breaking news
-
కేజ్రీవాల్, కవితల అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, శాసనమండలి సభ్యురాలు కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రింకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలోనే, సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందుగా, అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోది తెలంగాణలో పర్యటిస్తున్న తరుణంలోనే ఈ అరెస్టు జరగడం విశేషం. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంటిపైకి దాడి చేసి, సోదాలు చేసి ఆయనను అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారిగా కనిపిస్తుంది. కేజ్రీవాల్, కవితలకు ఈడీ ఇచ్చిన ఒకటి, రెండు నోటీసులకు స్పందించారు. విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వారికి అరెస్టు అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ విచారణకు హాజరవకుండా కాలయాపన చేశారు. ఎవరు అక్రమాలకు పాల్పడినా చర్య తీసుకోవడం తప్పు కాదు. కానీ ఈ దర్యాప్తు సంస్థలు వేల కోట్ల అక్రమాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న వారిని చూసి, చూడనట్లు వదిలేస్తూ, వంద కోట్లు ఆరోపణలపై ఇంత గట్టిగా హడావుడి చేయడం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసుకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ ప్రభుత్వంపై కోపంతోనే, అక్కడ బీజేపీకి ఉన్న బలం తగ్గడంతోనే తన చేతిలోని అధికారాన్ని బీజేపీ ఇలా వినియోగిస్తోందన్నది పలువురి అభియోగం. లిక్కర్ స్కామ్ జరిగింది కనుకే అధికారులు చర్య తీసుకున్నారన్నది బీజేపీ వాదన. 2023 శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందే కవితను ఈ కేసులో అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరిగింది. ఎందువల్లో కానీ అలా జరగలేదు. దాంతో బీఆర్ఎస్, బీజేపీల మద్య రాజీ కుదిరిందేమో అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీనివల్ల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కొంత నష్టం జరిగింది. కనీసం ఇరవై సీట్లు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నది బీజేపీ నేతల మనోగతంగా ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నందున, మాచ్ ఫిక్సింగ్ ఆరోపణ చేయడానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వరాదన్న లక్ష్యంతోనే ఈ అరెస్టుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చని చాలామంది నమ్ముతున్నారు. కానీ ఇందువల్ల బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందా అన్నది చర్చనీయాంశం. ప్రస్తుతం బీఆర్ఎస్ విపక్షంలో ఉంది. తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. అలాంటప్పుడు తమవంతుగా ఒక దెబ్బకొట్టి బీఆర్ఎస్ను ఇంకా బలహీనపరిస్తే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని బీజేపీ నేతలు భావించి ఉండవచ్చు. విశేషం ఏమిటంటే బీజేపీ ఢిల్లీలో జరిగినట్లు చెబుతున్న వంద కోట్ల రూపాయల స్కామ్ పై ఇంత శ్రద్ద చూపుతోంది కానీ, వేల కోట్ల స్కామ్‌ల గురించి పట్టించుకోకుండా, తమ వైపునకు వస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులలోకానీ, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కొందరిపై ఉన్న కేసులలో కానీ,ఆదర్శ్ స్కామ్ లో పదవీచ్యుతుడైన కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీ మారి బీజేపీలో చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చిన తీరుకానీ, చీలిక వర్గం శివసేన, చీలిక వర్గం ఎన్సీపీ నేతల పట్ల అనుసరించిన వైఖరులు కానీ ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. కవిత ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం తప్పే అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆప్‌కు చెందిన మంత్రి మనీష్ సిసోడియా ఇదే కేసులో సంవత్సర కాలంగా జైలులో ఉన్నారు. లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించడానికి వీలుగా విధానాన్ని మార్చడంపై వచ్చిన ఆరోపణలు, ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు కనుక, కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీ వంటి వాటిని ప్రయోగించగలిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఆ పార్టీని ఇరుకున పెట్టాలని బీజేపీ తలపెట్టిందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. నిజంగానే అవినీతిపై బీజేపీ ఫోకస్ పెడితే మంచిదే. అలాకాకుండా కేవలం ప్రత్యర్ధులను భయపెట్టడానికి, తన రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికే ఈడీ, సీబీఐ వంటివాటిని వాడితే అది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లే అవుతుంది. గతంలో బీజేపీ ఈ సంస్థలపై, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసిందో, అదే పని ఇప్పుడు బీజేపీ కూడా చేస్తుందని భావించవలసి ఉంటుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదిని టెర్రరిస్టుతో పోల్చారు. సీబీఐ, ఈడీ వంటివాటితో తమపై దాడులు చేయిస్తోందని ద్వజమెత్తేవారు. సీబీఐ తనను అరెస్టు చేయడానికి రావచ్చని, అప్పుడు ప్రజలంతా తన చుట్టూ నిలబడి రక్షించుకోవాలని అనేవారు. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని ఆదేశాలు కూడా ఇచ్చారు. అప్పట్లో కొందరు టీడీపీ ప్రముఖులపై ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలు దాడులు చేశాయి. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలయ్యాక, చంద్రబాబుకు పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో ఐటీ శాఖ సోదాలు చేసి రెండు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలకు సంబంధించిన ఆదారాలు దొరికినట్లు సీబీటీడీ ప్రకటించింది. అలాగే చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ మనీ లాండరింగ్ తదితర ఆరోపణలకు సంబందించి పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన ఏదో రకంగా వాటి నుంచి బయటపడుతూనే ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన వెంటనే చంద్రబాబు యుటర్న్ తీసుకుని ప్రధాని మోదిని, బీజేపీని పొగడడం ఆరంభించారు. అంతవరకు మోది అంత అవినీతి పరుడు లేడని, టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏలతాడని అంటూ వ్యక్తిగతంగా చంద్రబాబు దాడి చేసేవారు. కానీ ఓటమి తర్వాత బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయారు. తన పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించారు. పవన్ కల్యాణ్‌ను బీజేపీ గూటికి పంపించి, తనకు, బీజేపీకి మధ్య రాయబారిగా వాడుకున్నారు. బీజేపీ కూడా చంద్రబాబు కేసుల జోలికి రాకుండా వదలిపెట్టేసిందని అనుకోవాలి. ఏపీలో చంద్రబాబు టైమ్ లో జరిగిన పలు కుంభకోణాలలో సీబీఐ దర్యాప్తు కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లేఖ రాసినా కేంద్రం స్పందించలేదంటేనే చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ ఏ రకంగా ఉన్నది జనం అర్దం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతి పరుడని, పోలవరాన్ని ఏటీఎమ్‌గా వాడుకున్నారని మోది ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు సంచలన ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్‌లకు 150 కోట్ల మేర ముడుపులు చెల్లించామని చెప్పారు. అయినా ఈడీ, సీబీఐ ఏవీ స్పందించలేదు. ఐటీ ఇచ్చిన నోటీసులో దుబాయిలో జరిగిన మనీలాండరింగ్ గురించి కూడా ప్రస్తావించినా తదుపరి చర్యలేదు. చంద్రబాబు ఏపీలో స్కిల్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టు అయితే బీజేపీ అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్‌షాను కలిసి సాయం చేయాలని అడిగారు. ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది! తాజాగా హైదరాబాద్‌లో ఐఎమ్.జి భరత్ అనే సంస్థకు అప్పనంగా 850 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన కేసులో సీబీఐ విచారణ జరగాలని హైకోర్టు అబిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయమై ప్రశ్నించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎటూ చంద్రబాబు శిష్యుడే కనుక దానినుంచి తప్పించవచ్చు. ఈ రకంగా అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ను మేనేజ్ చేసే విధంగా చంద్రబాబు వ్యవహరించగలుగుతున్నారని చెప్పాలి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనేవారు. కానీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు కొందరు, న్యాయ వ్యవస్థలోని ఒకరిద్దరు ప్రముఖులు అండగా నిలిచి చంద్రబాబుపై కేసు రాకుండా చూడగలిగారు. ఇలా పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు జోలికి ఈడీ, సీబీఐ వంటివి ఎందుకు రావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి చెబుతాం. బీజేపీలో చేరిన సుజనా చౌదరి సుమారు ఏడువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు ఎగవేశారని, మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయినా పార్టీ మారగానే ప్రధాని ఎదురుగా కూర్చోగలిగారు. అలాగే చంద్రబాబు కూడా మోదితో కలిసి సభలో పాల్గొనగలిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేర్పరితనం కేసీఆర్‌లో, కేజ్రీవాల్లో కొరవడడం వల్లే ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే కేజ్రీవాల్ జైలు పాలయ్యారా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించడానికి ప్రయత్నించడం, ప్రధాని మోదిపై, బీజేపీ నేతలపై తీవ్రంగా విమర్శలు గుప్పించడం వంటివి చేశారు. తొలుత మోదితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నా, ఎందువల్లో కేసీఆర్ ఆయనకు దూరం అయ్యారు. చివరికి పలకరించుకోలేని స్థితికి వచ్చారనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా తన కుమార్తెను అరెస్టు చేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఇంకో వైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ నేతలపై దాడి పెంచింది. ఎంపీగా పోటీచేయాలని ఉబలాటపడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెక్ పెడుతూ ఆయన కుటుంబానికి చెందిన కాలేజీలో ప్రభుత్వ స్థలంలో రోడ్డు వేశారని అధికారులు తవ్వేశారు. ఆక్రమిత స్థలంలో భవనాలు కట్టారని వాటిని కూల్చివేశారు. దీంతో మల్లారెడ్డి కర్నాటకకు పరుగెత్తి డీకే శివకుమార్‌ను వేడుకున్నారు. ఆ మీదట తాము ఎంపీ సీటుకు పోటీచేయడం లేదని ప్రకటించారు. అంతేకాక బీఆర్ఎస్ నుంచి ఎందరు దొరికితే అందరిని కాంగ్రెస్, బీజేపీలు గుంజుకుంటున్నాయి. ఎంపీలు కొందరిని బీజేపీ లాగితే ఎమ్మెల్యేలు ఇంతవరకు పదహారు మందిని కాంగ్రెస్ లాగేసినట్లేనని చెబుతున్నారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి మద్దతు ఇస్తున్నారట. అందువల్లే తన ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఆయన ఉన్నారు. పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి సోదరుడిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేశారు. ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ ధోరణులేనని బీఆర్ఎస్ అంటోంది. కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. కానీ అప్పట్లో ఈ రకంగా దాడులు జరగలేదు. వారిని ప్రలోభపెట్టి ఆకర్షించుకున్నారు. అయినా అది కూడా విమర్శలకుగురి అయింది. ఇప్పుడు దాని ఫలితం అనుభవించవలసిన పరిస్థితి ఎదురైంది. నైతికంగా కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దానిని తప్పు పట్టలేని దైన్యంలో కేసీఆర్ పడ్డారు. ఈ పరిణామాలన్నీ చూస్తే తెలంగాణలో బలపడడానికి కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న గేమ్‌లో బీఆర్ఎస్ బలి అవుతుందా అన్న సందేహం వస్తుంది. అయితే కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయజాలం. ఆయన పలు డక్కీలు తిన్నవాడే. వీటన్నిటిని ఎలాంటి వ్యూహాలతో తిప్పి కొట్టి బీఆర్ఎస్ను సురక్షితంగా నిలబెట్టుకుంటారో చూడాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదేమాదిరిగా చిత్తశుద్దితో కాకుండా ప్రత్యర్ధులను లొంగదీసుకునే వ్యూహాలనే అమలు చేస్తే ఏదో ఒక రోజు దెబ్బతింటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఎన్నికల వ్యూహాలపై...నేడు బీజేపీ కీలక భేటీలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... ఆది వారం బీజేపీకి సంబంధించి రెండు ము ఖ్యమైన సమావేశా లు జరగనున్నాయి. ఈ భేటీల్లో పార్టీ పరంగా ఎన్నికల వ్యూహాల ఖరారుతో పాటు, ప్రచార వ్యూహం, లేవనెత్తా ల్సిన అంశాలు, లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న భేటీలో... పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం విడిగా రాష్ట్రపార్టీ ముఖ్యనేతల సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశాలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపా ధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రపార్టీ ఇన్చార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్ ఇతర నాయ కులు పాల్గొంటారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలను రూపొందించడం, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎండగట్టడంతోపాటు హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఖరారు చేస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి రాజీనామా
సాక్షి ప్రతినిధి నల్లగొండ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి శనివారం ఆ పారీ్టకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించిన రోజే ఆయన రాజీనామా చేయ డం గమనార్హం. రాజీనామా లేఖలో ఈనెల 18న రాజీనామా చేసినట్లు పేర్కొనగా, చిన్నపరెడ్డి ఈ రోజే రాజీనామా చేశారని, టైపింగ్ ఎర్రర్ వల్ల అలా వచ్చిందని ఆయన అనుచరులు పేర్కొన్నారు. నల్ల గొండ ఎంపీ అభ్యర్థిగా చిన్నపరెడ్డిని బరిలో నిల పాలని మొదట్లో బీఆర్ఎస్ భావించింది. అయితే ఆయన బీజేపీకి టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరగడంతో చిన్నపరెడ్డి పేరును పక్కన పెట్టింది. కానీ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, టికెట్ తనకే వస్తుందని చిన్నపరెడ్డి రెండ్రోజుల కిందట చెప్పారు. బీఆర్ఎస్ అధిష్టానం అనూహ్యంగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. బీజేపీ అధిష్టానం హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరును ప్రకటించింది. 15 రోజులు గడవక ముందే ఆయన్ను మార్చి చిన్నపరెడ్డికి టికెట్ ఇస్తారన్న చర్చ కూడా సాగుతోంది. కంచర్ల కృష్ణారెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
