పరిశీలినలో ఉండగా.. ఎస్టీ నుంచి బలరాం నాయక్, ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఓసీ కోటా నుంచి పటేల్ రమేష్ పేరు హైకమాండ్ దృష్టిలో ఉన్నట్టు పార్టీలో వినిపిస్తోంది. మరోవైపు.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, జావిద్ అలీఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే, అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. -
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ న్యాయ విచారణల ఆంతర్యం ఏంటి ?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం ఏంటి ? న్యాయ విచారణల వెనక ఆంతర్యం ఏంటి ? గత ప్రభుత్వ తప్పిదాలపైనే రేవంత్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలన్నదే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమా ? అసలు కాగ్రెస్ ప్రభుత్వం అడుగులు ఏ దిశగా పడుతున్నాయి?.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ళ పాటు సాగిన గులాబీ పార్టీ పాలనలో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకాలం తాము చేసిన ఆరోపణల్ని రుజువు చేయడమే లక్ష్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లక్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగాయని తాము ఇంతకాలం చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. ధరణి వెబ్సైట్ ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు చేతులు మారాయని ప్రభుత్వం భావిస్తోంది. ధరణిలో జరిగిన అక్రమాలు, లోటుపాట్లను తేల్చేందుకు కోదండ రెడ్డి అధ్యకతన ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి భారీ అవినీతికి బీఆర్ఎస్ ప్రభుత్వం తెరలేపిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జ్యూడిషియల్ ఎంక్వరీకి ప్రభుత్వం సిద్దమయింది. ఇందుకోసం రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఆఫీస్ లలో ఏకకాలంలో విజిలెన్స్ ఎంక్వరీ మొదలు పెట్టింది. విద్యుత్ కొనుగోలులో కూడా అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి ఆధారాలు సేకరించే ప్రక్రియ మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి మయంగా మారిందని, కమిషన్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇంకోవైపు ప్రభుత్వ శాఖలలో బీఆర్ఎస్ నేతల సన్నిహితులు, బంధువులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. అలాంటి వారు వెంటనే రిజైన్ చేసి వెల్లిపోవాలని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ అల్టిమేటం జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఎంక్వరీ చేయాలని సీఎం కోరాతామని కూడా ఇప్పటికే మంత్రి ప్రకటించారు. ఓఆర్ఆర్ టెండర్లలోను భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ టెండర్లపై విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతోందని తెలుస్తోంది. ఇవేకాదు.. ఫార్ములా ఈ రేసింగ్ లో హెచ్ఎండిఏ నుంచి రూ.55 కోట్లు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా చెల్లింపులు జరిగాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ప్రభుత్వం మెమో కూడా జారీ చేసింది. గత ప్రభుత్వంలో హరితహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందట. దీనిపై కూడా చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని భావిస్తున్న అన్ని శాఖలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు శాఖలపై విచారణకు ఆదేశించగా, మరికొన్ని శాఖలపై ఎంక్వరీకి సిద్ధం అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్ని అప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఖండించారు. తాము ఆరోపించినట్లు అవినీతి జరిగింది నిజమే అని రుజువు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమయింది. ఇదీ చదవండి: నల్గొండపై బీజేపీ పట్టు? -
బీజేపీ నేత ఈటల దారెటు?
హైదరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగేది ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని మరోచోటు నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ టాక్ నడుస్తోంది. తాను కాంగ్రెస్‌లో చేరడంలేదని ఈటల చెబుతున్నా ప్రచారం మాత్రం ఆగడంలేదు. మరి ఈటల కాంగ్రెస్‌లో చేరతారా? హస్తం గూటికి చేరితే ఎక్కడి నుంచి పోటీచేస్తారు? అసలు ఆయన ఆలోచన ఏంటి?.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. కరీంనగర్ ఎంపీగా మరోసారి విజయఢంకా మోగించాలనే కసితో బీజేపీ నేత బండి సంజయ్ కృషి చేస్తున్నారు. బూత్ లెవల్ మీటింగ్స్ నిర్వహిస్తూ.. సుమారు 20 వేల మంది కార్యకర్తలతో ఓ భారీ సమావేశానికి బండి ఇప్పటికే స్కెచ్ వేసేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తన చిరకాల ప్రత్యర్థి గంగులపైనే ఈసారీ ఓటమిపాలైన బండి.. అదే స్థాయిలో ఓట్లను తెచ్చుకోవడం మాత్రం ఈసారి ఆయనకు మరింత బూస్టప్ ఇచ్చిన అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా కార్యకర్తలు, మీడియాకు ఓ పెద్దపార్టీ అరేంజ్ చేసి.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తనకు బాసటగా ఉండేలా ఓ పథకం వేశారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకొస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో బండి సంజయ్ పై ఓటమిపాలైన వినోద్ ఈసారెలాగైనా గెలవాలన్న తపనతో.. ప్రస్తుత నియోజకవర్గ వ్యాప్తంగా శుభకార్యాలతో పాటు.. అన్ని కార్యక్రమాలకూ హాజరవుతూ అందరినీ కలుపుకుపోతున్నారు. కారు, కమలం అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తున్నా.. రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేపుతోంది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ వ్యవహారాల ఇంఛార్జ్ గా జీవన్ రెడ్డిని నియమించడంతో.. ఆయన నిజామాబాద్ నుంచి బరిలో ఉండే అవకాశాలున్నట్టుగా సమాచారం. కానీ, జీవన్ రెడ్డి మనసు మాత్రం కరీంనగర్ పార్లమెంట్ పైనే ఉన్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి బరిలో ఉంటారా.. లేక, కరీంనగర్ నుంచి పోటీకి దిగుతారా అన్న చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బరిలో.. ఇదిలాఉంటే.. మరోవైపు కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం బీజేపీలో కీలకపాత్రలో ఉన్న రాజేందర్ బీజేపీని వీడేది లేదని పైకి చెబుతున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో తన అనుచరుల నుంచి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలో ఉంటే కలిసొస్తుందనే సూచనలు వస్తున్నట్టుగా సమాచారం. ఈటల మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మల్కాజ్గిరి కంటే.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే కచ్చితంగా విజయం సాధించవచ్చు.. మళ్లీ రాజకీయంగా స్ట్రాంగ్ కావచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రిగా కరీంనగర్ జిల్లాపై పట్టున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్‌కు భారీ ఓట్ షేరింగ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లతో ఈటలకు అనుకూల పవనాలు వీస్తాయని కొందరు సలహాలిస్తూ ఫోర్స్ చేస్తున్నట్టుగా సమాచారం. త్రిముఖ పోరు..? మొత్తం మీద కరీంనగర్ పార్లమెంట్ సీటుకు గనుక ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండి గెలిస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఆసక్తికర పరిణామాలు జరుగుతాయంటున్నారు. ఇంతకాలం సొంతపార్టీ బీజేపీలోనే ప్రధాన ప్రత్యర్థిలా తయారైన బండికి.. మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ కూ ఏకకాలంలో చెక్ పెట్టినట్టవుతుందనే ఆయనపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో.. బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్, కాంగ్రెస్ నుంచి ఈటల గనుక బరిలో ఉంటే కచ్చితంగా కరీంనగర్ లో త్రిముఖ పోరు రసవత్తరంగా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జీవన్ రెడ్డి బరిలోకి దిగినా ఫైట్ టఫ్ గా ఉండే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. మరి బీజేపీ నేత ఈటల దారెటు? కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవ్వరనేది ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. ఇదీ చదవండి: సందిగ్ధంలో ఎన్నికలు -
నల్గొండపై బీజేపీ పట్టు?
