ఏర్కాడులో ప్రచార హోరు | Stalin refutes Jayalalithaa’s claim on power crisis in State | Sakshi
Sakshi News home page

ఏర్కాడులో ప్రచార హోరు

Dec 1 2013 2:11 AM | Updated on Sep 18 2018 8:28 PM

ఏర్కాడులో నాయకుల ప్రచార హోరు ఉధృతంగా సాగుతోంది. ప్రచారం రేపటితో ముగిసిపోతున్న నేపథ్యంలో నాయకులందరూ ఓటర్ల వెంటబడుతున్నారు.

చెన్నై, సాక్షిప్రతినిధి: ఏర్కాడులో నాయకుల ప్రచార హోరు ఉధృతంగా సాగుతోంది. ప్రచారం రేపటితో ముగిసిపోతున్న నేపథ్యంలో నాయకులందరూ ఓటర్ల వెంటబడుతున్నారు. అయితే ఓటర్లను మభ్యపెట్టేందుకు నగదు, బహుమతులు పంపిణీ చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని ఎన్నికల కమిషనర్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. ఏర్కాడు ఉప ఎన్నికల సందర్భంగా నగదు, పంచెలు, చీరలు, మద్యం పంపిణీ సాగుతున్నట్లు ఆరోపణలు రావడంతో శనివారం ఆయన మీడియా ప్రకటన విడుదల చేశారు. ఓటు కోసం నోటు ఇవ్వడం, తీసుకోవడం కూడా నేరం కిందకు వస్తుందని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీలకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుందని ఆయన చెప్పారు. పంపిణీలు సాగుతున్నట్లు ప్రజలు గుర్తిస్తే సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలు తీసి పంపాలని ఆయన కోరారు. 
 
 పోటాపోటీ ప్రచారం
 నేతల పర్యటనలకు మరికొన్ని గంటల్లో నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తున్న తరుణంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు శనివారం పోటాపోటీ ప్రచారం చేశాయి. అన్నాడీఎంకే తరపున సమత్తువ మక్కల్ కట్చి (ఎస్‌ఎమ్‌కే) అధినేత శరత్‌కుమార్, డీఎంకే తరపున పార్టీ కోశాధికారి స్టాలిన్ నియోజకవర్గంలో పర్యటించారు. పరస్పర విమర్శనాస్త్రాలను సంధించారు. రాష్ట్రంలో దుర్భరమైన విద్యుత్ కోతలకు కేంద్రమే కారణమని సీఎం జయలలిత కపటనాటకం ఆడుతున్నారని స్టాలిన్ వ్యాఖ్యానించారు. డీఎంకే హయాంలో కేవలం 2 గంటలు మాత్రమే విద్యుత్‌కోతను విధించగా, అన్నాడీఎంకే పాలనలో 10 నుంచి 18 గంటల కోతకు ప్రజలు గురవుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే ముందున్న సీఎం జయలలితను విమర్శించే అర్హత స్టాలిన్‌కు లేదని శరత్‌కుమార్ తిప్పికొట్టారు.
 
 డీఎంకేపై ఫిర్యాదు
 ఎన్నికల నిబంధనలకు డీఎంకే తిలోదకాలు ఇచ్చిందని ఆరోపిస్తూ రాష్ట్ర మంత్రి పన్నీర్ సెల్వం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు శనివారం ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేశారు. నగదు, మద్యం, పంచెలు, చీరలు పంపిణీ సాగుతోందని తెలిపారు. ఓటుకు రూ.500 చొప్పున పంచుతున్నారని చెప్పారు. ఎంపీ కనిమొళి వందలాది వాహనాలతో ప్రచారం నిర్వహించారని, కొందరు డీఎంకే నేతల వద్ద పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. మరో నేత 800 చీరలతో పట్టుబడినటుల తెలిపారు. వీటిపై రాష్ట్రస్థాయి అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా అదుపుచేయలేక పోయారని అన్నారు. వెంటనే జోక్యం చేసుకుని అక్రమాలకు పాల్పడిన నేతలను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement