సిద్ధిపేట అంటేనే నమ్మకం: హరీశ్‌ రావు

TRS eyeing 5 ZPTC seats in siddipet, says Harish Rao - Sakshi

సాక్షి, సిద్దిపేట : తెలంగాణలో జరిగే ఏ ఎన్నిక అయినా టీఆర్‌ఎస్‌దే విజయమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. జిల్లాలో ఐదు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవాలని, టీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుందని, కానీ పార్టీ నిర్ణయించిన వారికి మద్దతుగా నిలబడి గెలిపిస్తే అందరికి గౌరవం ఉంటుందని చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గంలో సైనికుల్లాంటి కార్యకర్తలు, నమ్మకస్తులైన ఓటర్లు ఉన్నారని, మీరందరే తన బలం అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అభివృద్ధి, సంక్షేమం, పార్టీని బలోపేతం చేయడంలో సిద్దిపేట ముందు వరుసలో ఉందని, ఇప్పుడు కూడా అందరం కలసికట్టుగా పనిచేసి అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. సిద్దిపేట అంటేనే నమ్మకమైన కార్యకర్తలకు నిదర్శనం అని మరోసారి రుజువు చేయాలని హరీశ్‌ రావు అన్నారు. ‘బ్యాంకుల్లో డబ్బులు ఉంటే ఎంత నమ్మకం ఉంటుందో.. మీ మీద నాకు, టీఆర్‌ఎస్‌ పార్టీకి అంతే నమ్మకం ఉంటుందని అన్నారు. అభ్యర్థుల ఖరారు కూడా గ్రామస్తులు, పార్టీ పెద్దలు సమావేశమై గ్రామాభివృద్ధికి దోహద పడే నాయకుడిని ఎంపిక చేసుకోవాలని’ సూచించారు. అందరి ఆమోదంతోనే అభ్యర్థులను నియమించుకొని ఐక్యంగా పనిచేయాలని హితవు చెప్పారు.

పార్టీలో పని చేసిన ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని ప్రతీ కార్యకర్తను తన కుటుంబ సభ్యునిగా చూశానని, మీరు కూడా అంతే గౌరవం ఇచ్చారని అన్నారు. ఇదే ఆనవాయితీ కొనసాగించి నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, నంగునూరు జడ్పీటీసీలు, 45 ఎంపీటీలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top