నల్గొండ: అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీకి ఆశించిన ఫలితాలైతే రాలేదు. లోక్ సభ ఎన్నికల్లో ఉనికి చాటుకుంటామని చెబుతోంది. మరి కారు, హస్తం పార్టీలకు ధీటైన అభ్యర్థులను బరిలో దించుతుందా ? లేదంటే పేరుకు మాత్రమే పోటీలో ఉంటుందా? అసలు జిల్లాలో కాషాయ పార్టీ పరిస్థితి ఏంటి? ఎంపీ సీట్లకు పోటీ చేయడానికి తగిన అభ్యర్థులున్నారా? పోటీకి సిద్ధమవుతున్న నేతలెవరు? కొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు బరిలో దిగుతామంటున్న నేతల వడపోత పనిలో పడ్డాయి. అభ్యర్థుల వేటలో పడిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తోడు బీజేపీ కూడా నల్లగొండ జిల్లాలో ఉన్న రెండు స్థానాల్లో పట్టు సాధించాలనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సంగతి ఎలా ఉన్నా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి నల్గొండ, భువనగిరి స్థానాల్లో గణనీయంగానే ఓట్లు పోలవుతున్నాయి. ఇంతవరకు ఈ రెండు స్థానాల్లో ఆ పార్టీ ఖాతా అయితే తెరవలేదు. భువనగిరిలో కాషాయ పార్టీకి చెప్పుకోదగ్గ కేడర్ ఉంది. కానీ ఓట్ల రూపంలో మల్చుకునే సరైన నాయకుడు లేకపోవడంతో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలా అయినా ఈరెండు పార్లమెంట్ స్థానాల్లో పట్టు సాధించాలని కాషాయ పార్టీ కంకణం కట్టుకుందట. సరైన అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలవాలని ప్లాన్ చేస్తోందని టాక్. పోటీలో సీనియర్లు.. నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నూకల నర్సింహ్మారెడ్డిని బరిలో దించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందట. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు నర్సింహ్మారెడ్డికి జిల్లావ్యాప్తంగా ఉన్న పరిచయాలు కూడా కలిసి వస్తాయని పార్టీ లెక్కలు వేస్తోందట. అయితే నూకల మాత్రం పోటీకి అయిష్టంగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు వైద్యుడిగా కొనసాగుతున్న నాగం వర్షిత్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలను కోరుతున్నారని సమాచారం. అసెంబ్లీ సీటు రాకపోయినా పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకున్నానని ఆయన గుర్తు చేస్తున్నారట. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలతో పాటు ఫౌండేషన్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో గుర్తింపు పొందినట్లు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి చెబుతున్నారు. గోలి మధుసూదన్ రెడ్డి లాంటి ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా నల్గొండ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వమని అడుగుతున్నారట. ఓడిన చోటే గెలవాలని.. ఇక భువనగిరిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేసేందుకు అసక్తి కనబరుస్తున్నారని టాక్. 2014లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బూర.. 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొంతకాలం క్రితం ఆయన కాషాయ తీర్థం తీసుకున్నారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోయిన దగ్గరే పరువు నిలబెట్టుకోవాలని ఆయన అనుకుంటున్నారట. బీజేపీ నాయకత్వం కూడా బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశానని, మరోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని అంటున్నారట. వీరితో పాటు కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న పడమటి జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం కోసం పట్టుబడుతున్నారట. త్యాగం చేశానంటున్న గంగిడి.. ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న గొంగిడి మనోహర్ రెడ్డి ఇటు నల్లగొండ నుంచైనా అటు భువనగిరి నుంచైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసి మరొకరికి అవకాశం ఇచ్చానని.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఏదో ఒకచోట అవకాశం కల్పించాలని కోరుతున్నారట. ఇదిలా ఉంటే నల్లగొండ సెగ్మెంట్ లో ఇద్దరు బీఆర్ఎస్, ఒక కాంగ్రెస్ నేత టికెట్ ఇస్తే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ బీజేపీ సీనియర్ నేతతో నల్లగొండలోని ఓ హోటల్ లో జరిగిన రహస్య సమావేశం సందర్భంలో తమ మనసులో మాటను బయటపెట్టారట. అందుకు ఆ నేత రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారట. ఇక భువనగిరిలో మరో ఎన్నారై కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జిల్లాలోని రెండు స్థానాల్లో ఉనికి చాటుకునేందుకు ఈసారి బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఆశావాహులు కూడా అదేస్థాయిలో లాబియింగ్ ప్రారంభించారు. చూడాలి మరి టికెట్లు ఎవరికి ఇస్తారో..? ఫలితాలు ఎలా ఉంటాయో..? ఇదీ చదవండి: సందిగ్ధంలో ఎన్నికలు -
అబద్ధాలు వండబడును c/o రామోజీ
కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు, దివంగత కాపు నేత వంగవీటి రంగాపై ఈనాడు రామోజీరావుకు ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. అలాగే కాపులపై ఎక్కడలేని ఆప్యాయతను కురిపిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఆడుతున్న కపట ప్రేమే అన్న సంగతి తెలిసిపోతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం కాపులపై వైఎస్సార్సీపీ వల అంటూ ఒక తప్పుడు వార్తను సృష్టించడంలో ఈనాడు మీడియా దురుద్దేశం కనిపెట్టలేరా! గతసారి వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి కాపులను ఆ పార్టీకి ఎంతో కొంత దూరం చేయడమే ఈనాడు మీడియా లక్ష్యం. ఆ ఒక్క వర్గాన్నే కాదు.. వైఎస్సార్సీపీకి బాగా మద్దతు ఇచ్చే ప్రతి వర్గంలోను ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడానికి నానా పాట్లు పడుతున్న రామోజీరావు తన పత్రికను టీడీపీ కరపత్రంగా హీనంగా మార్చివేశారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు ఏవో వేసుకుంటాయి. వాటిని కధనాలుగా ఇవ్వడం తప్పుకాదు.కాని లేని వాటిని కల్పించి, అసత్యాలను అలవోకగా వండేసి పాఠకులపై రుద్దాలనుకోవడమే నీచం. రామోజీకి ఈ వయసులో ఇంత అప్రతిష్టపాలు అవడం వల్ల వచ్చే లాభం ఏమిటో తెలియదు. కాని ఏదో అపరిమతమైన లబ్ది కోసమే ఆయన ఇంతగా దిగజారారానిపిస్తుంది. ఆ వార్తలో ఏమి రాశారో చూడండి.. కాపులకు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇచ్చేశారట. దానిని జగన్ అమలు చేయడం లేదట. ఏమన్నా బుద్ది జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఇంత పచ్చి అబద్దాన్ని రాయగలుగుతారా! పార్టీ కార్యకర్తలకన్నా హీనంగా జర్నలిస్టులను ఇలా తయారు చేస్తారా? కాపు రిజర్వేషన్లపై 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేసేస్తానని కాపులను నమ్మబలికారు. దానిని నమ్మి ఆ వర్గం వారు టీడీపీకి ఓట్లు వేశారు. అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సాక్ష్యం. ఆయన కూడా కాపు కావడంంతో చంద్రబాబు హామీ అమలు అవుతుందిలే అని అమాయక కాపులు నమ్మారు. ఆ తర్వాత ఏమి జరిగింది! చంద్రబాబు కేంద్రానికి ఒక తీర్మానం పంపి వదలివేశారు. దాంతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపులు ఉద్యమించారు. అప్పుడు చంద్రబాబు కొత్త డ్రామా ఆడారు. కాపులను బీసీలలో కలిపే విషయంలో విచారణ చేసి సిఫారస్ చేయడం కోసం జస్టిస్ మంజూనాధ కమిషన్‌ను నియమించారు. కొందరు సభ్యులను కూడా ఇందులో వేశారు. ఆ కమిషన్ ఆయా ప్రాంతాలలో తిరిగి వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది. కాపులను బీసీలుగా గుర్తించడానికి బీసీ వర్గాల వారు అంగీకరించలేదు. అలా ఆ రెండు వర్గాల మధ్య అదొక వివాదంగా మారింది. ఈ కమిషన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని సిఫారస్ చేస్తుందని సందేహించిన చంద్రబాబు నాయుడు కమిషన్‌లోని సదరు సభ్యులను మేనేజ్ చేసి చైర్మన్ తో సంబందం లేకుండా ఒక నివేదిక తెప్పించుకుని కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలవారికి పది శాతం రిజర్వేషన్ లు ఇచ్చింది. దానికి తనదైన భాష్యం చెప్పి చంద్రబాబు నాయుడు ఆ పదిశాతంలో ఐదు శాతం కాపులకు ఇస్తామని ప్రకటించారు. నిజానికి అది చెల్లదు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో కనుక ఐదు శాతం ప్రత్యేకించి కాపులకు రిజర్వేషన్లు పెట్టి, మిగిలిన ఐదు శాతం ఇతర అగ్రకుల పేదలకు అని చెప్పి ఉంటే అప్పుడు సాధ్యమయ్యేది. ఇది దేశవ్యాప్త అంశం కనుకక కేంద్రం అలా చేయలేదు. అయినా కాపులను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు చెల్లని చట్టాన్ని తీసుకు వచ్చారు. కోర్టులలో అది నిలబడని పరిస్థితి. దీనిని ఈనాడు రామోజీరావు వక్రీకరించి చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినట్లు, దానిని జగన్ అమలు చేయనట్లు దుర్మార్గపు రాతలు రాశారు. కేవలం తెలుగుదేశం పార్టీకి జాకీలు వేసి లేపడం కోసమే ఈ అబద్దాలు వండుతున్నారన్నది స్పష్టం అవుతుంది. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తుని వద్ద కాపుల భారీ సభ జరిగింది.సభ పూర్తి అయ్యాక కొంతమంది ఆవేశపరులు రిజర్వేషన్ల డిమాండ్‌తో రైల్వే లైన్ పైకి వెళ్ళారు. ఆ టైమ్‌లో ఎవరో రైలు భోగీలకు నిప్పు పెట్టారు. అది పెద్ద సంచలనం అయింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ మంటలను ఆర్పడానికి కాకుండా, దానిని ఒక అవకాశంగా మార్చుకుని ప్రతిపక్షనేత జగన్ పైన, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పైన బురద చల్లే యత్నం చేశారు. పైగా రాయలసీమ నుంచి, కడప నుంచి వచ్చిన రౌడీలు ఈ పని చేశారని ఆరోపించారు. తీరా కేసు విచారణలో పోలీసులు కాపు నేతలు పలువురిని అరస్టు చేశారు. ముద్రగడను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికివెళ్లినప్పుడు ఆయన కుటుంబ సభ్యులను ఎంత నీచంగా దూషించింది ఆయనే స్వయంగా కన్నీళ్లుపెట్టుకుని చెప్పారు. ఇంకోసారి ముద్రగడ పాదయాత్ర చేపడితే ఇంటి నుంచి బయటకు రాకుండా వందలాది మంది పోలీసులను కిర్లంపూడి వద్ద మోహరింప చేసి కదలనివ్వలేదు. అదంతా ప్రజాస్వామ్యంగా ఈనాడు రామోజీకి కనిపించింది. గత ఎన్నికల సమయంలో జగ్గంపేట ప్రాంతంలో జగన్ పర్యటిస్తున్నప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆయన వెంటనే ఒక మాట చెప్పారు. అది తమ పరిధిలో లేని అంశమని, కేంద్రం ప్రభుత్వం చేతిలో ఉంటుందని విస్పష్టంగా తెలిపారు. తాను మాత్రం కాపులకు ఐదువేల కోట్లు కేటాయించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దానికి చాలామంది సంతృప్తి చెందారు.ఫలితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు తప్ప అన్నిటిని వైఎస్సార్సీపీ గెలుచుకుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ కనీసం ముద్రగడకు సానుభూతి కూడా చెప్పలేదు. కాపులకు రిజర్వేషన్లు ఏమిటి? తాను కులాలకు అతీతుడని చెబుతూ చంద్రబాబుకు ఇబ్బంది లేకుండా మాట్లాడేవారు. కాని అదే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల సమయంలో కాపులకు కుల భావన లేకపోతే ఎలా అని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. జగన్ కాపులకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదని అజ్ఞానంగానో, లేక మోసపూరితంగానో ప్రశ్నిస్తున్నారు. గతంలో ముద్రగడ పట్ల చంద్రబాబు ప్రభుత్వ అనుచితంగా వ్యవహరించినప్పుడు పవన్ సోదరుడు ,మెగాస్టార్ చిరంజీవి సంఘీభావం తెలపడానికి గాను రాజమండ్రి వెళితే విమనాశ్రయంలోనే పోలీసులు నిలిపివేశారు. అయినా అప్పుడు కూడా చంద్రబాబుకే పవన్ మద్దతు ఇచ్చారు. ఇక వంగవీటి రాధా విషయానికి వద్దాం. ఆయనకు గత ఎన్నికల సమయంలో సీటు ఇవ్వలేదంటూ ఈనాడు తప్పుడు ప్రచారం చేసింది. నిజానికి రాధాను పార్టీ వదలవద్దని, బందరు ఎమ్.పి సీటు ఇస్తామని చెప్పినా వినకుండా ఆయన టీడీపీలో చేరారు. ఒకప్పుడు తన తండ్రిని చంద్రబాబే చంపించారని చెప్పిన రాధా టీడీపీలో చేరడాన్ని రంగా అభిమానులు ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.. పోనీ అక్కడ ఏమైనా సీటు ఇచ్చారా? ఎమ్మెల్సీ పదవి ఏమైనా ఇచ్చారా? అదీ లేదు. కాని రాధామీద రామోజీరావు ప్రేమ ఒలకపోస్తున్నట్లు నటిస్తున్నారు. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తు చేయాలి. నాలుగు దశాబ్దాల కిందట రామోజీరావు ప్రతిఘటన అనే సినిమా తీశారు. అందులో రాధా తండ్రి, దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను పరోక్షంగా విలన్ గా చిత్రీకరించింది వాస్తవం కాదా! ఆ సినిమాలో చివరి సన్నివేశంలో హీరోయిన్ విలన్‌ను గొడ్డలితో నరికి చంపినట్లు చూపుతారు. ఆ తర్వాత కొంతకాలానికి బందరు రోడ్డులో నిరసన దీక్ష చేస్తున్న రంగాను టీడీపీకి సంబంధించినవారు గొడ్డళ్లతోనే నరికి హత్య చేశారు. ఆ హత్య విషయం అంతా చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసునని కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు. దాని గురించి ఎన్నడైనా ఈనాడు రామోజీరావు వార్తలుగా ఇచ్చారా? విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో రంగా అభిమానులకు, టీడీపీ వారికి ఉప్పు, నిప్పుగా ఉండేది. అలాంటిది రంగా విగ్రహానికి స్వయంగా టీడీపీ పెద్ద నేతలు దండలు వేసి ఆయనపై అభిమానం ఉన్నట్లు కనిపించే యత్నం చేయడం అంటే కాపు వర్గాన్ని బుట్టలో వేసుకోవడానికే అన్నది విదితమే. వంగవీటి రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారికి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఆమె రెండుసార్లు గెలిచారు కూడా. ఆ తర్వాత ఆమె అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ వైపు మొగ్గు చూపారు. తిరిగి 2004లో రంగా కుమారుడు రాధాకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించింది వైఎస్ రాజశేఖరరరెడ్డి.ఆ తర్వాతకాలంలో రాధా కూడా జగన్ వెంట నడిచి విజయవాడ తూర్పు నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయినా పార్టీలో ఆయనకు గుర్తింపు తగ్గలేదు. కారణం ఏమైనా ఆయన గత ఎన్నికల సమయంలో టీడీపీవైపు వెళ్లారు.ఇప్పుడు ఆయన మళ్లీ వైఎస్సార్సీపీలోకి వస్తారో లేదో తెలియదు. కాని ఈనాడు మాత్రం కంగారుపడుతూ ఇలాంటి అసత్యపు వార్తలు రాసింది.జగన్ అధికారంలోకి వచ్చాక తాను హామీ ఇచ్చిన విధంగా కాపు నేస్తం స్కీమును అమలు చేసి ఆ వర్గంం మహిళలకు ఏడాదికి 18500 చొప్పున ఆర్దిక సాయం చేస్తున్నారు. అంతేకాక కాపులలో పేదలైనవారికి కూడా వివిధ సంక్షేమ స్కీములు ఇస్తున్నారు. దానివల్ల కాపులలో ఆయనకు ఆదరణ కొనసాగుతోంది. దానిని తగ్గించడానికి చంద్రబాబు నాయడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రయోగించారు. పవన్ కళ్యాన్ వ్యూహాత్మక తప్పిదాలనండి, ఆయన ప్రత్యర్ధులు చెబుతున్నట్లు ప్యాకేజీ ఆకర్షణ అనండి.. ఆయన టీడీపీతో ఎలాంటి షరతులు లేకుండా పొత్తు పెట్టుకున్నారు. చివరికి లోకేష్ సీఎం.పదవి చేపట్టడానికి చంద్రబాబు మాదిరి పవన్ కు అనుభవం, సమర్ధత లేదని పరోక్షంగా చెప్పినా ఆయన మాట్లాడలేకపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నా టీడీపీ పాలిట్ బ్యూరో డిసైడ్ చేయాలని మరింతగా అవమానించారు. దీనిని కాపువర్గం భరించలేకపోతోంది. ఈ నేపధ్యంలో కాపులను ఎలాగొలా చంద్రబాబు, పవన్‌లకు దూరంకాకుండా చూసే యత్నంలో భాగంగా ఈనాడు రామోజీరావు ఇలాంటి అసత్యపు వార్తలను ప్రచురించి, టివీలో ప్రసారం చేస్తున్నారు. ఇదంతా కాపులను మరోసారి మోసం చేయడానికే. రామోజీరావు వంటివారి మాటలను నమ్మి కాపులు మళ్లీ, మళ్లీ మోసపోవడానికి సిద్దపడతారా? - కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్. ఇవి చదవండి: బాబు బ్యాచ్ చిత్తు..! -
కూలుస్తామంటే ఊరుకోం
కరీంనగర్ కార్పొరేషన్: ‘ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం.. మమ్మల్ని ముట్టుకొనే దమ్ముందా, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదు.. మా పార్టీలో కోవర్ట్ వ్యవస్థ లేదు, మా 64 మంది కుటుంబ సభ్యులమంతా కలిసే ఉన్నాం, నోరు.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి’అని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్‌ని హెచ్చరించారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలుస్తుందని బండి సంజయ్ చెప్పడంపై స్పందిస్తూ.. ఆయన జోస్యం చెబుతున్నారా, లేదంటే బీఆర్ఎస్ నాయకులు ఆయనకు సమాచారం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తాము చెప్పిందే నిజమని దీనితో రుజువైందన్నారు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న సంజయ్ వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. తాము దేశ నిర్మాణం చేసినవారిమని, విధ్వంసాలు సృష్టించే పని తమకెందుని అన్నారు. ఇవి మతిలేని వ్యాఖ్యలని ధ్వజమెత్తారు. తాము జీవితంలో బీజేపీతో కలిసేది లేదని, రెండు పార్టీల దారులు వేరని స్పష్టం చేశారు. ఇంటర్మిడియెట్ ఫెయిల్ అయిన బండి సంజయ్ జోస్యాలు చెపుతున్నారని పొన్నం ఎద్దేవా చేశారు. పర్మినెంట్‌గా ‘కేసీఆర్’లానే ఉండండి.. ‘మీ నాయనకు సీఎం పదవి అనేది ఎడం కాలు చెప్పు అయింది. నీకు కూడా ఆ అక్షరాలు నచ్చట్లేదు.. పర్మినెంట్‌గా కేసీఆర్‌లానే ఉండండి. జీవితంలో సీఎం అనే పదవి తీసుకోకండి. సీఎం అనే పదమే మీకు పడదు. ఆ పదవి దిక్కే రాకండి. చాలా సంతోషం’అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి పొన్నం వ్యాఖ్యానించారు. సీఎం పదవి కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలు పవర్ఫుల్ అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా విమర్శించారు. అధికారం కోల్పోతామని కేటీఆర్ కలలో కూడా ఊహించలేదని, అందుకే అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. అయోధ్యలో ఎన్నికల మార్కెటింగ్ అయోధ్యలో ధర్మానికి విరుద్ధంగా ఎన్నికల మార్కె టింగ్ జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదే విషయం మాట్లాడితే హిందూ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారన్నా రు. అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట ఎవరు చేయాలో హిందువులందరికి తెలుసని, జంటగా లేనటువంటి వారెలా చేస్తారని ప్రశ్నించారు. ఆలయం నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంబోత్సవమేమిటన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చన్నారు. -
కాంగ్రెస్ సర్కారును కూల్చే కుట్ర: బండి సంజయ్
కరీంనగర్‌టౌన్/ఎల్కతుర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ పెద్దఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో కేసీఆర్‌కు కోవర్టులున్నారని, గత ఎన్నికల్లో ఆయన వారికి పెద్దఎత్తున నిధులు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు టచ్‌లో ఉన్నారని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసి ఆ నిందను బీజేపీపైకి నెట్టివేసినా ఆశ్చర్యం లేదని సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్లో బండి సంజయ్ సమక్షంలో మానకొండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. యాదాద్రి అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చేవాళ్లమని కేటీఆర్ అంటున్నారని, పంచొద్దని ఎవరు అన్నారని ప్రశ్నించారు. ‘భద్రాద్రి రామాలయానికి తలంబ్రాలు కూడా తీసుకురానోడు.. ఎములాడ రాజన్నకు, కొండగట్టుకు, ధర్మపురి ఆలయాలకు నిధులిస్తామని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్’అని అన్నారు. ప్రజలు కేసీఆర్‌ను మర్చిపోయారని, బయటికి వస్తే ఎవరూ పట్టించుకోరని ఎద్దేవా చేశారు. గల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా.. ఢిల్లీలో ఉండాల్సింది మోదీనే అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల దుష్ప్రచారం.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. అలాంటి కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రజల బతుకులను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ను పూర్తిగా బొందపెట్టేదాకా విశ్రమించబోమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచి్చన హామీలు నెరవేరాలంటే కేంద్రంలో బీజేపీ ఎంపీలు ఎక్కువగా గెలవాలన్నారు. అయోధ్యపై రగడ ఎందుకు? అయోధ్య రామమందిర ఉత్సవం రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమమని, దీనిపై రగడ ఎందుకని బండి సంజయ్ ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లు రామ మందిర నిర్మాణానికి అనుకూలమా? వ్యతిరేకమా? సమాధానం చెప్పా లన్నారు. ఒకనాడు కాంగ్రెసోళ్లు అయోధ్యలోనే రాముడు పుట్టారనడానికి ఆధారాలేమిటని ప్రశ్నించారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. కానీ దేశ ప్రజలు ప్రశాతంగా ఉంటూ కోర్టు తీర్పును స్వాగతించే సరికి జీరి్ణంచుకోలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హితవు పలికారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు ఎంత అహకారం ఉందో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కూడా అంతే అహంకారం ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల మాటలనే పొన్నం ప్రభాకర్ కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీని నిందిస్తే పొన్నంకు ఏమి వస్తుందో అర్థం కావడం లేదన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయిన ప్రజలు మనల్ని చూసి గర్వపడాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా విమర్శలు మానుకొని అభివృద్ధిలో ముందుకు సాగాలని సూచించారు. రాబోయో ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఓ మిత్రుడు అడగడంతో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ 350 సీట్లకు పైగా గెలవడం ఖాయమని అన్నారు. తెలంగాణలో ఎంతమంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే అంత ఎక్కువగా నిధులు తీసుకొచ్చి రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. -
