
సాక్షి, స్పోర్ట్స్ : భారత క్రికెటర్లకు వార్షిక వేతనాలు భారీగా పెంచుతూ బీసీసీఐ కొత్త కాంట్రాక్టులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కాంట్రాక్టుల్లో సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని డిమోట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యువ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ధోని కన్నా ఎక్కువ వార్షిక వేతనం అందుకోనుండటం అభిమానులకు మింగుడుపడటం లేదు.
బీసీసీఐ ఈ సారి ఏ+, ఏ, బీ, సీలుగా ఆటగాళ్ల కాంట్రాక్టులను విభజించింది. దీంతో గతేడాది టాప్‌లో ఉన్న ధోని ఏ+ గ్రేడ్ కొత్తగా రావడంతో ఏ గ్రేడ్‌లోనే కొనసాగుతున్నాడు. దీంతో ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.7 కోట్ల వార్షిక వేతనం అందనుండగా.. బీ గ్రేడ్‌లో ఉన్న ధోని రూ.5 కోట్లే అందుకోనున్నాడు. ఏ గ్రేడ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, జస్ప్రిత్ బూమ్రాలున్నారు. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బుమ్రాకు ధోని కంటే ఎక్కువ జీతం ఇవ్వడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
అయితే దీనికి వెనుక రెండు కారణాలున్నాయి. అన్ని ఫార్మట్లలో ఆడటం ఒకటైతే.. ఐసీసీ టాప్-10 ర్యాంకుల్లో ఉన్న ఆటగాళ్లకు ఏ+ గ్రేడ్ ఇవ్వడం రెండోది. ఈ అర్హతలు ధోనికి లేకపోవడంతో బీసీసీఐ ఏ గ్రేడ్‌కు డిమోట్ చేసింది. ఇక ధోని 2014లోనే టెస్టులకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అన్నీ ఐసీసీ టైటిళ్లు అందించిన ధోనికి బీసీసీఐ ఇచ్చే గౌరవం ఇదేనా అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలు ధోని విషయంలో పక్కన పెట్టాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక భారత్ ధోని సారథ్యంలో టీ20, వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీలు గెలవడమే కాకుండా టెస్టుల్లో నెం1 ర్యాంకు అందుకున్న విషయం తెలిసిందే. ఏ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లలో రోహిత్ మినహా మిగతా ఆటగాళ్లంతా ధోని సారథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం విశేషం.