విభజనశక్తులను దూరం ఉంచండి: షీలా దీక్షిత్ | Keep away from the forces of division: Chief Minister | Sakshi
Sakshi News home page

విభజనశక్తులను దూరం ఉంచండి: షీలా దీక్షిత్

Sep 20 2013 1:23 AM | Updated on Sep 1 2017 10:51 PM

భారతీయ జనతా పార్టీ తమ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించడంపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విమర్శలు సంధించారు. విద్వేషాలను రెచ్చగొడుతూ, దేశాన్ని విభజించాలని చూసే వారిని దూరముంచాలని ఆమె ప్రజలకు గురువారం విజ్ఞప్తి చేశారు.

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ తమ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించడంపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విమర్శలు సంధించారు. విద్వేషాలను రెచ్చగొడుతూ, దేశాన్ని విభజించాలని చూసే వారిని దూరముంచాలని ఆమె ప్రజలకు గురువారం విజ్ఞప్తి చేశారు. ‘సంకుచిత సిద్ధాంతాలు అటు దేశానికి ఇటు సమాజానికి మంచివి కావు. దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేసే వారిని మనం దగ్గరికి రానివ్వకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఉత్తరఢిల్లీ జహంగీర్‌పురిలో నూతనంగా నిర్మించిన స్కూల్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఆమె పైవ్యాఖ్యలు చేశారు. 
 
 గత 15 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆమె వివరించారు. తాము ఢిల్లీని వాస్తవికంగా అభివృద్ధి చేశామని,  ప్రాజెక్టులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. తమ విజయాల గురించి ప్రజలకు అన్నీ తెలుసని వ్యాఖ్యానించారు. ఉల్లి ధరల పెరుగుదలపై స్పందిస్తూ దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం వల్ల కూరగాయల ధరలు పెరిగాయని తెలిపారు. మరికొన్ని రోజుల్లో ధరలు అదుపులోకి వస్తాయని ఆశాభావం ప్రకటించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కపిల్‌సిబాల్ మాట్లాడుతూ ఈ పాఠశాలలోని అన్ని తరగతుల గదులనూ ఇంటర్నెట్‌తో అనుసంధానించి, బాలికలకు ఆకాశ్ ట్యాబ్లెట్లు అందజేస్తామని ప్రకటించారు. 
 
 ఇదిలా ఉంటే, కాల్కాజీ ప్రాంతంలో గురువారం నిర్వహించిన మరో కార్యక్రమంలోనూ షీలా దీక్షిత్ ప్రసంగించారు. ఢిల్లీని మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని కోరారు. మురికివాడల నివాసుల కోసం చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవిషయం తెలిపారు. ప్రతి ఇంట్లోనూ డ్రాయింగ్‌రూమ్, పడకగది, వంటగది ఉంటాయన్నారు. వీటిని పర్యావరణానికి అనుకూలంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement