పవన్‌ తన భార్యతో ఏ భాషలో మాట్లాడతారు?

TJR Sudhakar Babu Comments On English Medium In Govt Schools - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రజ్యోతి ఎండీ  వేమూరి రాధాకృష్ణ ఇంగ్లిష్‌ మీడియంపై తప్పుడు రాతలు రాస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఇంగ్లిష్‌ మీడియంపై అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మనవడిని తెలుగు మీడియంలో చదివిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ‘విదేశీయురాలైన తన భార్యతో పవన్ కళ్యాణ్ ఏ భాష మాట్లాడుతున్నారు? మీ పిల్లలు ఏ భాషలో చదువుతున్నారు? మీ పిల్లలే ఉన్నత చదువులు చదువుకోవాలా మా పిల్లలు చదువుకోకూడదా’ అని తీవ్రంగా దుయ్యబట్టారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ.. చంద్రబాబు చెంచా అని మండిపడ్డారు. 

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజశేఖర్‌ రెడ్డి కన్నా ఎక్కువగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. సీఎం జగన్‌ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా తప్పుడు వార్తలు రాస్తున్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి వంటి పథకాలు రాధాకృష్ణ కంటికి కనిపించడం లేదా? చంద్రబాబు రుణమాఫీ అంటూ రైతులను మోసం చేస్తే.. ఒక్కవార్త ఆంధ్రజ్యోతి పేపర్లో రాయలేదు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి 50 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాయలేదు? లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే.. పేపర్‌ లీకైందని తప్పుడు వార్తలు రాసి రాధాకృష్ణ ప్రజలతో చీవాట్లు తిన్నారు.

సీఎం జగన్‌ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడితే దానికి మతం రంగు పులుముతున్నారు. నారాయణ, శ్రీ చైతన్య స్కూల్స్‌ను కాపాడుకోవడం కోసం రాధాకృష్ణ అసత్య వార్తలు రాస్తున్నారు. పేద విద్యార్థులకు నారాయణ, చైతన్య పాఠశాలల్లో చదువుకొనే స్తోమత లేదు. ఆ విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవడం వారికి ఇష్టం లేదు. ఏబీఎన్‌, ఈటీవీ, టీవీ 5 పేర్లు ఇంగ్లిష్‌లో ఎందుకు పెట్టుకున్నారు? చంద్రబాబు నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయి, ఆయన మాటలను ప్రజలు నమ్మరు. బడుగు బలహీన వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియం దూరం చేసిన టీడీపీని, చంద్రబాబును వెలివేయాల’ని సుధాకర్‌ బాబు హితవు పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top