బట్లర్‌ మెరుపులు

Rajasthan Royals beat Mumbai Indians by 4 wickets - Sakshi

43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు

ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం

రాణించిన ఆర్చర్, గోపాల్‌

ముంబై: ‘హ్యాట్రిక్‌’ విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్‌కు రాజస్తాన్‌ రా యల్స్‌ షాక్‌ ఇచ్చింది. ఐపీఎల్‌–12లో భాగంగా వాంఖెడే స్టేడియంలో శనివారం మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గి ఈ సీజన్‌లో రెండో విజయం నమోదు చేసుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి గెలిచింది.  

బట్లర్‌ బీభత్సం... 
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ పక్కా ప్రణాళికతో ఆడింది. ఓపెనర్లు అజింక్య రహానే (21 బంతుల్లో 37; 6 ఫోర్లు, సిక్స్‌), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోస్‌ బట్లర్‌ (43 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆరంభం నుంచే ఎదురుదాడి చేశారు. ఒకవైపు రహానే బ్యాట్‌ ఝళిపించగా... బట్లర్‌ అతనికి సహకారం అందించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించి దూసుకెళ్తుండగా... రహానేను ఔట్‌ చేసి కృనాల్‌ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. రహానే స్థానంలో వచ్చిన సామ్సన్‌ ఆచితూచి ఆడగా... బట్లర్‌ జోరు పెంచాడు. రాహుల్‌ చహర్‌ ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో సిక్స్‌ కొట్టిన అతను... కృనాల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో రెండు సిక్స్‌లు సంధించి 29 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో ఒక్క ఓవర్‌ మ్యాచ్‌ ఫలితం తీరును ప్రభావితం చేస్తుందని బట్లర్‌ నిరూపించాడు. ముంబై బౌలర్‌ జోసెఫ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో బట్లర్‌ చెలరేగిపోయాడు. వరుసగా 6,4,4,4,4,6తో 28 పరుగులు సాధించి మ్యాచ్‌ ఫలితం గతిని మార్చేశాడు. 13 ఓవర్లు ముగిశాక రాజస్తాన్‌ వికెట్‌ నష్టానికి 146 పరుగులతో విజయం దిశగా సాగింది. 

కొంత ఉత్కంఠ... 
బట్లర్‌ వీరవిహారంతో రాజస్తాన్‌ విజయ సమీకరణం 42 బంతుల్లో 42 పరుగులుగా మారింది. అయితే రాహుల్‌ చహర్‌ వేసిన 14వ ఓవర్లో బట్లర్‌ భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌ వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. బట్లర్‌ ఔటైనా... సామ్సన్‌ (26 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్‌), స్మిత్‌ (15 బంతుల్లో 12; ఫోర్‌) ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆడారు. అయితే రాజస్తాన్‌ 24 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్‌లో ఉత్కంఠ చోటు చేసుకుంది. రాజస్తాన్‌ జట్టు అనూహ్యంగా తొమ్మిది బంతుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయింది. విజయానికి 12 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన దశలో శ్రేయస్‌ గోపాల్‌ (12 బంతుల్లో 13 నాటౌట్‌; 2 ఫోర్లు) సంయమనంతో ఆడి రాజస్తాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్‌ జోసెఫ్‌ 3 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.  

డి కాక్‌ దూకుడు... 
అంతకుముందు ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఓపెనర్లు క్వింటన్‌ డి కాక్‌ (52 బంతుల్లో 81; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (32 బంతుల్లో 47; 6 ఫోర్లు, సిక్స్‌) తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలో 96 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆర్చర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఔటయ్యాక ముంబై ఇన్నింగ్స్‌ తడబడింది. సూర్యకుమార్, పొలార్డ్‌ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. సెంచరీ దిశగా సాగుతున్న డి కాక్‌ను ఆర్చర్‌ ఔట్‌ చేశాడు. చివర్లో హార్దిక్‌ పాండ్యా (11 బంతుల్లో 28 నాటౌట్‌; ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో ముంబై భారీ స్కోరు నమోదు చేసింది.   

200 
టి20 ఫార్మాట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ రికార్డు సృష్టించింది. ఇందులో ఆ జట్టు 112 విజయాలు సాధించి... 85 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ ‘టై’కాగా రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.  మరోవైపు ముంబై ఇండియన్స్‌ జట్టుకు రోహిత్‌ కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top