ప్రవాహం

Sunday Funday Special - Sakshi

సాయంత్రం నాలుగు అవుతోంది. రోజూ అయినట్టే, ఇందులో వింత ఏముంది అన్నట్టు, చిన్న ముల్లు చక చక ముందుకు పరిగెత్తింది. అంతకుముందు రోజు ట్రాష్‌ కార్ట్‌ దగ్గర కనిపించిన పెద్ద మనిషి ఈ రోజు నన్ను తమ వాకింగ్‌ సంఘంలో చేర్చుకుంటానని, వెళ్లే ముందు కాల్‌ చేస్తానని చెప్పాడు. పిల్లలు ఆఫీసు నుంచి రావడానికి ఇంకా రెండు మూడు గంటలు పడుతుంది. నా మనవరాలు బుజ్జి.. నేను జాకెట్‌ వేసుకోవడం చూసి తన సాక్సులు తీసుకొచ్చి ఇచ్చింది. 

ఎంతో మామూలుగా అనిపించే పనులు, ఈ చిన్ని మనుషులు చేస్తే ఎంత అపురూపంగా ఉంటుందో. ఈ ప్రేమా, పాశాలు లేకపోతే ఈ జగత్తు ఏమైపోతుందో అని ఆలోచిస్తుండగా, సెల్లు మోగింది.‘‘హలో మోహన్‌ గారూ.. ఆ.. ఆ.. రెడీ అండి. సరే సరే విల్‌ మీట్‌ యు ఎట్‌ ది లీసింగ్‌ ఆఫీస్‌..’’ అని కాల్‌ కట్‌ చేసి స్ట్రాలర్, డైపర్‌ బాగ్‌ తీస్కుని, పాపని ఎత్తుకుని బయటపడ్డాను. ఈ దేశంలో పిల్లలని ఎత్తుకుని ఎక్కడికి వెళ్లాలన్నా, రాజు వెడలె రభసకు అన్న చందంగా ఎంత తతంగమో. ఏదో చంటి పిల్లను ఎత్తుకుని వీధి చివరికి వెళ్ళొచ్చినట్టు కాదు.

కానీ బయటికి రాగానే నీలాకాశం అంటే ఇదీ అని చెప్పే ఆకాశం, పక్షులూ వాటి కిలకిలలూ, అవి చూసి వాటికన్నా స్వచ్ఛంగా నవ్వే బుజ్జిదాన్ని చూస్తే ఎంత కష్టమైనా దూదిపింజలా ఎగిరిపోవలసిందే. అలా మోహన్‌ గారిని కలసి వారి వెంట కదిలాను. పక్కనే పది నిమిషాలు నడిస్తే వస్తుంది పార్కు. మేము వెళ్లేసరికి నాలాగే పిల్లల్ని తీస్కుని కొందరూ, తమకు తామే కొందరు అక్కడికి చేరుకున్నారు. నేను చేరగానే జట్టులోకి కొత్త పక్షి వచ్చినట్టు అందరూ నన్ను చూసి నవ్వారు. మోహన్‌ గారు నా పరిచయ భారం తనపై వేసుకున్నారు.

‘‘హాయ్‌ ఫ్రెండ్స్‌ నేను చెప్పానే రావు గారని! వీరే. ఇండియా నుండి వచ్చి వన్‌ వీక్‌ అయిందంట. మన సంఘంలోకి ఈరోజే చేరారు.’’ అని నా గురించి చెప్పారు.
అందరూ చప్పట్లు చరిచి ‘వెల్కమ్‌ టు ది క్లబ్‌’ అని అన్నారు. ఇంత దూరం.. దేశం కానీ దేశంలో ఇన్ని నెలలు ఎలా గడపాలి అనుకుంటుండగా మంచి కంపెనీ దొరికినందుకు సంతోషంగా అనిపించింది. నా వయసు వాళ్ళని నేను వెతుక్కోగా, పాపా తన ఈడు పిల్లలతో కలిసిపోయింది. పిల్లల్లో కాస్త పెద్ద పిల్లకి పాపని చూసుకునే పెద్దరికం ఇచ్చి పిల్లల ప్లే ఏరియా ఎదురుగా, తాతయ్యలమంతా బెంచీలపై కూర్చున్నాము. అటువైపు బెంచీలపై అమ్మమ్మలు, నాయనమ్మలూ సెటిల్‌ అయ్యారు.‘‘రావు గారూ, మీ మిసెస్‌ రాలేదా?’’ వాచీని పైకి తోసుకుంటూ యథాలాపంగా అడిగారు మూర్తి అని పరిచయం కాబడ్డ వ్యక్తి.

