
ఉప నగారా
శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నగారా మోగింది. ఫిబ్రవరి 13న ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
సాక్షి, చెన్నై:శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నగారా మోగింది. ఫిబ్రవరి 13న ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. అభ్యర్థుల వేటలో అన్నాడీఎంకే, బీజేపీలు నిమగ్నమయ్యాయి. అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయింది. జయలలిత అనర్హురాలు కావడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీరంగానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తిరుచ్చి జిల్లా కావేరి నదీ తీరంలోని ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఉప ఎన్నిక నిర్వహణలో జాప్యం నెలకొనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. రాష్ట్ర ఎన్నికల అధికారి సక్సేనా ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకుని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక రూపంలో సమర్పించారు. దీంతో ఉప ఎన్నిక నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం నిర్ణయం తీసుకుంది.
ఉప నగారా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీతో పాటుగా ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను రాత్రి చెన్నైలో రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా విడుదల చేశారు. ఆ మేరకు శ్రీరంగం ఉప ఎన్నిక గురించి వివరించారు. ఈ నెల 19 నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం ఆరంభం కానుంది. ఈ నెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ, 28న పరిశీలన, 30న ఉప సంహరణ పర్వాలు సాగనున్నాయి. ఫిబ్రవరి 13న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. 16న ఫలితాల వెల్లడి, 18తో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ముగించనున్నారు. ఎన్నికల నగారా మోగడంతో తిరుచ్చి జిల్లా పరిధిలోని శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం, తిరుచ్చి లోక్‌సభ నియోజకవర్గం పరిధుల్లో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు లేదు. కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది.
అభ్యర్థుల వేటలో... : ఎన్నికల నగారా మోగడంతో శ్రీరంగంపై పార్టీలు దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. జయలలిత ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో ఆ స్థానానికి తగ్గట్టుగా అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన అవశ్యం ఏర్పడింది. మహిళా అభ్యర్థినే ఎంపిక చేయడానికి జయలలిత నిర్ణయించినట్టు, అన్ని రకాల పరిశీలన, అర్హతల మేరకు ఆ నియోజకవర్గానికి అభ్యర్థిని ఎంపిక చేసే కసరత్తుల్లో ఆమె నిమగ్నమైనట్టుగా అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు బీజేపీ సిద్ధమైంది. అన్నాడీఎంకే మహిళా అభ్యర్థిని బరిలోకి దించిన పక్షంలో, తాము సైతం మహిళనే రంగంలోకి దించే విధంగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ కసరత్తుల్లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ విషయంగా ప్రధాన ప్రతిపక్షం డీఎండీకే, ప్రధాన పార్టీ డీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆ పార్టీలు ఎన్నికల బరిలో అభ్యర్థుల్ని నిలబెట్టేనా అన్నది వేచి చూడాల్సిందే. ఎన్నికల నగరా మోగడంతో శ్రీరంగ ంలో ఉప సందడి ఆరంభం అయింది.