ఆసీస్‌.. మీకు అంత ఈజీ కాదు: పుజారా

not an easy pitch to bat on, Pujara warns Australia - Sakshi

మెల్‌బోర్న్‌: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 443/7 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచే బ్యాటింగ్‌ జోరు కొనసాగించిన టీమిండియా భారీ స్కోరును సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో చతేశ్వర్‌ పుజారా(106) సెంచరీతో మెరవగా, విరాట్‌ కోహ్లి(82), మయాంక అగర్వాల్‌(76), రోహిత్‌ శర్మ(63 నాటౌట్‌)లు హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు.  అయితే 2017 జనవరి నుంచి చూస్తే టెస్టు క్రికెట్‌లో అత్యధిక బంతుల్ని ఎదుర్కొన్న ఏకైక ఆటగాడిగా పుజారా గుర్తింపు సాధించాడు. దాదాపు ఏడాది కాలంలో టెస్టు క్రికెట్‌లో పుజారా ఎదుర్కొన్న బంతులు నాలుగువేలకు పైగానే ఉన్నాయి. ఫలితంగా ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక బంతులను ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ఇదిలా ఉంచితే, రెండో రోజు ఆట ముగిసిన అనంతరం పుజారా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఈ పిచ్‌పై పరుగులు చేయడం అంత ఈజీ కాదన్నాడు. ‘ తొలి ఇన్నింగ్స్‌లో మాకు సరిపోయేంత స్కోరును బోర్డుపై ఉంచాం. పిచ్‌ మారుతూ వస్తుంది. సులువుగా పరుగులు చేయడానికి అనుకూలించే పిచ్‌ కాదు ఇది. ఒక రోజులో 200 పరుగులు సాధించడమంటే టఫ్‌ టాస్క్‌గానే చెప్పాలి. తొలి రెండు రోజుల ఆటలో నేను చేసిన పరుగులు చూస్తే చాలా తక్కువనే చెప్పాలి. పరుగులు చేయడానికి ప్రతీ బంతి ఒక పరీక్ష పెడుతుంది. ఇప్పటికే పిచ్‌పై బౌన్స్‌ బాగా వస్తుంది. నేను ఆడిన నిన్న ఒక రకంగా ఉంటే, ఈరోజు మరొక రకంగా ఉంది. పిచ్‌ అంతగా అనుకూలించడం లేదు. మేము చాలినంత స్కోరును బోర్డుపై ఉంచకలిగాం. మా బౌలింగ్‌ యూనిట్‌ బలంగా ఉంది కాబట్టి.. పరుగులు చేయడం అంత ఈజీ కాదు. రేపట‍్నుంచి పిచ్‌ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయం. దాంతో ఆసీస్‌ పరుగులు సాధించడానికి అపసోపాలు పడాల్సిందే’ అని పుజారా హెచ్చరించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top