డీకే అరుణ సోయి లేకుండా మాట్లాడుతున్నారు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యక్తిగతంగా, సోయిలేకుండా మాట్లాడటం తగదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వనితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేవలం కుటుంబ సభ్యుల వ్యాపారాలు, స్వలాభం కోసమే ఆమె రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు. 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు పన్నారని, అయినా అక్కడి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందానని పేర్కొన్నారు. 2006 నుంచే ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నానని, ఆమెకు 2014 వరకు కాంగ్రెస్‌లో సభ్యత్వమే లేదన్నారు. ఎన్నో పార్టీలు మారిన డీకే అరుణ బీసీ ద్రోహి అని విమర్శించారు. తాను నాన్–లోకల్ కాదని ఉమ్మడి పాలమూరు బిడ్డనని వంశీచంద్‌రెడ్డి చెప్పారు. అప్పట్లో పాన్‌గల్ జెడ్పీటీసీ సభ్యురాలిగా కాంగ్రెస్ నుంచి డీకే అరుణ గెలుపొందినప్పుడు ఆమెకు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కేవలం కాంట్రాక్టులు, లిక్కర్ దందాలు, ధనార్జన కోసమే రాజకీయాల్లో ఉన్న ఆమె బండారం బయటపెడతామన్నారు. ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి ఓడిపోతాననే అక్కసుతో ఎలాంటి సోయి లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కనీసం తన పుట్టిన ఊరు ధన్వాడ మండలానికి గానీ, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకుగానీ అరుణ ఏమీ చేయలేకపోయారని, రాజకీయ విలువలు లేని ఆమె తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. -
తండాల స్థాయి నుంచి కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం గిరిజన నేతలు కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ కోరారు. తండాల స్థాయి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గాందీభవన్‌లో శనివారం జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. లోక్‌సభ అభ్యర్థులతో గిరిజన విభాగం సమ న్వయం చేసుకోవాలని, ప్రతి అసెంబ్లీ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, పార్ల మెంట్ నియోజక వర్గాల వారీగా భారీ సభలను గిరిజనులతో ఏర్పాటు చేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీని ప్రధాని చేయడంలో గిరిజనులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్ల య్యనాయక్ మాట్లాడుతూ...అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే రాష్ట్రంలో 13–14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వైస్ చైర్మన్ రఘు నాయక్, కోఆర్డినేటర్లు గణేశ్ నాయక్ పాల్గొన్నారు. -
9–12 సీట్లలో గెలుపు మనదే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో 9 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమై కవిత అరెస్టు, ఢిల్లీ పరిణామాలను వివరించారు. దీంతో పార్టీపరంగా చేయాల్సిన న్యాయ, రాజకీయ పోరాటంపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలపై చర్చించారు. పోటీ చేసే పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయినందున అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బీఆర్ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ అమలు చేస్తున్న ఎత్తుగడలను విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 12 నుంచి 14 స్థానాల్లో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని అంచనా వేసిన కేసీఆర్.. 9 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక కోణంలో అభ్యర్థుల ఎంపిక సంతృప్తికరంగా ఉందని, ఈ పరిస్థితుల్లో పార్టీ యంత్రాంగం పకడ్బందీగా పనిచేసేలా ప్రణాళికలతో ముందుకు వెళితే విజయం సాధించవచ్చని నేతలు భావించినట్లు సమాచారం. బహిరంగ సభలకు కేసీఆర్.. లోకసభ నియోజకవర్గాలవారీగా రెండు లేదా మూడు బహిరంగ సభలకు కేసీఆర్ హాజరు కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. బస్సు యాత్ర సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. సభలు, సమావేశాల షెడ్యూల్, ఇన్చార్జిల నియామకంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మీడియా, సోషల్ మీడియా వ్యూహంపైనా పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడిన చోట ఇన్చార్జీలను నియమించాలని నిర్ణయించారు. పార్టీ సమన్వయ బాధ్యతలను కేటీఆర్, హరీశ్‌లకు అప్పగించారు. స్వయంగా వివిధ మీడియా మాధ్యమాల్లో కేసీఆర్‌తో ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా ఎమ్మెల్సీ దండే విఠల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీలదే హవా.. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పని అయిపోతుందని.. కేంద్రంలో బీజేపీకి కూడా ఈసారి చివరి అవకాశం ఉండొచ్చని... భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలదే హవా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. శనివారం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్‌లో తన్నులాటలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇతరులు కూల్చే అవసరం లేదని, వాళ్లకు వాళ్లే కూల్చుకుంటారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నుంచి పోయేవాళ్లను పోనివ్వాలని.. బీఆర్ఎస్లో జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ బాధ్యతలను మన్నె గోవర్ధన్ చూసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో కేటీఆర్, ఎమ్మెల్యేలు తలసాని, మాగంటి గోపీనాథ్, ముఠాగోపాల్, కాలేరు వెంకటేష్, నాయకులు దాసోజు శ్రవణ్, మన్నెగోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్ మన్నె కవిత తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మనుషులు హైదరాబాద్‌లో కూర్చుని ఆర్జీ (రాహుల్ గాంధీ) ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. ఒక చదరపు మీటర్‌కు ఇంత అని రేటు పెట్టి మరీ.. కంపెనీలు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నడిచేందుకు తెలంగాణ సొమ్ముపైనే ఆధారపడుతోంది. గతంలో తమిళ నాడు, ఆ తర్వాత కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి ఉండగా.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ వసూ ళ్లకు అడ్డాగా మారింది..’’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. శనివా రం ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వాయి హరీశ్‌బాబు, నేతలతో కలసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన వివిధ సెటిల్మెంట్లను రాహుల్‌గాంధీ మనుషులు మళ్లీ బయటికి తీస్తున్నారని.. ఢిల్లీ వెళ్లి మాట్లాడుకుని, ఆర్జీ ట్యాక్స్ చెల్లించి రావాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ భూలావాదేవీలు అంటూ గతంలో ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు వాటిపై దర్యాప్తు చేసే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్..: హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా అక్రమార్కులకు అప్పజెప్పారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదు? బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. సెటిల్మెంట్ రాజకీయాలు చేస్తోంది’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు దీనంతటినీ భరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతికి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అప్పట్లో రేవంత్ అన్నారని.. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు జరిపించాలని తనకు సవాల్ చేశారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ అధికారంలో ఉన్నారని, కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పాత్ర అప్రస్తుతమై పోయిందని, అసలు ఆ పార్టీ పోటీచేయాల్సిన అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ఏమైనా ఉంటే అది కాంగ్రెస్‌తోనేనని పేర్కొన్నారు. లిక్కర్ స్కాంపై బహిరంగ చర్చకు సిద్ధమా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో వందల కోట్లు చేతులు మారాయని తాను నిరూపిస్తానని, అది తప్పని మాజీ సీఎం కేసీఆర్ చెప్పగలరా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు ధైర్యముంటే ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. అవినీతికి పాల్పడిన వారిని దర్యాప్తు సంస్థలు సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తే.. అది ప్రజాస్వామ్యానికి చీకటిరోజు, కక్షసాధింపు ఎలా అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను కేసీఆర్ బ్లాక్‌డే అనడం గురువింద గింజ సామెతను గుర్తుకు తెస్తోందని విమర్శించారు. తన కుమార్తె కవిత అరెస్ట్ అయినప్పుడు స్పందించని కేసీఆర్.. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక స్పందించడం వెనక మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. ఆ అరెస్ట్‌లతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. -
సికింద్రాబాద్ బరిలో ‘పజ్జన్న’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య ర్థిగా మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్ పేరును పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు వారంపాటు ఢిల్లీలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు కూడా శనివారం జరిగిన ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో చర్చించి అందరి అభిప్రాయం మేరకే పద్మారావు గౌడ్ అభ్య ర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అలాగే నల్లగొండ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్య ర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును గతంలోనే ఖరారు చేయగా తాజాగా మరోమారు కీలక నేతలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి కంచర్ల కృష్ణారెడ్డి సోదరుడు కావడం గమనార్హం. భువనగిరి స్థానం నుంచి కురుమ సామాజికవర్గానికి చెందిన క్యామ మల్లేశ్ యాదవ్ పేరును ఖరారు చేశారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితోపాటు జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరుల పేర్లను పరిశీలించినా సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా క్యామ మల్లేశ్ అభ్య ర్థిత్వం వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. మొత్తంగా 17 ఎంపీ సీట్లకుగాను తాజాగా ప్రకటించిన ముగ్గురు పేర్లతో బీఆర్ఎస్ 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి కూడా బలమైన అభ్య ర్థిని బరిలోకి దింపుతామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే అంశంపై స్పష్టత రానుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నిక అభ్యర్థి పేరును కూడా వీలైనంత త్వరగా ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. కాగా, భువనగిరి నుంచి తనను అభ్య ర్థిగా ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ క్యామ మల్లేశ్ యాదవ్ శనివారం కేసీఆర్‌ను కలిశారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ఈ భేటీలో పాల్గొన్నారు. ఎంపీగా పోటీకి విముఖత చూపినా బుజ్జగించి.. బీఆర్ఎస్ సీనియర్ నేతగా, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పారీ్టకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నందునే ఆయన పేరును ఖరారు చేసినట్లు కేసీఆర్ ప్రకటించారు. సికింద్రాబాద్ అభివృద్ధికి చేసిన కృషి, స్థానిక నేతగా ‘పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ సరైన అభ్య ర్థిగా సమావేశం ఏకగ్రీవంగా అంగీకరించినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది. రెండు రోజుల క్రితం పద్మారావు అభ్య ర్థిత్వం తెరపైకి రాగా పోటీకి ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే పద్మారావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులను ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు పిలిచి మరీ బుజ్జగించినట్లు సమాచారం. జాబితాలో బీసీలకు ప్రాధాన్యత ఇప్పటి వరకు ప్రకటించిన 16 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజికవర్గాలవారీగా రెడ్లకు 4, మున్నూరు కాపు 2, మాదిగలకు 2, కమ్మ, వెలమ, ముదిరాజ్, గౌడ, కురుమ, లంబాడా, గోండులకు ఒక్కో సీటు చొప్పున కేటాయించింది. హైదరాబాద్ నుంచి కూడా బీసీ అభ్య ర్థినే రంగంలోకి దింపే అవకాశం ఉంది. దీంతో జనరల్ స్థానాల్లో సగం చోట్ల బీసీ అభ్యర్థులే పోటీ చేయనున్నట్లు కానుంది. బీఆర్ఎస్కు ప్రస్తుతం లోక్‌సభలో తొమ్మిది మంది ఎంపీలు ఉండగా వారిలో సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే పోటీ చేస్తున్నారు. మరో ఐదుగురు ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలలో చేరారు. -
తుక్కుగూడ నుంచే శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కలసివచ్చిన తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని సమాచారం. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని, మేనిఫెస్టో తెలుగు ప్రతులను ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. కాగా, ఈ సభ నిర్వహణ కంటే ముందే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభ అనంతరం సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. ఆయన బస్సులో ప్రచార యాత్ర చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, బస్సు యాత్ర చేయాలా? అలా వెళ్తే ఎంత మంది నేతలు వెళ్లాలి? లేదా ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలు పెట్టి కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలా అన్న దానిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
చర్చకు సిద్ధం.. కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: బీరు, బ్రాందీ వ్యాపారాలు చేసి.. ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిలదీశారు. శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దర్యాప్తు సంస్థల నోటీసులకు ఆన్సర్ ఇవ్వకుండా కేజ్రీవాల్ తప్పించుకొని తిరిగారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ దీని మీద డొంక తిరుగులు తిరుగుతూ.. సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు కాదు.. సాక్ష్యాలు ఉన్నాయి. కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధం లేదని కేసీఆర్ చెప్తారా?. ఆప్ నేతలకు ఢిల్లీ స్కాంకి ఆప్ నేతలకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? అంటూ కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వందల కోట్లు చేతులు మారాయని నేను నిరుపిస్తా?. ఇది తప్పని కేసీఆర్ నిరుపిస్తారా?. దీనిపై చర్చకు ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధం. బీఆర్ఎస్ నేతలు కవిత అరెస్ట్‌కు, తెలంగాణకు సంబంధం పెడుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను కాంగ్రెస్ కూడా తప్పు బడుతుంది. దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాంగ్రెస్ అంటేనే స్కాంలు చేసే పార్టీ. కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచే ప్రయత్నం చేస్తుంది’’ అని ధ్వజమెత్తారు. ‘‘గతంలో కేసీఆర్ అవినీతిపై రేవంత్ మాట్లాడారు. మేడిగడ్డ దర్యాప్తు ఏమైంది?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖరాసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తు చేయలేమని వారు రీప్లే ఇచ్చారు. ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా?. మీకు దమ్ముంటే సీబీఐ దర్యాఫ్తు కు లేఖ రాయండి. మీరు లేఖ రాసిన రెండు గంటల్లో అనుమతి ఇప్పించే బాధ్యత నాది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదీ చదవండి: బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు -
రేవంత్‌రెడ్డిపై వీహెచ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి.. నీస్థాయిని నీవు తగ్గించుకుంటున్నావ్ అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీహెచ్.. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారు. అలాంటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారు?. వారిని పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు అన్యాయం చేయొద్దు. రేవంత్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడం సరికాదు. ఆయన తన స్థాయిని తాను తగ్గించుకుంటున్నారు.’’ అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని తాను కలిసి ఇవన్నీ చెబుతామంటే తనకు సమయం ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్లు మన వైపు వస్తున్నారు. కాంగ్రెస్ కేడర్‌కు న్యాయం చేయకుండా మన వారిపై కేసులు పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు. బీఆర్ఎస్ హయాంలో తాము ఎక్కడకు వెళ్లినా కేసులు పెట్టారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీటిని ఎత్తివేయాలి. రేవంత్ రెడ్డి ఒకవైపు కాకుండా రెండువైపుల వినాలి. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగవద్దనేది తన ఉద్దేశ్యమని వీహెచ్ అన్నారు. ఇదీ చదవండి: కవిత మేనల్లుడి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు -
కవిత అరెస్ట్‌పై కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, నల్లగొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అవుతుందని ముందే చెప్పాను అంటూ కామెంట్స్ చేశారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్. అలాగే, కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేసిన రోజునే ప్రజలు బాగుపడారని పాల్ చెప్పుకొచ్చారు. కాగా, కేఏ పాల్ శనివారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను చాలా సార్లు కలిశారు. తెలంగాణ ప్రజలకు నీటి సమస్య తీవ్రంగా ఉంది. కేబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిని మార్చాలని నేను ఎప్పుడో చెప్పాను. కోమటిరెడ్డి వెంకట రెడ్డి చాలా మాటలు చెబుతున్నాడు. రైతుబంధు డబ్బులు ఐదువేల కోట్లు ఎటుపోయాయి. వెయ్యి కోట్లకు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయాడు. తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కురుకుపోయింది. కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేసిన రోజున ప్రజలు బాగుపడుతారు. రేవంత్ గురువు చంద్రబాబు చెప్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తాను. లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ప్రజాశాంతి పార్టీలో పోటీలో ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
భువనగిరి ఎంపీ టికెట్ అడగడం లేదు
మునుగోడు: భువనగిరి ఎంపీ టికెట్ తన భార్య లక్ష్మికి అడుగుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు నిజం కాదని, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే గిట్టనివారు తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే బాగుటుందని తాను పలుమార్లు చెప్పానని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. కోమటిరెడ్డి కుటుంబం పదవుల కోసం పాకులాడదని, తన భార్య లక్ష్మి కూడా పోటీచేసేందుకు సుముఖంగా లేదని చెప్పారు. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లో.. తమ కుటుంబం నుంచి పోటీచేస్తేనే గెలుస్తామని రిపోర్టు వస్తే..అధిష్టానం పోటీచేయాలని పట్టుబడితే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండవు తన సోదరుడు మంత్రి వెంకట్‌రెడ్డికి, తన మధ్య విభేదా లు ఉన్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తమ మధ్య ఏ ఒక్క రోజూ ఎడబాటు ఉండదన్నారు. ఇద్దరం కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడని, తాను సూర్యాపేటకు వెళ్తే.. ఒక్క రోజు కూడా బయట తిరగలేడన్నారు. ఆలస్యమైనా తనకు మంత్రి పదవి వస్తుందని, ఆ నమ్మకం ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం ఎంపీపీలు తాడూరి వెంకట్ రెడ్డి, గుత్తా ఉమాదేవి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
నేడు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజా స్వామ్య హక్కులను కాల రాస్తోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఎస్.వీరయ్య మండిప డ్డారు. వామపక్ష పార్టీల సమావేశం శుక్రవారం ఎంబీ భవన్లో జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ ధోరణులను సమావేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపా రు. స్వచ్ఛందంగా పనిచేసే ఈడీ, ఐటీ, సీబీఐలను తమ జేబు సంస్థలుగా కేంద్రం వాడుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోకుండా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల నా యకులను భయభ్రాంతులకు గురిచేస్తోందని విరుచుకుపడ్డారు. అందులో భాగంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోపా టు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలను అరెస్టు చేసిందన్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు డీజీ నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు రమ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, ఎంసీపీఐ(యు) నాయకులు వనం సుధాకర్, ఎస్ యూసీఐ(యు) నాయకులు తేజ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు కోటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. -
మాదిగలను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదిగలకు రిజర్వేషన్ల విషయంలో కుట్ర జరుగుతోందని, రాజ్యాంగ బద్ధమైన మాదిగల హ క్కులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ అన్నారు. మాదిగల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముందడుగు పడిందని, ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగనే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు పదేళ్ల పాటు తెలంగాణ మాదిగలకు అన్యాయం చేశాయని, అప్పుడు తనతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాదిగల పక్షాన గొంతు వినిపించామని పేర్కొన్నా రు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేశ్, అధికార ప్రతినిధి జ్ఞానసుందర్లతో కలసి మీడి యాతో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కోసం వేసిన అన్ని కమిషన్లు కాంగ్రెస్ హయాంలోనివేనని చెప్పారు. కానీ, మంద కృష్ణ మాదిగ మాత్రం ద్రోహులతో కలసి మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని, ఆయన బీజేపీ ముసుగులో ఉండి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాదిగల ప్రయోజనాలను మోదీ కాళ్లముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ అగ్రకుల పార్టీ అయితే కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాల పార్టీల అని సంపత్ అన్నారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా బాధ లేదు నాగర్‌కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా బాధ లేదని సంపత్ చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీయే గాడ్‌ఫా దర్ అని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సామాజిక స్పృహతో పనిచేస్తున్నారని అన్నారు. కానీ, మాదిగ జాతికి అన్యాయం జరిగితే జాతి ప్రయోజనాల కోసం ఎప్పుడైనా అధిష్టానానికి లేఖ రాస్తానని ఆయన స్పష్టం చేశారు. -