బీజేపీలో ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ జోష్
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. గతేడాది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఏవీఎన్‌రెడ్డి బీజేపీ బీ–ఫామ్‌పై గెలిచి మండలిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికల్లోనూ ఈ ఫలితమే పునరావృతం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పట్టభద్రుల స్థానం నుంచి గెలుపునకు ఓటర్ల నమోదు కీలకం కావడంతో దానిపై దృష్టి పెట్టింది. ఇందుకోసం పాతవారితోపాటు పెద్దఎత్తున కొత్తగా డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. ఓటర్ల నమోదుకు సంబంధించి పెద్దమొత్తంలో ఫామ్–18 దరఖాస్తులను ము ద్రించి పోలింగ్ బూత్ స్థాయి వరకు పంపాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ స్థానానికి గత ఎన్నికల్లో పార్టీ పరంగా జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ఓట్లు దక్కని ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడం ద్వారా సత్తా చాటాలని నాయకత్వం యో చిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే... ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో పార్టీ కి సానుకూలత పెరుగుతుందని అంచనావేస్తోంది. పార్టీ లో తీవ్ర పోటీ ఈ సీటు కోసం బీజేపీ నేతల మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంది. ఈ టికెట్‌ను తనకు కేటాయించాలని డా.ఎస్.ప్రకా‹Ùరెడ్డి ఇప్పటికే నాయకత్వాన్ని కోరగా, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్ కూడా ఈ సీటును కోరుకుంటున్నారు. గతంలో పోటీచేసి ఓడిన ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు. వీరితోపాటు వివిధ విద్యాసంస్థల అధినేతలు, విద్యావేత్తలు కూడా బీజేపీ టికెట్‌ను కోరుకుంటున్న వారిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి జూన్ 8 లోగా ఎన్నిక నిర్వహించాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రెష్‌గా ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానం నుంచి పోటీకి ఉత్సాహం చూపుతున్న ఇతర పార్టీ ల నాయకులు సైతం ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేవారు సైతం ఈ విషయంలో తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ పట్టభద్రుల సీటుకు ఓటర్ల నమోదుకు మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును ఇన్చార్జిగా నియమించారు. -
కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్: నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు!
ఎన్నికల టైమ్‌లో ప్రత్యర్థుల లోపాలు వెతికి నెగిటివ్ ప్రచారం చేయడం మామూలే. కాని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందని టాక్. మూడు పార్టీల ప్రధాన నేతలు ఎదుటివారి మైనస్‌లను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచారాలను ఆపడానికి ఏకంగా పోలీసుల ఫిర్యాదుల వరకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రత్యర్థి నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చ రచ్చగా మారుతోంది. ఈ నాయకులు చేస్తున్న ఆరోపణలేంటి? ఆ నేతలు ఎవరు? గులాబీ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయనైతే ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే..వినోద్‌కుమార్‌కు సమీప బంధువు ఒకరికి జెన్కోలో ఉద్యోగం ఇప్పించారంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ... ఆ మాజీ ఎంపీ మనస్సును తీవ్రంగా గాయపర్చింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. వినోద్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే జెన్కోలో ఉద్యోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి ఇంటి పేరు.. తన ఇంటి పేరూ ఒకటైనంత మాత్రాన తన బంధువని ఎలా అంటారంటూ ఫైరయ్యారు వినోద్. బండి సంజయ్ తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకమై తన మీద దుష్ప్రచారం చేస్తున్నాయన్నది బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాదన. అయితే ఈ రచ్చ అంతటితో ఆగలేదు. వినోద్ విమర్శలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం పార్లమెంట్ ఎన్నికల ముంగిట కరీంనగర్ లో పొలిటికల్ హీట్‌ను బాగా పెంచాయి. బంధుప్రీతి లేకుంటే కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ఎలా అయ్యాడని.. కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో చెప్పాలంటూ బీజేపీ నేతలు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. వినోద్ ప్రమేయం లేకుంటే ఆయనెందుకంత ఉలికి పడుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలన్న తలంపుతో అందరికంటే ముందస్తుగానే బండి సంజయ్ తన వ్యూహాల్ని తాను రచించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటివరకూ వినోద్ పేరే వినిపిస్తుండటం.. ఆయనే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కలియ తిరుగుతుండటంతో.. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబుతో పాటు.. ఈటల రాజేందర్ పేరు కూడా ప్రచారంలోకొస్తున్నాయి. బరిలోకి దిగే అభ్యర్థిని బట్టి కరీంనగర్లో జరగబోయేది ముఖాముఖీ పోటీనా.. లేక, ముక్కోణపు పోటీనా అన్నది తేలుతుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌లు మరోసారి తలపడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎవరో తేలితే ఇక కరీంనగర్ హీట్ మామూలుగా ఉండదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్ -
బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవర్టులు ఉన్నారని, కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణను అభివృద్ధి చేద్దామన్న విషయం తెలిసిందే. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పినట్లుగా ఇరు పార్టీలు మళ్లీ కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోందని అన్నారు. Congress was instrumental in BJP’s victory in Karimnagar and Nizamabad parliament segments in 2018 It appears that they are going to work together again as per BJP National General Secretary BS Kumar https://t.co/PJUdaNz7V7 — KTR (@KTRBRS) January 14, 2024 ఇక.. బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని మరోసారి బయటపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రెండుగా చీలి పోతుందని అన్నారు. చదవండి: రేవంత్ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం.. బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ -
TS: హత్యా రాజకీయాలు చెల్లవు: కేటీఆర్
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణలో హత్యా రాజకీయాలు చెల్లవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణలో హత్య రాజకీయాలు మొదలయ్యాయని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణలో హింసా రాజకీయాల సంస్కృతిని ప్రోత్సహిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ మొత్తం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లేష్ కుటుంబాన్ని ఆదివారం కేటీఆర్ పరామర్శించారు. మల్లేష్ కుటుంబానికి పార్టీ తరపున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కేటీఆర్ వెంట పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు కేటీఆర్ ఇటీవలే సోదరుడిని కోల్పోయిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని పరామర్శించారు. వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఇదీచదవండి.. మల్కాజ్గిరి ఎంపీ సీటుపై మాజీ మంత్రి కన్ను -
BRS: మల్కాజ్గిరి ఎంపీ సీటుపై మాజీ మంత్రి కన్ను!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీఎన్నికల హడావుడి ముగిసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు తరుముకువస్తున్నాయి. దీంతో అన్ని పార్టీల్లోనూ మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా విపక్షాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, గెలిచిన పలువురు నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ మాజీ మంత్రి ఎంపీగా పోటీ చేయాలని తెగ ఉబలాటపడుతున్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరో చూద్దాం. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గంపై అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతల కన్ను పడింది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం అయిన మల్కాజ్‌గిరిలో 31 లక్షలకు పైగా ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి 2014లో గెలిచిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కారు గుర్తు మీద పోటీచేసి మరోసారి ఎంపీ కావాలని తహతహలాడుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి మేడ్చల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఎంపీ సీటుపై ఆయన కన్ను పడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి నుంచి ఆయన అల్లుడు పోటీ చేసి గెలిచారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ సీటుకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఓటమి చెందారు. అందుకే ఈసారి తానే పోటీ చేసి గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక వేళ మల్లారెడ్డి ఎంపీ గా పోటీ చేసి గెలిస్తే.. ఆ తర్వాత మేడ్చల్ అసెంబ్లీ సీటుకు తన కోడలు ప్రీతి రెడ్డితో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వానికి కూడా మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికలకు, ఆ తర్వత జరిగే అసెంబ్లీ ఉపఎన్నికకు ఖర్చు మొత్తం తానే చూసుకుంటానని తెలిపినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..మల్లారెడ్డికి ఎంపీ సీటు ఇస్తే.. మేడ్చల్‌కు ఉప ఎన్నిక వస్తే అక్కడ ఇతర నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని స్థానిక నేతలు పార్టీని కోరుతున్నారు. దీంతో ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. మేడ్చల్ అసెంబ్లీ, మల్కాజ్గిరి ఎంపీ స్థానాలు రెండూ కీలకమే కావడంతో.. ఈ సారి కచ్చితంగా మల్కాజ్గిరి పై గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. మల్లారెడ్డికి పట్టున్న స్థానం కావడంతో ఈ విషయంలో సీరియస్‌గానే ఆలోచన చేస్తోంది. ఏదేమైనా మల్కాజ్ గిరి విషయంలో మాజీ మంత్రి మల్లన్న కూడా గట్టిగానే పట్టుపడుతున్నారు. ఇక్కడ ఎలాగూ ప్రతిపక్షమే గనుక మళ్ళీ పార్లమెంట్ లో అడుగుపెట్టి... ఇక్కడున్న వివాదాల నుంచి బయట పడవచ్చని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి.. చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది..? -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు.. ఏం చేయబోతోంది?
తెలంగాణ కాంగ్రెస్ ప్రజలకు ఆరు గ్యారెంటీలను హామీగా ఇచ్చింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది. హామీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల కొరత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. సవాళ్ళను అధిగమించడానికి కసరత్తు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోంది? పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించింది. మిగతా నాలుగు గ్యారెంటీల అమలు కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న పథకాలకే నిధుల కొరతతో అల్లాడుతోంది. నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు రైతు బంధు నిధులు రైతుల ఖాతాలోకి పూర్తి స్థాయిలో చేరలేదు. దీనికి తోడు వివిధ శాఖల్లో వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని కూడా ఎంతో కొంతమేర తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పథకాల అమలుకు ఇబ్బంది ఎదురవుతోందని సమాచారం. నిధుల సమీకరణలో భాగంగానే ప్రధానమంత్రి, మంత్రులను సీఎం కలిసారట. ఇదే కాకుండా ఆర్దిక భారం లేని నిర్ణయాలకు మాత్రమే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రజా పాలనలో స్వీకరించిన ధరఖాస్తుల్లో తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయగలిగే పథకాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలుపై దృష్టి సారించారట. అయితే ఈ రెండింటిలో ఏ ఒక్కటి అమలు చేయాలన్నా ప్రభుత్వం అదనపు నిధులు సమకూర్చుకోక తప్పదు. ఈ సమస్యలన్నీ అధిగమించడానికి పథకాల అమలుపై ఆర్థిక నిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు. ప్రజా పాలనలో కోటి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ అమలు చేయాలంటే 60 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం అవుతుంది. వీటిని సమకూర్చుకోవడమే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే వంద రోజుల గడువు ముగియనుండడంతో పథకాల అమలుచేయడం అనివార్యం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ అమలు చేయడానికి అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పథకాలు అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు. అలాగని అమలు చేయాలనుకుంటే నిధుల సమస్య.. దీంతో ఏం చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు. చూడాలి మరి తెలంగాణ సర్కార్ గ్యారెంటీల అమలు గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో? చదవండి: చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది ? -
TS: చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది ?
సాక్షి,చేవెళ్ల: ఒకవైపు పూర్తిగా గ్రామీణ వాతావరణం, మరోవైపు అత్యంత ఆధునిక జీవనం మిళితమైందే చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గం. వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులున్న ఈ ఎంపీ సీటుపై మూడు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సాఫ్ట్వేర్ రంగానికి ఆయువుపట్టు హైటెక్ సిటీ కూడా చేవెళ్ళ పరిధిలోకే వస్తాయి. అందుకే ఈ పార్లమెంట్ సీటు మీద పట్టు సాధించడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. చేవెళ్ళలో మూడు పార్టీల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న చేవెళ్ళ పార్లమెంటరీ స్థానాన్ని 2009లో ఏర్పాటు చేశారు. ఒకవైపు అర్బన్, మరోవైపు రూరల్ నియోజకవర్గాలు కలగలసి ఉన్న చేవెళ్ళలో పాతిక లక్షల మంది ఓటర్లున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గులాబీ పార్టీ తరపున రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. 2014లో గులాబీ పార్టీ తరపున గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగి ఓడిపోయారు. కొండా ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలాగైనా చేవెళ్లలో పాగా వేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా చేవెళ్ళ మీద పట్టు బిగించాలని చూస్తోంది. అదేవిధంగా గత రెండుసార్లు గెలిచిన చేవెళ్ళను మూడోసారి గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ పార్టీ ఆశిస్తోంది. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, నాలుగు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించాయి. గ్రేటర్ హైదరాబాద్ శివారులోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కమలం పార్టీ గట్టిపోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ట్రై యాంగిల్ పైట్ తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీచేస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కూడా నిర్వహించింది. ఇక ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపుతారనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే ఆ కీలక నేతనే చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీలో దింపే ఛాన్స్ కనిపిస్తోంది. లేనిపక్షంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ ఎన్నికల ఇంఛార్జీగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఛాలెంజ్ గా తీసుకుంటే బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ తరపున బరిలో దించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరును అధిష్టానం దాదాపు ఫైనల్ చేసింది. గతంలో ఎంపీగా పనిచేయడంతో పాటు.. స్థానికంగా పట్టు ఉండటం.. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉండటం.. మోదీ ఛరిష్మా కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెడుతుందా ? లేదంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పరోక్షంగా ఎవరికైనా సపోర్ట్ చేస్తుందా ? అనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై మూడు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. చివరకు ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి. ఇదీచదవండి.. గులాబీ బాస్ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ -
‘మోదీ ప్రధాని కాకముందు రాష్ట్రంలో ఐసిస్ ఏజెంట్లు ఉండేవారు’
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు తెలంగాణలో ఐసిస్ ఏజెంట్లు ఉండేవారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గోకుల్‌చాట్, దిల్సుఖనగర్, లుంబిని పార్క్‌లో మూడుచోట్ల ఒకే సారి బాంబ్ బ్లాస్టులు జరిగాయని అన్నారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న ట్రైన్లలోకూడా బాంబ్ బ్లాస్టులు జరిగాయని తెలిపారు. పాకిస్థాన్‌లో కూర్చొని రిమోట్ నొక్కితే భారత్‌లో బాంబ్ బ్లాస్టులు జరిగేవని అన్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐ వేళ్లుపాతుకొని భారత్‌ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందని తెలిపారు. మతకలాహాలు ప్రేరేపించి, ఆడీఎక్స్‌లు పేల్చేవాళ్లని, ఏకే 47లు పంపేవాళ్లని కిషన్‌రెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక ఈ పదేళ్లలో మతకలాలు, కర్ఫ్యూ లు, ఎకే 47లు, RDXలు లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించడం జరిగిందని గుర్తుచేశారు. భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ వేల కోట్లు ఖర్చు పెట్టేదని తెలిపారు. ఇండియన్ కరెన్సీని పాకిస్థాన్‌లో నకిలీ కరెన్సీగా ముద్రించి, ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్ నడిపేదన్నారు.ఇవాళ పాకిస్థాన్‌లో ప్రజలు రొట్టె ముక్క కోసం కోట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.పాకిస్థాన్ గత పాపాలను ఇప్పుడు అనుభవిస్తోందని అన్నారు. చదవండి: రేవంత్ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం.. బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ -
TS: బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్
సాక్షి,కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు అమ్ముడుపోతారన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని మరోసారి బయటపడిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రెండుగా చీలి పోతుందని చెప్పారు. మంగళ సూత్రాలు అమ్మిన సంజయ్‌కి ఇప్పుడు లక్షల రూపాయలతో కటౌట్స్ పెట్టుకునే డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. కరీంనగర్లో ఆదివారం పొన్నం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంటుకు బండిసంజయ్ తెచ్చిన నిధులు శూన్యమని పొన్నం విమర్శించారు. ‘శాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ఠ పండితులు చేస్తారు. అయోధ్య దేవాలయం నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే అశాస్త్రీయంగా మందిర ప్రారంభం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామమందిర ప్రారంభానికి పోవద్దని ఎక్కడా చెప్పలేదు. రాముడి పేరుతో బీజేపీ మార్కెటింగ్ చేస్తోంది. రేషన్ బియ్యం తెచ్చి రాములోరి అక్షింతలంటున్నారు. ఎంపీగా బండిసంజయ్ కొండగట్టు, వేములవాడ కోసం నిధులు ఏమైనా తీసుకువచ్చాడా..? చెప్పాలి. బండిసంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, పోనీ, జ్యోతిష్య శాస్త్రమూ చదువలేదు. బండిసంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కరెప్షన్ ఆరోపణలు రావడం వల్లే తొలగించారు. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. మాతో పోటి పడేది ఎవరో మిగిలిన పార్టీలే తేల్చుకోవాలి. బండిసంజయ్, వినోద్ కుమార్ ఇద్దరికీ కరీంనగర్లో ఓట్లు అడిగే హక్కు లేదు. కరీంనగర్ స్మార్ట్ సిటిలో అవినీతి జరిగితే మాజీ మంత్రి గంగుల కమలాకర్, బండిసంజయ్ ప్రేక్షక పాత్ర వహించారు. అవినీతి, అక్రమాలపై ఎంక్వైరీ నడుస్తోంది. త్వరలో అన్నీ బయటికి వస్తాయి’ అని పొన్నం అన్నారు. ఇదీచదవండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారు -
పొలిటికల్ హీట్.. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొంటున్నారు’
సాక్షి, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని బండి సంజయ్ కామెంట్స్ చేశారు. ఇక, తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ టచ్‌లో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఏదైనా జరగొచ్చు. కోవర్టులకు గత ఎన్నికల్లో కేసీఆర్ భారీగా డబ్బులు ఇచ్చారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ అంటే కూల్చే పార్టీ.. బీజేపీ అంటే నిర్మించే పార్టీ. భద్రాద్రి ఆలయానికి వచ్చి తలంబ్రాలు తీసుకురాలేనోళ్లు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడం లేదు?. తెలంగాణలోనే ఆ పార్టీకి అభ్యర్థులు దిక్కులేరు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఉండాల్సింది మోదీ సర్కారే. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణకు అధిక నిధులు వస్తాయి’ అని కామెంట్స్ చేశారు. -
ఎంబీటీతో ఎంఐఎంకు చెక్
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)కు మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ)తో చెక్ పెట్టే దిశలో అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగిన ఎంఐఎంను కట్టడి చేసేందుకు ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహంలో భాగంగా ఎంబీటీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ కొన్ని సమీకరణల నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదని, ఇప్పుడు ఆ ప్రతిపాదన అమల్లోకి వచ్చేలా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎంబీటీకి కేటాయించాలనే ప్రతిపాదన అధిష్టానం పెద్దల వరకు చేరింది. అంతకంటే ముందే జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో ఎంబీటీని చేర్చుకోవాలని, తద్వారా ఎంఐఎంకు దీటుగా ఎంబీటీని దేశ స్థాయిలో ప్రోత్సహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కూటమి సమావేశాల్లో ఎంబీటీని భాగస్వామిని చేయడంతో పాటు ఎన్నికల ప్రచార సభలకు ఆహా్వనించడం ద్వారా ఎంఐఎం ద్వారా బీజేపీకి కలుగుతున్న లబ్ధి, ఆ రెండు పార్టీల దోస్తీని ముస్లిం మైనార్టీలకు అర్థమయ్యేలా పాతబస్తీ పార్టీ అయిన ఎంబీటీతోనే చెప్పించాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ‘బస్తీ’మే సవాల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన ఎంఐఎం రాష్ట్ర ఏర్పాటు తర్వాత మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా తయారయింది. పాతబస్తీలో తనకున్న బలాన్ని, బలగాన్ని వేదికగా చేసుకుని అన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తూ నిలబడింది. దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందూ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పట్ల ఎంఐఎం వైఖరిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు అదనపు బలంగా, తమకు వైరిపక్షంగా మారిన ఎంఐఎంకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకుంది. పార్లమెంటు ఎన్నికలు మొదలుకుని ఇక ముందు జరిగే అన్ని ఎన్నికల్లోనూ పాతబస్తీలో ఒవైసీ సేనకు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ అంచనాలతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో ఎంబీటీ (యాకుత్‌పుర), కాంగ్రెస్ (నాంపల్లి) ఢీ అంటే ఢీ అనేలా ఎంఐఎంతో తలపడ్డాయి. చాలా తక్కువ తేడాతో ఓడిపోయాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిన నేపథ్యంలో ఎంబీటీని ముందుంచడం ద్వారా ఆ రెండింటితో పాటు మిగిలిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టవచ్చనే అంచనాల్లో కాంగ్రెస్ నాయకులున్నారు. ఈ ప్రయత్నంలోనే విజయం సాధిస్తామని, ఒకవేళ లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎంను కొంతమేర నిలువరించగలిగినా, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయానికి మరింత సమర్థవంతంగా ఎంఐఎంను ఢీ కొట్టగలుగుతామనేది అటు ఎంబీ టీ, ఇటు కాంగ్రెస్‌ల భావనగా కనిపిస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ‘అధికారంలో ఉన్నప్పుడే ఎంఐఎంను కట్టడి చేయగలం. ఇందుకు ఎంబీటీని వేదికగా చేసుకుని ముందుకెళితే మంచి ఫలితాలు రాబట్టగలుగుతాం. లోక్‌సభ ఎన్నికలే కాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మా రెండు పార్టీలు అవగాహనతో వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది.’అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ ఎన్నికలకు ముందే వాస్తవానికి, ఎంబీటీతో పొత్తుపై అసెంబ్లీ ఎన్నికలకు ముందే చర్చలు జరిగాయి. అప్పట్లో ఏఐసీసీ పరిశీలకురాలిగా వచ్చిన ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ రెండు, మూడుసార్లు భేటీ అయి చర్చలు కూడా జరిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చల అనంతరం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఎంబీటీతో స్నేహం నష్టం చేస్తుందనే భావనతో వెనక్కు తగ్గినట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే స్నేహం ద్వారా ఎంఐఎంకు చెక్ పెట్టే దిశలో ముందుకెళుతోంది. ఇందుకు ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ కూడా సుముఖంగా ఉన్నారు. పాతబస్తీలోని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ సానుభూతిపరులు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయానికి ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
TS: గులాబీ బాస్ గ్రాండ్ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ వెంటనే తుంటి ఎముకకు సర్జరీతో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 17న తన పుట్టినరోజును పురస్కరించుకుని గులాబీ బాస్ మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పుట్టినరోజు నాడే కేసీఆర్ హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ స్టేట్ ఆఫీస్ తెలంగాణ భవన్‌కు రానున్నారని సమాచారం. బాస్ రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. పుట్టినరోజు నాడు కేసీఆర్ తిరిగి తెలంగాణ భవన్‌కు రానుండటంతో భారీ ఎత్తున స్వాగత సన్నాహాలకు పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. బాస్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్ రీ ఎంట్రీ తర్వాత తొలుత సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌కు కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో వెళ్లనున్నారు. అక్కడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌తో సమావేశమవుతారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్, గజ్వేల్ క్యాంప్ ఆఫీసు వేదికగా కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. తాను త్వరలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతల సిద్ధమవుతున్నారు. ఇటీవల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ చీఫ్ కేసీఆర్ రీ ఎంట్రీపై హింట్ ఇచ్చారు. త్వరలో కేసీఆర్ తెలంగాణభవన్‌లో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు కూడా వెళ్తారని వెల్లడించారు. తుంటి ఎముకకు సర్జరీ కారణంగా ప్రస్తుత అసెంబ్లీ తొలి సమావేశాలకు రాలేకపోయిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. దీంతో రీ ఎంట్రీలో కొత్త ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఇదీచదవండి.. మేమూ రామ భక్తులమే : మంత్రి ఉత్తమ్ -
TS: మేమూ రామ భక్తులమే: మంత్రి ఉత్తమ్
సాక్షి, సూర్యాపేట: అయోధ్యలో జరగబోయే రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. తాము కూడా రామ భక్తలమేనని గుర్తు చేశారు. శనివారం సూర్యాపేటలో పర్యటిస్తున్న సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ఈవెంట్‌గా మారుస్తున్నాయని విమర్శించారు. ‘శంకరాచార్యులు, మఠాధిపతులు కొంతమంది రామమందిర ప్రాణప్రతిష్ఠకు దూరంగా ఎందుకు ఉంటున్నారో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధిస్తుంది. కేసీఆర్, కేటీఆర్ లాంటి వారు ఎవరు బరిలోకి దిగినా 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి యజ్ఞం మెరుగ్గా కొనసాగుతోంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తాం. అరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. గత ప్రభుత్వంలా కాకుండా, వివక్ష లేకుండా రాజకీయ పక్షపాతం లేకుండా సంక్షేమ ఫలాలు అందరికి అందిస్తాం’ అని ఉత్తమ్ అన్నారు. ఇదీచదవండి.. ఖర్గే నివాసంలో కీలక భేటీ.. ఈ రాత్రికే ప్రకటన -
ఖర్గే నివాసంలో కీలక భేటీ.. ఈ రాత్రికే ప్రకటన!
ఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ సారించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం సాయంత్రం నుంచి కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన వెలువడవచ్చని సమాచారం. ఈ భేటీకి ముందు.. టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. అంతకు ముందు.. శనివారం మధ్యాహ్నాం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో భాగంగానే ఈ వరుస భేటీలనేది స్పష్టమవుతోంది. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసి తీరతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లారాయన. ఇక.. ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపికపైనా ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. -
కాంగ్రెస్ 'అవిశ్వాస' రాజకీయాలు.. తెరవెనుక కీలక నేతలు!
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ కొత్త పంథాలో వెళ్తోంది. గ్రేటర్ పరిధిలో పార్టీ బలం పెంచుకోవడంపై ఫోకస్ పెంచింది. ముఖ్య నేతలను తమవైపుకు తిప్పుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల మున్సిపాలిటీలపై హస్తం నేతలు కన్నేశారు. మున్సిపల్ ప్రజా ప్రతినిధులు చాలా మంది తిరుబాటు జెండా ఎగురవేశారు. దీని వెనక కీలక నేతల హస్తం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ తెర ముందు జరుగుతున్న మంత్రాంగానికి తెర వెనక ఉన్న నేతలు ఎవరు అనే దానిపై ఆసక్తి కరమైన చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఫలితాలు సాధించలేదు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో.. దీన్ని అధిగమించి మంచి ఫలితాలు సాధించాలనే దానిపై హస్తం నేతలు దృష్టి పెట్టారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. దీనికి బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతల సహకారం లభించడంతో వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. చేవెళ్ల పార్లమెంట్‌కు కాంగ్రెస్ తరపున వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత తీసుకున్నారు. స్వయంగా సీఎం బాధ్యత ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా మొట్ట మొదటగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్‌పై దృష్టి పెట్టారు. ఇక్కడ మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉంటే.. 16 మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మేయర్ మహేందర్ గౌడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్‌కు వినతిపత్రం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ మహేందర్ గౌడ్‌ను దించేసి.. తిరుగుబాటు వర్గానికి చెందిన లతాప్రేమ్ గౌడ్‌ను మేయర్ పీఠంపై కూర్చొబెట్టాలని స్కెచ్ వేశారు. ప్రస్తుత మేయర్ మహేందర్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వర్గం కాగా.. లతా ప్రేమ్ గౌడ్ మాత్రం ఎంపీ రంజీత్ రెడ్డి వర్గం. ఇప్పుడు అవిశ్వాసం పెట్టి మహేందర్‌ను దించేసి.. ఎంపీ రంజీత్ రెడ్డి వర్గానికి చెందిన లతా ప్రేమ్ గౌడ్ మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. అయితే ఈ అవిశ్వాస తీర్మానం వెనక ఎంపీ రంజీత్‌రెడ్డి హస్తం ఉందనే టాక్ రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతోంది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న రంజీత్ రెడ్డి వర్గం తిరుగుబాటు చేయడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తిరుగుబాటు చేస్తున్న 16 మంది కార్పొరేటర్లు అందరూ హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. రంజీత్ వర్గానికి చెందిన నేతలంతా పార్టీ మారుతుండటంతో.. పార్లమెంట్ ఎన్నికల నాటికి రంజీత్ కూడా పార్టీ మారతాడా అనే చర్చ జోరుగా సాగుతోంది. చూడాలి ఈ వ్యవహారం మునుముందు ఎటువైపుకు దారి తీస్తుందనేదనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని జిల్లా పాలనాధికారి కార్యాలయంలో అదనపు కలెక్టర్‌కు పాత్రలను అందజేశారు. మొత్తం 24 సభ్యులకు 15 మంది బీఆర్ఎస్, ఇద్దరు బీజేపీ సభ్యులు మొత్తం 17మంది అదనపు కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస పత్రాలు అందజేశారు. ఇబ్రహీపట్నం మున్సిపాలిటీ నీ కాంగ్రెస్ కాపాడుకుంటుందా ? వదిలేసుకుంటుందా ? అనేది ఆసక్తిగా మారింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పైన అవిశ్వాస తీర్మానాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు. బీఆర్ఎస్, బీజేపీ, కౌన్సిలర్లు. కాంగ్రెస్ పార్టీ నుండి తొలత విజయం సాధించిన హార్దిక బీఆర్ఎస్ పార్టీలోకి చేరి చైర్మన్ అయ్యారు. మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నప్పటికీ హార్దిక స్థానంలో కాంగ్రెస్ వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది. -
ఆటో కార్మికులను రోడ్డున పడేశారు: హరీష్‌రావు
సాక్షి, సిద్దిపేట జిల్లా: కార్మికులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తూ మరొకరి ఉసురుపోసుకుందని వ్యాఖ్యానించారు. ఆటో కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. గ్రామాలకు మరిన్ని బస్సులు పెంచాలని హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను ప్రారంభించిన హరీష్‌రావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆటో కార్మికుల ఆలోచనలో మార్పు వచ్చిందని.. ఆటో కార్మికులు సొసైటీ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రానికే ఆదర్శమన్నారు. ఆటో కార్మికులను ఈ ప్రభుత్వం రోడ్డున పడేసిందని, ప్రభుత్వం వీరి కోసం ఆలోచన చేసి నెలకు రూ.15వేల జీవన భృతి ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. -
TS: తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు.. ప్రజలివ్వడమే మేలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నెల రోజుల పాలన సంతృప్తి ఇచ్చిందని చెప్పారు. సంతోషమే. కాకలు తీరిన యోధుడుగా పేరొందిన బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రేవంత్ పాలన నెలరోజులు సాఫీగానే సాగిపోవడం వరకు ఓకే.కాని తన పాలనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాకుండా ప్రజల నుంచి పొందగలిగితే ఆయనకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీడియా లో రేవంత్ సంతృప్తి ప్రకటించడం తప్పు కాదు. తానే ఏదైనా ఆడ్వర్స్ వ్యాఖ్య చేస్తే దాని ప్రభావం ప్రభుత్వంపైన, మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన ఉంటుంది.ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న అలాగే చెబుతారు. కాని ఒక్కసారి మొత్తం పరిస్తితిని సమీక్షిస్తే ప్రభుత్వం వచ్చిన కొత్త కనుక ఎవరికి వారు సర్దుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది.ఎవరైనా కామెంట్ చేసినా వారిపై ఎదురు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులే అయినా విమర్శలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.మంత్రులు కాని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాని ప్రస్తుతానికి ఒకింత అయోమయ పరిస్థితిలో ఉన్నారనిపిస్తుంది. కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలిగారు కాని, తాము ఈ ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లుగా ఉంది. ఆయా నిర్ణయాలను మార్చుకోవలసి రావడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడం ఎలా అన్నది అర్ధం కాక తలపట్టుకుంటున్న తీరు కనిపిస్తూనే ఉంది. ఇవి ఒక ఎత్తు అయితే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి ముఖ్యమంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించేవి. మల్లు భట్టి నేరుగా అనకపోయినా, ఆయన మనసులోని మాటను భార్య బయటపెట్టారని అనుకోవచ్చు. మరో వైపు ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు క్యాబినెట్ లో బాగా ప్రాదాన్యం ఉందని చెప్పడంపై కూడా కాంగ్రెస్‌లో చెవులు కొరుక్కుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘట్టాలు మరెన్నో వచ్చే అవకాశం ఉంది. కర్నాటకలో సైతం పదవుల పంచాయతీ తెగడం లేదు. తెలంగాణ కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. ఈ అంశాన్ని పక్కనబెడితే రేవంత్‌రెడ్డి కొన్ని తప్పులు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రేవంత్ దురుద్దేశంతో పొరపాట్లు చేశారని చెప్పకపోయినా, ఆయన కొన్ని నిర్ణయాలలో కొంత అనుభవ రాహిత్యం తెలుస్తుంది. ఉదాహరణకు ఫార్మాసిటీ రద్దు ప్రకటన ప్రభుత్వానికి నష్టం చేసిందన్న అభిప్రాయం ఉంది.