
చతుర్ముఖ సమరం
అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో ఖాళీ అయిన శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో ఖాళీ అయిన శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పక్షాలు గెలుపు కోసం పరుగులు తీస్తున్నాయి. ఈ ఎన్నికలను పీఎంకే, ఎండీఎంకే, టీఎంసీలు బహిష్కరించాయి. బీజేపీకి మద్దతుగా డీఎండీకే నిలవడంతో వారి మధ్య స్నేహ బంధం పదిలం అన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవు. దీంతో ఈ ఉప ఎన్నికలో చతుర్మఖ సమరం నెలకొంది.
అన్నాడీఎంకే అభ్యర్థిగా వలర్మతి, డీఎంకే అభ్యర్థిగా ఆనంద్ ఇప్పటికే తమ నామినేషన్లను దాఖలు చేశారు. బీజేపీ తమ అభ్యర్థిని ఆలస్యంగానే ప్రకటించింది. శనివారం ఆ పార్టీ అభ్యర్థి సుబ్రమణియన్ తన నామినేషన్‌ను తాలుకా కార్యాలయంలో ఎన్నికల అధికారికి సమర్పించారు. సీపీఎం అభ్యర్థి అన్నాదురై తన నామినేషన్‌ను చివరి రోజైన 27న దాఖలు చేయడానికి నిర్ణయించారు. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, సీపీఎంలు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అయింది. ఒక వేళ ఇతర పార్టీలు పోటీ చేయాలన్నా అందుకు తగ్గ సమయం లేదు. ఆది, సోమ సెలవు దినం కావడంతో చివరి రోజున ఆగమేఘాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్న పార్టీలు ఇక్కడ లేవు. దీంతో ఈ ఉప ఎన్నిక చతుర్మఖ సమరంగా మారింది. అయితే, ప్రధాన పోటీ అన్నది అన్నాడీఎంకే, డీఎంకే మధ్య సాగుతుంది. బీజేపీ అభ్యర్థి ఏ మేరకు పోటీ ఇస్తారన్నది అనుమానమే. ఆయన అలా నామినేషన్ దాఖలు చేశారో ఏమోగానీ, ఇలా ఆయన పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేరారుు
ఫిర్యాదు : సుబ్రమణియన్ పేరును ప్రకటించడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లు తమ పనితనాన్ని ప్రదర్శించే పనిలో పడ్డారు. పలు విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న సుబ్రమణియన్‌పై గతంలో మోసం కేసు నమోదైందని, క్రిమినల్ కేసులు ఉన్నాయన్న ఆరోపణలు బయలు దేరాయి. కే సుల్ని ఎదుర్కొంటున్న వ్యక్తిని బీజేపీ తమ అభ్యర్థిగా ఎంపిక చేయడం శోచనీయమంటూ విమర్శలు, ఫిర్యాదులు మొదలయ్యూరుు. తమ అభ్యర్థికి చిక్కులు తప్పవేమోనన్న బెంగ కమలనాథుల్లో బయలు దేరి ఉన్నది.ప్రచార హోరు : నామినేషన్ల దాఖలుతో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. తమ అభ్యర్థి వలర్మతికి మద్దతుగా పలువురు మంత్రులు నియోజకవర్గంలో తిష్ట వేశారు. ఆయా ప్రాంతాల్లోని నేతలతో మంతనాలు జరుపుతూ, ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక ఓపెన్ టాప్ వాహనంలో తిరుగుతూ, ఇంటింటా వెళ్లి ఓటర్లను ఆకర్షించడంలో వలర్మతి బిజీగా ఉన్నారు.
ఇక డీఎంకే అభ్యర్థి ఆనంద్ తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకునే పనిలో పడ్డారు. జయలలిత చేతిలో గతంలో ఓటమి చవి చూసిన తన మీద ఈ సారైనా కరుణ చూపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రచార బాట పట్టారు. నియోజకవర్గంలో ఓపెన్ టాప్ వాహనంలో తిరుగుతూ, ఓటర్లను ఆకర్షించే రీతిలో ప్రసంగాల్లో స్టాలిన్ నిమగ్నమయ్యారు. నామినేషన్ దాఖలుతో ఓట్ల వేటలో బీజేపీ అభ్యర్థి సుబ్రమణియన్ నిమగ్నమయ్యారు. నామినేషన్ వేయకున్నా, కార్మికులతో మంతనాలు జరుపుతూ, ఓట్ల వేటకు సీపీఎం అభ్యర్థి అన్నాదురై సిద్ధమయ్యారు.