లిక్కర్ పాలసీ కేసులో కాంగ్రెస్, రేవంత్ చెరోదారి
సాక్షి, హైదరాబాద్: మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వైఖరికి పూర్తి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ కాంగ్రెస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదని, బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా ఆయన వైఖరి కనిపిస్తోందని అన్నారు. ఖర్గే, రాహుల్ నాయకత్వంలో రేవంత్ పనిచేయడం లేదని, కాంగ్రెస్ విధానాలకు వ్యతి రేకంగా బీజేపీకి, మోదీకి అనుకూలంగా పనిచేస్తు న్నారని మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. ‘మద్యం పాలసీ కేసు విషయంలో ఇన్నాళ్లుగా మేము చెపుతున్న విషయాలనే తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ చెప్తున్నారు. మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. వాటిని అడ్డుపెట్టుకుని లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని మేము చెప్తూ వస్తున్నాం. ఇన్నాళ్లుగా మే ము చేస్తున్న వాదనను ఏఐసీసీ కూడా బలపరిచింది. లిక్కర్ స్కామ్ పూర్తిగా కల్పితమని, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తోందని స్వయంగా ఖర్గే, రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏఐసీసీ వైఖరికి విరుద్ధంగా మాట్లాడుతు న్నారు’ అని హరీశ్ అన్నారు. ‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదని, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న మోదీ మనిషి అని మేము ముందు నుంచీ చెప్తున్నాం. రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం మా విమర్శలను నిజమని రుజువు చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఉన్నాననే విషయం కూడా మరచిపోయి బీఆర్ఎస్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు రేవంత్‌రెడ్డి బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకు న్నారు’అని హరీశ్‌రావు విమర్శించారు. -
మూడంచెల ‘సమన్వయం’
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం మూడంచెల్లో సమన్వయం చేసుకునే విధంగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనుంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల వారీగా, పోలింగ్ బూత్‌స్థాయిలో ఈ కమిటీలను నియమించి, సమన్వయంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అందుబాటులో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్య నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయా లని, బాధ్యతలు పంచుకోవడంతో పాటు కార్యకర్త లకు వెన్నంటి నిలవాలని సూచించారు. గత ఎన్ని కల్లో విజయతీరాన్ని చేర్చిన మల్కాజిగిరి మోడ ల్ను రాష్ట్రమంతటా అనుసరించాలని నిర్దేశించారు. ఒకట్రెండు రోజుల్లో కమిటీలు లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థాయిల్లో నియమించనున్న కమిటీలను ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఏఐసీసీ పరిశీల కులతో పాటు ఆ నియోజకవర్గంలోని ముఖ్యనేత లు సభ్యులుగా ఉంటారు. ఆ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే, లేదంటే నియోజకవర్గ ఇన్చార్జ్, మండలాల వారీగా ముఖ్యనేతలు ఉంటారు. ఇక, పోలింగ్‌బూత్ స్థాయిలో నియమించే కమిటీల్లో ప్రతి బూత్ నుంచి ఐదుగురు చురుకైన కార్యకర్తలకు అవకాశం కల్పిస్తారు. ఈ కమిటీ సభ్యులకే ఓట్లు వేయించే బాధ్యత కూడా అప్పగి స్తారు. ప్రతి బూత్‌లో వచ్చే ఓట్లను బూత్ కమిటీ సభ్యుల పనితీరుకు ప్రాతిపదికగా తీసుకొని త్వర లో నియమించే ఇందిరమ్మ కమిటీల్లో వారికి ప్రాధాన్యం ఇస్తారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక పర్య వేక్షణ బాధ్యతలను ఈ ఇందిరమ్మ కమిటీలకే అప్ప గిస్తారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్‌స్థాయిలో నియమించే ఐదుగురు సభ్యుల పనితీరు కీలకం కానుంది. సన్నాహక సమావేశాలు లోక్‌సభ ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ఆయా పార్ల మెంట్ నియోజక వర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రులతోపాటు అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లు పాల్గొంటారు. ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ స్థాయిలో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూ హం నిర్ణయిస్తారు. -
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులుగా ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పలు పిటిషన్లకు సంబంధించి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు, ఒక సీపీఐ ఎమ్మెల్యేకు హైకోర్టు శుక్రవారం వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. వారంతా వచ్చే నెలలోగా స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేనెల (ఏప్రిల్ 16, 18, 19 తేదీలకు) వాయిదా వేసింది. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ (బీఆర్ఎస్), జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్), ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి (బీఆర్ఎస్), మహబూబ్‌నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్), దేవరకద్ర నుంచి జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్), కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు(సీపీఐ) విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిన ప్రత్యర్థులు కొందరు వీరి ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వారు ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, సరైన సమాచారం ఇవ్వలేదని వాటిలో పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల ఎన్నికను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నందా తదితరులతో కూడిన వేర్వేరు ధర్మాసనాలు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశాయి. ఎవరెవరిపై పిటిషన్లు..? మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ వేశారు; జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, నవీన్‌యాదవ్..; కొత్తగూడెం నుంచి సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికను సవాల్ చేస్తూ కొత్తగూడెం పట్టణానికి చెందిన నందూలాల్ అగర్వాల్..; ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత కోవ లక్ష్మి ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్..; ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు) ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి..; దేవరకద్ర నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన జి.మధుసూదన్‌రెడ్డి ఎన్నిక రద్దు కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. -
