‘తన చొక్కా తానే చించుకుని డ్రామాలాడారు’

YSRCP Leader Vijaya Sai Reddy Comments After Met CEC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంల భద్రతకై రాష్ట్రానికి అదనపు బలగాలు కేటాయించాలని సీఈసీని కోరినట్లు వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద మరిన్ని కేంద్ర బలగాలతో భద్రత పెంచాలని విఙ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ సృష్టించిన అరాచకాల గురించి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌ సీపీ నేతల బృందం సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు కుట్రల వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తిందన్నారు. వీవీప్యాట్‌ పనిచేయకుంటే ఓటు వేసిన రోజే బాబు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘ఆరోజు పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకొచ్చి ఓటు వేసినట్టు వేలు కూడా చూపించారు. కుటుంబ సభ్యులతో కలిసి నవ్వులు చిందించారు. మరి అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. చంద్రబాబు తొత్తులు ఎస్పీలుగా ఉన్న జిల్లాల్లోనే లా అండ్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తింది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తినా వెంటనే సరిచేశారు. 130 స్థానాల్లో గెలుస్తా అంటారు. 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని పొంతన లేకుండా మాట్లాడతారు. బాబుకు ఓటమి భయం పట్టుకుంది.  ఈవీఎం చోరీ కేసులో జైలుకెళ్లిన హరిప్రసాద్‌ అనే వ్యక్తి మోసాలకు మారుపేరు. తెలుగు దొంగల పార్టీలో మాత్రమే అటువంటి వ్యక్తులకు ప్రవేశం ఉంటుంది’ అని పేర్కొన్నారు.

తన చొక్కా తానే చించుకుని..
‘ఎన్నికల విధుల్లో నారాయణ, చైతన్య సంస్థల సిబ్బంది ఉన్నారు. అందువల్ల వైఎస్సార్‌ సీపీ ప్రయోజనాలకే భంగం కలిగింది తప్ప టీడీపీకి కాదు. మచిలీపట్నంలో ఈవీఎం స్ట్రాంగ్‌ రూం లోపలి దృశ్యాలు బయటకొచ్చాయి. విజయనగరం, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో శాంతి భద్రతల ఉల్లంఘన జరిగింది. స్పీకర్‌ కోడెల స్వయంగా పోలింగ్‌ కేంద్రాన్ని క్యాప్చర్‌ చేసే ప్రయత్నం చేశారు. తన చొక్కా తానే చించుకుని డ్రామాలాడారు. గంటన్నరపాటు పోలింగ్‌ కేంద్రంలో గడియ వేసుకుని రిగ్గింగ్‌ చేస్తుండగా గ్రామస్తులు తిరగబడ్డారు. ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. తిరిగి మా కార్యకర్తలపైనే కేసు నమోదు చేశారు. ఏకంగా స్పీకరే ఉద్రిక్తతలు సృష్టించడాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లాం’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు, ఆశా వర్కర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించాలని సీఈసీని కోరినట్లు పేర్కొన్నారు. ‘ఆధార్‌ విభాగాధిపతి సత్యనారాయణ, ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆధార్‌ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని ఈ-ప్రగతి సంస్థకు ఇచ్చారు. ఆర్పీ ఠాకూర్‌కు సంబంధించిన వ్యక్తులు, ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు ఈ-ప్రగతి సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ- ప్రగతి విషయంలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ విషయాన్ని సమయం వచ్చినపుడు ఆధారాలతో సహా బయటపెడతాం’ అని హెచ్చరించారు.

చదవండి : సీఈసీని కలిసిన వైఎస్సార్‌ సీపీ నేతలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top