దాంతో సర్దుబాటు ధోరణికి వెళ్లి పార్మాసిటీని ఏదో విభజిస్తామని,ఇంకేదో చేస్తామని చెప్పినా, దానిలో స్పష్టత లేదు. ఫార్మాసిటీ ఆధారంగా జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు దెబ్బతిన్నాయన్న భావన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మందగించింది. ఈ ప్రభుత్వం వచ్చాక అది ఇంకా మెరుగు కాలేదు. కొద్ది రోజుల క్రితం కూడా మీడియాలో వచ్చిన కధనాలు చూస్తే వేలాది అపార్టుమెంట్ల అమ్మకాల కోసం ఎదురు చూస్తున్నాయి. భూముల క్రయ,విక్రయాల లావాదేవీలు ఆశించినంతగా పుంజుకోలేదు.గత ప్రభుత్వ టైమ్ లో అట్టహాసంగా ప్రచారం పొందిన ఎఫ్ 1 కార్ రేసింగ్ ఒప్పందాన్ని రద్దు చేయడం , ఆ సంస్థను తిరిగి డబ్బు చెల్లించాలని నోటీసు ఇవ్వడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది. రేవంత్ పై దాడి చేసే మీడియా లేకపోయింది కాబట్టి సరిపోయింది కాని, ఈపాటికి గందరగోళం సృష్టించి ఉండేవి. ఉదాహరణకు ఎపిలో ఇలాంటి నిర్ణయాలు ఏవి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా రచ్చ,రచ్చ చేసి ఉండేవి. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని సమాచారం వచ్చింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం. గతంలో జగన్ ప్రభుత్వం ఎపిలో పిపిఎల సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఎంత రభస చేశాయో గమనిస్తే, ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌కు అలాంటి ఇబ్బందులు లేవని అర్ధం చేసుకోవచ్చు. దానికి కారణం ఈనాడు రామోజీరావుకు తెలంగాణలో ఆస్తులు అధికంగా ఉండడం, తాను భుజాన వేసుకుని తిరిగే తెలుగుదేశం పార్టీ కూడా రేవంత్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తుండడంతో ఆయన నోరు మెదపడం లేదు. ఇక ఆంద్రజ్యోతి రాదాకృష్ణ అయితే ప్రస్తుతానికి రేవంత్ ప్రభుత్వాన్ని తెగ పొగిడేస్తున్నారు. దీనికి కూడా ఒక కధ లేకపోలేదు. మధ్యలో కొద్దిరోజులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలని కొన్ని కదనాలు ఇచ్చారట.దాంతో రేవంత్ దిగి వచ్చి రాధాకృష్ణ కోరినట్లు వ్యవహరించారన్న అభిప్రాయం వ్యాప్లిలోకి వచ్చింది. ముఖ్యంగా ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా , ఆంధ్రజ్యోతికి మాత్రం ఇవ్వక తప్పలేదు.దానికి కారణం రాదాకృష్ణ బ్లాక్ మెయిలింగేనని రాజకీయవర్గాలలో ప్రచారం అయింది. పైగా రేవంత్‌ను ముఖ్యమంత్రిగా కాకుండా, అదేదో తన అదీనంలో ఉన్న వ్యక్తి మాదిరి ఆయన ఇంటర్వ్యూ చేశారని పలువురు వ్యాఖ్యానించారు. రాధాకృష్ణ ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలి అంత అహంకారపూరితంగా ఉన్నాయని అంటున్నారు. రేవంత్ వీటిని భరించడమే కాకుండా, రాధాకృష్ణ ట్రాప్‌లో పడి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పరోక్షంగా కించపరుస్తున్నట్లుగా మాట్లాడారని సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం అయింది.ప్రత్యేకించి ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కొనుగోళ్ల లావాదేవీలు మొదలైనవాటికి సంబందించి అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ప్రకృతి జవాబు ఇచ్చిందన్నట్లుగా వ్యాఖ్యానించడం నిజంగానే అభ్యంతరకరం అని చెప్పకతప్పదు. నిజానికి ఏపాటి కొద్ది అనుభవం ఉన్న జర్నలిస్టు అయినా ఒక ప్రశ్న కచ్చితంగా వేసి ఉండేవారు.రేవంత్ కూడా గతంలో ఒక నామినెటేడ్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో పట్టుబడిన సంగతిని గుర్తు చేసేవారు.ఆ ప్రశ్న వేయకుండా వైఎస్ ఆర్ ను కించపరిచేలా రాధాకృష్ణ ప్రశ్నించడం, దానికి రేవంత్ సమర్ధించడం బాగున్నట్లు అనిపించదు.అయినా ప్రస్తుతం రేవంత్ నిస్సహాయుడని అనుకోవాలి. ఇదే రేవంత్ ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ ఆర్ ను పొగిడిన ఘట్టాలు మరచిపోయి మాట్లాడినట్లు అనిపిస్తుంది.ఎపి ముఖ్యమంత్రి జగన్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలను రాధాకృష్ణ చేయించారు. జగన్ పోన్ చేసి అభినందించలేదని రాధాకృష్ణ అన్నప్పుడు అలా ఎందుకు! ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు కదా అని అనిఉండాల్సింది.అలాకాకుండా భిన్నంగా మాట్లాడడం అంత సరికాదనిపించింది. పైగా ఇదే రాధాకృష్ణ గతంలో జగన్ పోన్ చేస్తే రేవంత్ పోన్ ఎత్తలేదని, అదేదో గొప్ప విషయంగా రాశారు. రేవంత్‌ను రాదాకృష్ణే నడిపిస్తున్నారన్న భావన ప్రబలితే అది ఆయనకే నష్టం అని చెప్పాలి. ప్రజావాణి, ప్రజాపాలన వంటి విషయాలలో ప్రభుత్వానికి అంత మంచి మార్కులేమీ రాలేదు. ఆర్టిసి బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం వరకు కాస్త పాజిటివ్ గా ఉన్నా దాని దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా కనిపించేలా ఉంది.ప్రజా పాలన పేరుతో సంబంధిత ఆరు గ్యారంటీల స్కీముల కోసం తెలంగాణ ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్లపై క్యూ కట్టవలసి రావడం, ఆ దరఖాస్తులు ఒక చోట రోడ్లపై కనిపించడం కూడా అప్రతిష్టే అయింది.ఇక్కడే ఎపి తో పోల్చుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. రైతు భరోసా కింద గత నెల తొమ్మిదిన వేస్తామన్న పదిహేనువేల రూపాయలు రైతుల ఖాతాలలో పడకపోవడం అసంతృఫ్తికి దారి తీసింది.ఇళ్లకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే ఇవ్వడం వంటివి ఇంకా మొదలు కాలేదు. ఇవన్ని ఒక రూపానికి వచ్చి ఎప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్దుకుంటుందో ఎవరూ చెప్పలేరు. - కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్. -
TS: ఎమ్మెల్సీలు.. నామినేటెడ్ జాబితా..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈ నెల 18 నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో అధిష్టానం నుంచి ఆమోదం పొందేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 14న దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి, హైకమాండ్ ఆమోదముద్ర వేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల పేర్లతో పాటునామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కొందరి పేర్లతో కూడిన జాబితాను సీఎం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఈ విషయమై శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియాగాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అవుతారని తెలిసింది. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుస్తారని సమాచారం. ఆ ఇద్దరు ఎవరో..? రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలో అంతర్గతంగా చాలామంది పోటీ పడుతుండగా, సీఎం ఢిల్లీ వెళ్లడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్ అభిప్రాయాన్ని తీసుకుని అధిష్టానానికి నివేదించారు. రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి అభిప్రాయం కూడా పార్టీ పెద్దలు తీసుకున్నారు. కాగా ఈ స్థానాల కోసం ఎస్సీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. అద్దంకి దయాకర్, మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్‌తో పాటు చిన్నారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం? గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా స్థానం భర్తీపై కూడా హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుండగా, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టులకు పోటీ పదుల సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులకు నామినేట్ అయ్యేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. అయితే వీటిలో ప్రధానమైన కార్పొరేషన్ల విషయంలో, ఇటీవలి ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నాయకులు, పార్టీ కోసం కష్టపడిన పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. రాహుల్‌తో కలిసి ఇంఫాల్‌కు సీఎం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి రాహుల్‌తో కలిసి ఆయన ఇంఫాల్ వెళతారు. యాత్ర ప్రారంభం తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుని అదేరోజు సాయంత్రం దవోస్కు బయలుదేరి వెళ్తారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్తారు.