నాగర్‌కర్నూల్ నుంచి ప్రవీణ్‌కుమార్..మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ శుక్రవారం ప్రకటించింది. మెదక్ నుంచి ఎమ్మెల్సీ పరిపాటి వెంకట్రామిరెడ్డికి, నాగర్‌కర్నూల్ నుంచి ఇటీవలే బీఎస్పీ నుంచి చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనితో మొత్తంగా బీఆర్ఎస్ 13 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. మరో 4 సీట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వంటేరు పేరు వినిపించినా.. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేరును బీఆర్ఎస్ దాదాపు నెల రోజుల క్రితమే ఖరారు చేసినా.. వివిధ కారణాలతో ప్రకటన జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే 2 రోజుల క్రితం కేసీఆర్‌ను కలిసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి తనకు పోటీచేసే ఉద్దేశం లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జాయింట్ కలెక్టర్‌గా, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి పనిచేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా ఉంది. 2014లో పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీగా గెలిచినా రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం సాధించడంతో రాజీనామా చేసి సీఎం పదవి చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మెదక్‌లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. ఆర్థిక బలం కలిగిన వెంకట్రామిరెడ్డి వైపు మొగ్గుచూపినట్టు సమాచారం. పెండింగ్‌లో మరో నాలుగు సీట్లు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 11 సీట్లలో అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా ప్రకటించిన ఇద్దరి కలసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసిన స్థానాల సంఖ్య 13కు చేరింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లకుగాను ఇంకా నాలుగు సీట్లు హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్లగొండ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పేరు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. మిగతా స్థానాలకు కసరత్తు కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పెండింగ్ సీట్లకు రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిపాయి. 30వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ముఖ్య నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, వేలేటి రాధకృష్ణశర్మ తదితరులు దీనికి హాజరయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తిరుమలకు వెళ్లడంతో భేటీకి రాలేదు. ఈ సందర్భంగా ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఆలోగా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలను పూర్తి చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులకు సూచించారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతా: వంటేరు ప్రతాప్‌రెడ్డి మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో.. గజ్వేల్ నియోజకవర్గ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి బీఆర్ఎస్ను వీడతారనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పనిచేసిన ప్రతాప్‌రెడ్డి.. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులతో సన్నిహితంగా ఉండేవారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై 2014లో టీడీపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున వంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ చేశారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. నాకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి: వెంకట్రామిరెడ్డి మర్కూక్ (గజ్వేల్): తనను మెదక్ అభ్య ర్థిగా ప్రకటించడం పట్ల కేసీఆర్, హరీశ్‌రావులకు వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఐఏఎస్ అధికారిగా ఏడున్నరేళ్లు ఈ జిల్లాలో పనిచేశానని, తనకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ దీనిని గుర్తించి తనకు అవకాశం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. -
వలస నేతలకు టికెట్లపై కాంగ్రెస్‌లో లొల్లి..!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ టికెట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో లొల్లి రేపుతోంది. ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో ముగ్గురు ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే టికెట్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్‌కు (ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే), చేవెళ్ల టికెట్ గడ్డం రంజిత్‌రెడ్డి (బీఆర్ఎస్ ఎంపీ)కి, మల్కాజ్గిరి టికెట్ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి (వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్)లకు ఇవ్వడంపై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని పునఃసమీక్షించాలని పలువురు నేతలు అంతర్గతంగా కోరుతుండగా, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్ నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడికి లేఖ రాశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. మరోవైపు రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనూ మాల సామాజిక వర్గానికి చెందినవారికే టికెట్ ఇవ్వడం పట్ల మాదిగ సామాజిక వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. పార్టీ నేతల వద్ద తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మితోపాటు 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ కేడర్‌ను అవమానపరిచినట్టే! ఇటీవలే పార్టీలో చేరినవారికి కాంగ్రెస్ లోక్‌సభ టికెట్లు కేటాయించడం కాంగ్రెస్ కార్యకర్తలను అవమానపర్చినట్టేనని, వారిని నైతికంగా దెబ్బతీస్తుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ‘‘తెలంగాణలో మార్పు కోరుకున్న ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించారు. ఆ పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ప్రజాభిప్రాయానికి విరుద్ధం. ఇలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు, కేడర్‌కు ఎలాంటి సంకేతాలు పంపుతాయనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీకి విధేయులుగా ఉండేవారికి టికెట్లు ఇవ్వండి’’ అని లేఖలో కోరారు. రిజర్వుడ్ సీట్ల వ్యవహారంలోనూ.. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు వ్యవహారం కూడా కాంగ్రెస్‌లో అంతర్గత చర్చకు దారితీస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ సీట్లను మాల సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడంపై మాదిగ సామాజిక వర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేశ్, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి వంటి మాదిగ సామాజిక వర్గం నేతలు ఈసారి లోక్‌సభ టికెట్లను ఆశించారు. కానీ వారికి ఇవ్వకుండా ఇద్దరు మాల సామాజికవర్గ నేతలకు ఇవ్వడంపై వారు నిరాశలో ఉన్నారని సమాచారం. ఇక నాగర్‌కర్నూల్ టికెట్ పొందిన సీనియర్ నేత మల్లు రవి శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నివాసానికి వెళ్లారు. తనకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. టికెట్ దక్కిన మల్లు రవిని అభినందించిన సంపత్.. మంచి మెజార్టీతో నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ విజయం సాధించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఇద్దరినీ తీసుకుని సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లారు. వీరితో చాలా సేపు సమావేశమైన రేవంత్.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. 28 తర్వాతేనా? కాంగ్రెస్ ఇంకా ఖమ్మం, భువనగిరి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా అభ్యర్థుల ఖరారుపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఈనెల 28 తర్వాత ఢిల్లీలో భేటీకానుంది. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడి హోదాలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ భేటీలో పాల్గొంటారు. రాష్ట్రంలో మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు ఆ భేటీలో అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలిసింది. -
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రేవంత్ వ్యాఖ్యలు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్ స్పందిస్తున్న తీరుకు.. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటూ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీమ్‌లా మాట్లాడుతున్నట్లు ఉందని విమర్శించారు. సీఎం ఎక్కడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. రేవంత్ మాటలు చూస్తుంటే ఖర్గే, రాహుల్ నాయకత్వంలో పనిచేయడం లేదనే విషయం అర్ధం అవుతుందన్నారు. మోదీకి అనుకూలంగా రేవంత్ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీకి, ప్రధాని మోదీకి అనుకూలంగా రేవంత్ పనిచేస్తున్నారని మరోసారి తేటతెల్లమయిందన్నారు హరీష్ రావు. మద్యం పాలసీ కేసు విషయంలో ఇన్నాళ్లుగా తాము ఏమి చెప్తున్నామో ఇప్పుడు ఖర్గే, రాహుల్ గాంధీ అదే చెప్పారన్నారు. మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకుందని దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయ వేధింపుల కోసం వాడుకుంటున్నదని తాము ముందే ఆరోపించామని పేర్కొన్నారు. ఇప్పుడు తమ వాదనను ఏఐసీసీ కూడా బలపరిచిందని తెలిపారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రేవంత్ వ్యాఖ్యలు లిక్కర్ స్కామ్ అనేది ఒక కుట్ర అని.. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతుందని ఏఐసీసీ నేతలు విమర్శించారని చెప్పారు. కానీ.. రేవంత్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏఐసీసీ నాయకులు మాట్లాడిన దానికి విరుద్ధంగా పూర్తి మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందని.. అందులో నిందితులను అరెస్టు చేయడం ఆలస్యమైందంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ తరపున వకాల్తా? రేవంత్ కాంగ్రెస్ మనిషి కాదు, ఆర్ఎస్ఎస్ భావజాలం నిండి ఉన్న మోదీ మనిషి అని మేము ముందు నుంచీ చెప్తున్నాం. అది ఇప్పుడు అదే నిజమని తేలింది. తాను కాంగ్రెస్‌లో ఉన్న విషయం కూడా మరిచిపోయినట్టు ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’ అని హరీష్ రావు మండిపడ్డారు. -
కేజ్రీవాల్, కవిత అరెస్ట్‌పై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజుగా పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోంది. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: Delhi Liquor Case: కవితకు జైలా? బెయిలా? -
Delhi Liquor Case: కవితకు జైలా? బెయిలా?
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ శనివారంతో ముగియనుంది. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ వివరించనుంది. కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరే అవకాశం ఉంది. కాగా గత ఆరు రోజులుగా ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీలో కవిత పాత్ర, రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్‌తో ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం(మార్చి 15) ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. చదవండి: Liquor Scam: కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్ జూలై 7, 2023 రోజున మాగుంట శ్రీనివాసులు రెడ్డి విచారణలో కీలక విషయాలు రాబట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసినప్పుడు కేసు పూర్వపరాలన్నీ పూసగుచ్చినట్టు వెల్లడించారని తెలిపింది. "2021 మార్చిలో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్లలో ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి చదివాను. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చూశాను. అప్పటి వరకు ప్రభుత్వ హయాంలో ఉన్న లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చూశాను. మా కుటుంబం 71 సంవత్సరాలుగా లిక్కర్ బిజినెస్‌లో ఉంది. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్‌లోకి ఎంటర్ అయితే మరిన్ని లాభాలు ఉంటాయనిపించింది. ఇదే పని మీద ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మార్చి 16, 2021న సాయంత్రం 4.30గంటలకు కలిశాను. కొద్దిసేపు మాట్లాడారు. ఢిల్లీలో వ్యాపారానికి ముందుకు రావాలని కోరారు. మీరు కవితను కలవాలని సూచించారు. ఈ విషయం ఇప్పటికే కవితతో చర్చించామని, ఆమ్ అద్మీ పార్టీకి వంద కోట్ల రుపాయలు ఇవ్వడానికి కవిత సిద్ధంగా ఉన్నారని కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్ సూచన మేరకు హైదరాబాద్‌లో మార్చి 19, 2021న కవితను కలిశాను. ఈ డీల్ వంద కోట్ల రూపాయలకు సంబంధించనదని, ఇందులో మీ వాటా ఏంటని అడిగారు. రూ.50 కోట్లు ఇవ్వమని అడిగారు. నేను రూ. 30 కోట్లు ఇస్తానని అంగీకరించాను. కవిత ఆడిటర్ బుచ్చిబాబును మా అబ్బాయి రాఘవ కలిసి 25 కోట్ల రూపాయల నగదు ఇచ్చారు. ఈ డబ్బును బోయిన్పల్లి అభిషేక్‌కు కవిత సూచనల మేరకు ఇచ్చాం." -
బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం.. మెదక్ లోక్‌సభ బరిలో ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం(మార్చ్ 22) ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. తాజాగా రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో రానున్న లోక్‌సభ ఎన్నికలకుగాను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లకు గులాబీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవిత అరెస్టు కక్ష సాధింపే.. బీఆర్ఎస్ ఎంపీలు -
హస్తం గూటికి జీహెచ్ఎంసీ మేయర్?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె హస్తం గూటికి వెళ్తారా? అనే సస్పెన్స్ నెలకొంది. కాగా, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ నాయకులపై దృషి సారించింది. దీంతో, తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో, ఆమె నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతాను. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు వేగవంతం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, అసంతృప్త నేతలను టార్గెట్ చేసి హస్తం గూటికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ గూటికి ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ నేతలు, అంతకుముందు కాంగ్రెస్‌ను వీడిన నేతలు హస్తం గూటికి చేరుతున్నారు.