‘‘లేదండి. తను లేదు. రెండేళ్ల క్రితం ఆక్సిడెంట్లో ...’’ అని ఆ వాక్యాన్ని పూర్తి చేయడం ఇష్టంలేక ఆపేశాను.అందరూ ఒక్క నిమిషం ఎలా రియాక్ట్‌ అవ్వాలో తెలీక ఇబ్బంది పడ్డారు. మూర్తి గారు ‘సారీ’ అన్నారు.‘‘పర్లేదండి. అన్నీ దాటేశాను. అట్టాచ్డ్‌ డిటాచ్మెంట్‌ వచ్చేసింది.’’ అని వాతావరణాన్ని మామూలు చేద్దామని ప్రయత్నించాను.ఒక్క క్షణం అందరి కళ్ళు అవతలి బెంచీలపై ఉన్న తమ తమ వారిపై ఆగడం నా దృష్టి దాటిపోలేదు. ఈ వయస్సులో తోడు అవసరం ఎంతో, దాని విలువ ఏంటో నాకు బాగా తెలుసు.

మెల్లగా పరిచయాలు అయ్యాక కబుర్లలో పడి సమయం మరచిపోయాము. తెలుగు వారు ఒకదగ్గర చేరితే మాటలకి కొదవా? పైగా ఒకటికి రెండు రాష్ట్రాలు ఇప్పుడు. ఉభయ రాష్ట్రాల రాజకీయాలూ, దానికి తోడు ట్రంపు పుణ్యమా అని అమెరికా రాజకీయాలూ, ఇక వాదనలకు ముగింపు ఎక్కడా?చీకట్లు ముసురుతాయి అనగా పిల్లలని తీస్కుని బయలుదేరాము. మనుషుల్లో పడితే హాయిగా అనిపించింది. మావాడితో చెబితే సంతోషించాడు.. నాకు కంపెనీ దొరికినందుకు.

మెల్లగా ఇక్కడి రొటీన్‌కి అలవాటు పడిపోయాను. పొద్దునే కొడుకు, కోడలు పాపని డే కేర్‌లో దింపేసి ఆఫీసులకి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం పాపని డే కేర్‌ నుండి తీసుకురావడం, సాయంత్రం పార్కులో ఆడించి, కాసేపు కబుర్లు చెప్పుకుని రావడం. ఇలా రోజులు సాగుతున్నాయి. డే కేర్‌కి వెళ్ళడానికి కూడా తోడు ఉన్నారు మా సాయంకాలం ఫ్రెండ్సు. తమాషాగా వుంది, ఎక్కడికి ఏ పనికి వెళ్లాలన్నా, ఎవరో ఒకరు మన వాళ్ళు తోడు ఉంటున్నారు. ఏదో పరాయి దేశం అనే ఫీలింగే కలగడం లేదు.మామూలుగా మా గ్రూపులో రాజకీయాలపైన, లేకపోతే మా పిల్లలపైనా సాగుతుంటాయి మా మాటలు. ఇక్కడి పిల్లలు కేవలం అవసరాల కోసమే మమ్మల్ని పిలిపించుకుంటారనే ఎక్కువమంది వాదన. నా అభిప్రాయాలు వేరుగా ఉండటం వల్ల, నేను ఎక్కువగా వాదించను. విని ఊరుకుంటాను అంతే. కానీ రోజూ ఒకేలా ఉండదు కదా..!!

ఆవేళ మా కోడలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తోంది. పాపని ఇంట్లో ఉంచేసి నేను, మోహన్‌ గారు బయలుదేరాము పార్కుకి.ఒక్కడినే రావడం చూసి మూర్తి గారు అందుకున్నారు, ‘‘ఏంటి రావు గారూ, ఈ రోజు డ్యూటీకి సెలవా?’’ అని. పాపని తీసుకురావడం నా పిల్లలు నాపై వేసిన డ్యూటీ అని ఆయన వాదన.ఎవరైనా రిటర్న్‌ ఇండియా వెళ్తున్నా కూడా, ‘‘విడుదలైపోయారా? మా విడుదలకు ఇంకా ఇన్ని రోజులు ఉన్నాయి..’’ అంటూ జోకులు వేస్తూ ఉంటారు.ఆయన ప్రశ్నకి నేను నవ్వి ఊరుకున్నాను.‘‘వి హావ్‌ టు డిస్కస్‌ అండి ఈ రోజూ. ఇలా నవ్వి ఊరుకుంటే మేము ఒప్పుకోము.’’ ఆవేశంగా చెప్పుకుపోతున్నారు మూర్తి గారు.

‘‘అసలు ఏమనుకుంటున్నారు ఈ వెధవలు. వీళ్ళ ట్రాష్‌లు పడెయ్యడానికీ, లాండ్రీ చెయ్యడానికి, గిన్నెలు కడిగి పిల్లల్ని ఆడించడానికే మనము ఇక్కడికి వచ్చామా? ఏదో ఇంత సర్వీస్‌ అయ్యాక కాస్త రిలాక్స్‌ అవుదామని వస్తే, ఏముందండి ఇక్కడ? ఉరుకుల పరుగుల జీవితం, ఫ్రిడ్జిలో కూరలు, డిష్‌ వాషర్‌ లో గిన్నెలు, డే కేర్‌లో పిల్లలు.’’ఇంతలో వెంకట్‌ గారు అందుకున్నారు, ‘‘మా ఆవిడ అసలు గిన్నెలు కడిగి ఎరుగదండీ ఇండియాలో. ఇక్కడేమో వీళ్ళు వారమంతా చాకిరీ చెయ్యడం, వారాంతాలు ఇల్లు శుభ్రం చేసుకోవడం, కూరలు చేసి ఫ్రిడ్జులో పడెయ్యడం. పిల్లలని మా మోహాన కొట్టేసి పరుగులే పరుగులు. ఏదో వీళ్ళ అవసరం కోసం రమ్మనడమే తప్ప ఏమైనా పట్టించుకుంటున్నారా అసలు?’’ఘాటుగా సాగుతున్నాయి మా పిల్లలపై నిందారోపణలు.‘‘మీరు ఈ రోజు మాట్లాడాల్సిందే రావు గారూ! ఇలా మౌనంగా ఉంటే కుదరదు..’’ అని పట్టుబట్టారు మూర్తి గారు.

ఇక మాట్లాడక తప్పలేదు. అలాగని వారితో ఏకీభవించలేను. ఆత్మవిమర్శని ఎదుర్కోలేని వాణ్ణి. అందుకే నా మనసులో ఉన్నదే చెప్పదలచుకున్నాను.
నేను చెప్పే కంప్లయింట్లు వినడానికి ఉత్సాహంగా ముందుకి జరిగి కూర్చున్నారు నా మిత్రులు. మెల్లగా నా భావాలు చెప్పడం ప్రారంభించాను.‘‘నేను మీతో ఏకీభవించలేను అండి. ఎందుకంటే ఇప్పుడు మీతో ఏకీభవిస్తే, ఒకప్పటి కొడుకుగా నేను ఏమి చేశాను అనే ప్రశ్న నేను వేసుకోవలసి వస్తుంది. మనందరం బహుశా ఒకే సమయంలో మన జీవితాలను ప్రారంభించి ఉంటాము. అప్పటి మనం, మన తల్లిదండ్రులకు ఏమి చేశామో మన పిల్లలు మనకి అదే చేస్తున్నారు. చెప్పాలంటే ఇంకా ఎక్కువే చేస్తున్నారేమో.

మీ మీ సంగతులు నాకు తెలియవు. నా విషయంలో జరిగింది ఇది. ఉద్యోగరీత్యా మేము దూరంగా ఉండవలసి వచ్చింది. ఇప్పుడైతే అమెరికా కూడా పక్కనే ఉన్నట్టు ఉంది కానీ, అప్పటిలో ఇంకో రాష్ట్రంలో ఉద్యోగం అంటేనే విదేశాల్లో ఉన్నట్టు లెక్క. పల్లెలో మా నాన్న గారు నన్ను చదివించి మంచి ఉద్యోగం వచ్చేలా చేశారు. మరి నేను ఆయనకి ఏమి ఇవ్వగలిగాను? ఏమీ లేదే! వివాహం అయ్యేదాకా నెలకి ఇంత అని పంపేవాడిని. కాని పెళ్లి అయ్యి నాకంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత నేను మాత్రం చేసింది ఏమిటి? మూడు నెలలకి ఒకమారు వెళ్లి పలకరించి రావడం, వేసవి సెలవుల్లో పిల్లలని తీస్కుని ఒక ఇరవై రోజులు ఉండి రావడం. వారి శేష జీవితం అంతా కొడుకు వస్తాడు అని ఎదురుచూడడం, మనవళ్ల కోసం కాపు కాసుకొని కూర్చోవడంతో సరిపోయింది. 

అయినా, ఏనాడూ ఒక్క మాట అని ఎరుగరు. అసలు అనాలని కూడా వారికి తెలీదేమో. మనంత లోకం వారు చూసి ఉండరు కదా! మా అమ్మ ఆ వేసవి సెలవుల కోసం, ఆటోలోంచి దిగే మనవళ్ల కోసం, కోడలి కోసం వీధి అరుగు మీద కూర్చుని ఎదురుచూస్తూ ఉండే దృశ్యం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఉండే కొన్నిరోజులైనా నా మనవరాలితో ఎక్కువ సమయం గడుపుతున్నాను. మేము సెలవుల తర్వాత వెళ్లిపోయేటప్పుడు అమ్మ కళ్ళల్లో తడికి అర్థం ఇప్పుడు అర్థం అవుతోంది.

ఇక వీళ్ళ ఉరుకుల పరుగుల జీవితం మనం కోరుకున్నదేగా? మనం కన్న కలలే కదా వీరు నెరవేర్చింది. బాగా చదవాలి, అమెరికా వెళ్లి ఉద్యోగం చెయ్యాలి అని మనమే కదా పక్కింటి వారిని, ఎదురింటి వారిని చూపించి నూరిపోసింది. ఇన్ని అనుకుంటున్నాం కదా, మనలో ఎంత మంది బంధువులతో మా వాడు అమెరికాలో ఉన్నాడు అని గొప్పలు చెప్పుకోలేదు? మన మాట నిలబెట్టడానికే కదా ఈ ఉరుకుల పరుగుల జీవితం. సంపాదనే ముఖ్యం అనే సూత్రం మనం నూరిపోసిందే కదా! తప్పంతా పిల్లలపై నెట్టడం ఏమీ భావ్యం కాదు. మనం సృష్టించిన చట్రంలోనే ఇరుక్కుని తిరుగుతూ ఉన్నారు.

మొన్న మా అబ్బాయి మృదంగం వాయిస్తూ ఉంటే, చూస్తూ అలా ఉండిపోయాను. వాడికి మృదంగం అంటే ఆసక్తి ఉందని నాకు తెలీనే తెలియదు. ఎన్నడూ, ఏది చదవాలో చెప్పడమే కానీ, వాడికి ఏది ఇష్టమో ఒక్కసారి కూడా కనుక్కోలేదు నేను.మనం ఎలా గింజా గింజా ఏరి వారిని కాపాడుకున్నామో, వారూ అదే చేస్తున్నారు, వారి పిల్లల కోసం. వీలైతే ఉన్న కొన్ని రోజులు సాయం చేద్దాం. మనం చెయ్యలేనివి అయితే కాదు కదా! కూర్చుని తినిపించడానికి మనమేమి అవసాన దశలో కూడా లేము. ఆ సమయం వస్తే తప్పక చూసుకుంటారు.ఇక పట్టించుకోవడం అంటారా? నిజంగా చెప్పండి మనలో ఎంత మంది అమెరికా రాక ముందు విమానాలు ఎక్కారు? మన రాష్ట్రం కాకుండా, మన దేశంలో వేరే ప్రాంతాలకు ఎంత మంది ట్రిప్పులు వేశారు?

మూర్తి గారు! మీ అబ్బాయి మీ యానివర్సరీకి మీ ఇద్దరికీ గోవాకి టికెట్లు పంపించాడు అని చెప్పారు. ఎంత చక్కటి ఆలోచన కుర్రాడిది.
‘ఆ... వాడు రాకుండా ఏదో గిఫ్ట్‌ మాత్రం పంపాడు’’ అని తీసిపడేశారు. ఇక్కడ ఉండి కష్టపడి సంపాదిస్తున్నాడు కాబట్టే ఆ టికెట్లు పంపగలిగాడు. గోవా విశేషాలు, మీరు ఎంత బాగా ఎంజాయ్‌ చేసింది, మాకు చాలాసార్లు చెప్పారు మీరు!!మోహన్‌ గారూ! మీ సొంత ఇల్లు, అమ్మాయి పెళ్లి ఇవన్నీ ఘనంగా జరగడంలో మీ అబ్బాయి కృషి ఏమీ లేదా? లోపాలు, తప్పులు అందరూ చేస్తారు. వాటినే పట్టుకుని వేలాడితే ఎలా? ఎంతో కొంత మంచి కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్కరిలో? పైగా వీళ్ళు మన కడుపున పుట్టినవాళ్ళు.

మనం వాకింగ్‌ వెళ్తామంటే వాటికీ ప్రత్యేకంగా షూస్‌ తీసి ఇచ్చారు. వారాంతాల్లో ఎంత అలసిపోయినా చుట్టూ ఉన్న ప్రదేశాలు చూపిస్తున్నారు. మన కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు. వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తున్నారు. కాస్త ఒంట్లో నలతగా ఉన్నా వెంటనే అన్ని రకాల చెకప్పులకి వాళ్ళే అప్పాయింట్‌మెంట్లు తీసుకుంటున్నారు. ఈ చిన్న చిన్న పనుల ద్వారానే వారి ప్రేమని చూపిస్తున్నారు. మనకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడానికి అసలు వారికంటూ సమయం ఉంటే కదండీ! అలసిన శరీరాలు సేద తీరకముందే మరుసటి రోజు ప్రయాణం షురూ. మన పిల్లల కోసం మనం పాకులాడినట్టే వారు కూడా. çసృష్టిధర్మం అదే కదా?

ఇక పసిపిల్లల విషయం అంటే ఎంత పనో అందరికీ తెలిసిందే. చుట్టూ అంత మంది ఉండి కూడా వారిని పెంచడానికి ఆపసోపాలు పడుతూ ఉంటాము. ఎవరి సాయం లేకుండా ఇక్కడ పెంచడం అంటే ఎంత కష్టం. వీళ్ళే మనకి చిన్నపిల్లలుగా ఉంటారు. వారికి అప్పుడే పసిపిల్లలు. పెద్దలు లేకుండా ఎలా చేసుకోగలరు?నా వరకు నేను ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. పెద్దలకు పిల్లలకు మధ్య ప్రేమ, పాశాలు నీటి ప్రవాహం లాంటివి. అది ముందు తరాలకు ప్రవహిస్తూ ఉంటుంది తప్ప వెనక్కి రాదు, రాలేదు. 

రెక్కలు వచ్చి ఎగిరిన పక్షి తిరిగి రాలేదని బాధపడడం ఎందుకు? ఎగరడం నేర్చుకుందని సంతోషించాలి గాని! ఇదీ  నా అభిప్రాయం.’’ అంటూ నేను చెప్పవలసింది ఇక ఏమీ లేదని ఆపాను.అదివరకే అటువైపు ఉన్న అమ్మలు కూడా ఇటు వచ్చి నేను చెప్పినదంతా వింటూ ఉన్నారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. చీకట్లు పడుతూ ఉండడం వల్ల మెల్లగా సెలవు తీసుకుని ఒక్కొక్కరే వెళ్ళిపోయాము. నా వల్ల ఆ రోజు వాతావరణం గంభీరంగా మారినప్పటికీ నాలో నేను పడుతున్న సంఘర్షణని వాళ్ళకి చెప్పేయడంతో మనసు తేలికగా అనిపించింది.ఆపైన  కూడా, ఎవరి ఉరుకులు, పరుగులూ మరెవ్వరి కోసం ఆగలేదు. తరువాత మా సాయంకాలం కబుర్లలో మా పిల్లలు ఎప్పుడూ నలగలేదు.

Read latest Specials News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top