నమో గణపతే


 సాక్షి, ముంబై :  ఓం! గం గణపతే నమః...లోకం సమస్తం సుఖిఃనోభవంతు!...వినాయక చతుర్థిని పురస్కరించుకొని నగరవ్యాప్తంగా లక్షలాది పెద్ద, చిన్న విగ్రహాలను భక్తులు సోమవారం ప్రతిష్టించారు. ట్రక్కులు, టెంపోలు, కారులు, ద్విచక్ర వాహనాలలో సుమారు రెండు లక్షలకు పైగా విగ్రహాలను మండపృు, ఇళ్లకి తరలించారు. భాజా బజంత్రీలకు నృత్యం చేస్తూ భక్తులు ఆనందోత్సాహంలో మునిగి తేలారు. ఆ తర్వాత విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేశారు. నగరంలో అతిపెద్ద వాటిలో ఒకటైన లాలా బాగ్ చా రాజా విగ్రహాన్ని దర్శించుకునేందుకు తొలిరోజే వేలాది మంది భక్తులు బారులు తీరారు. నగరవ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.


భక్తిశ్రద్ధలతో నిమజ్జనం

 ముంబైకర్లు ఎంతో భక్తి శ్రద్దలతో మంగళవారం నగరంలో వివిధ సముద్ర తీరాలవద్ద గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. దీంతో చర్నిరోడ్ చౌపాటి, లోటస్, దాదర్ శివాజీపార్క్, మాహీమ్, బాంద్రా, జుహూ, అక్సా బీచ్ తదితర నిమజ్జనాల ఘాట్‌లన్నీ భక్తులతో కిలకిటలాడాయి. గణపతి బొప్పా మోరియా, మంగళ మూర్తి మోరియా, పుడ్చ్యా వర్షి ల వ్‌కర్ యా అనే నినాదాల తో మారుమోగాయి. సోమవారం ఉదయం ఇళ్లలో ప్రతిష్టించిన గణేశ్ విగ్రహాలను వారివారి మొక్కుబడుల ప్రకారం కొందరు రోజున్నర (దీడ్ దిన్) అంటే మరసటి రోజు సాయంత్రం నిమజ్జనం చేస్తారు. కొందరు ఐదు రోజులు, మరికొందరు పది రోజులకు అనంత చతుర్థి రోజున విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.

 

 ఇందులో భాగంగా రోజున్నర పూజలు అందుకున్న గణనాధుడు మంగళవారం సాయంత్రం సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడ విగ్రహాలకు హారతులు, పూజలు చేసి సముద్రంలోకి సాగనంపారు. నగరంలో ఎక్కడ ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సముద్ర తీరాలవద్ద బీఎంసీ తమ వంతు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఊరేగింపులకు మార్గదర్శనం చేసేందుకు అన్ని జంక్షన్ల వద్ద  వివిధ స్వయం సేవా సంస్థల కార్యకర్తలు, పోలీసులు, హోంగార్డులు అందుబాటులో ఉన్నారు. నిమజ్జనాల ఘాట్లవద్ద సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా నిలువరించేందుకు సిబ్బందిని మోహరించారు. గజ ఈతగాళ్లను, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.



తీరాల వద్ద ఫ్లడ్‌లైట్లు, భక్తులకు సూచనలు ఇచ్చేందుకు, పిల్లలు తప్పిపోతే అనౌన్స్‌మెంట్ తదితర ఏర్పాట్లు చేశారు. విగ్రహాలను తీసుకుని కాలినడకన వచ్చేవారికి, తోపుడు బళ్లలో, వాహనాల్లో తీసుకొచ్చేవారికి వేర్వేరు రహదారులను ఉంచారు. నగరంలో ఊరేగింపులు కారణంగా అనేక రహదారులను వన్ వేగా, మరికొన్నింటిని నో ఎంట్రీగా ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. వాహన చోదకులకు మార్గదర్శనం చేసేందుకు అనేక మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నారు. ఉత్సవాల కారణంగా నగర, ట్రాఫిక్ శాఖ పోలీసులు, అధికారుల వారాంతపు, దీర్ఘకాలిక సెలువులు రద్దు చేశారు.

 

 భివండీలో...

 భివండీ, న్యూస్‌లైన్: పట్టణవాసులు గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక విగ్రహాలు సోమవారం ఉదయం నుంచి మద్యాహ్నం వరకు భాజాభజంత్రీల మధ్య నృత్యాలు చేస్తూ భక్తులు తమ నివాసాలలో ప్రతిష్టించారు. సార్వజనిక మండళ్లు కూడా తమ మండపాలు, భారీ సెట్లలోకి తీసుకొచ్చారు. ఉదయం ఎటూచూసిన తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, లారీలు, రిక్షాలు, కార్లలో గణపతి విగ్రహాలనే దర్శనమిచ్చాయి. దీంతో రహదారులు భక్తజనంతో కిటకిటలాడాయి. తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో వస్త్ర పరిశ్రమలకు సెలవు చెప్పి ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ పద్ధతిలో విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

 

 నిమజ్జనం...

 పట్టణంలోని అనేక ఇళ్లలో కొలువుదీరిన ఒకటిన్నర గణపతులను మంగళవారం సాయంత్రం  నిమజ్జనం చేశారు. నిమజ్జన సమయంలో భారీ వర్షం కురిసింది. విగ్రహాలను స్థానిక వరాలదేవి చేరువులో నిమజ్జనం చేశారు.

 

 ‘గణపతి బప్పా మోరియా ఫుడ్చా వర్షీ లౌకర్ యా’ అని నినాదాలు చేస్తూ, భాజాభజంత్రీల మధ్యా నృత్యాలు చేస్తూ గణనాథుడికి విడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top