స్మృతి ఇరానీకి షాకిచ్చిన ప్రజలు

Smriti Irani Gets Shocking Answer From Crowd Over Did You Receive Farm Loan Waiver Question - Sakshi

భోపాల్‌ : ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలీంగ్‌ నేపథ్యంలో.. బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఆమె బుధవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అశోక్‌నగర్‌లో ప్రజలను ఉద్దేశించి స్మృతి ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అమలు చేస్తోందా అని ప్రశ్నించారు. ‘అవును.. మాకు రుణమాఫీ అయ్యింది’ అంటూ అశోక్‌నగర్‌ ప్రజలు ఆమెకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. అంతేకాకుండా పదే పదే అవే నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో కంగుతిన్న స్మృతి కాసేపు ప్రసంగం ఆపి.. ఆ తర్వాత కొనసాగించారు.

ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘ఇప్పుడు ప్రజలు కూడా ఈ అబద్ధాల కోరులకు నేరుగానే జవాబు ఇవ్వడం మొదలు పెట్టేశారు. అబద్ధాలు వ్యాప్తి చేసేవాళ్లు రండి పర్లేదు’ అంటూ కామెంట్‌ చేసింది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో రాహుల్‌ గాంధీ, స్మృతి ఇరానీ లోక్‌సభ ఎన్నికల్లో ముఖాముఖి తలపడుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో భారీ తేడాతో రాహుల్‌ చేతిలో ఓడిన స్మృతి ఇరానీ.. ఈ దఫా గెలిచితీరాలనే కసితో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వయనాడ్‌లో పోటీ చేయడం ద్వారా రాహుల్‌ తనను గెలిపించిన అమేథీ ప్రజలను అవమానించారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు రాజకీయ నాయకులకు ప్రజల నుంచి వస్తున్న ఊహించని సమాధానాలు మింగుపడటం లేదు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోనే ఇటువంటి సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీ నల్లధనం వెనక్కి తెచ్చారా అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ప్రశ్నించగా ఓ యువకుడు వేదికపైకి వచ్చాడు. మోదీజీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపి ఉగ్రవాదులను చంపేశాడు అంటూ చెప్పడంతో కంగుతిన్న కాంగ్రెస్‌ నేతలు.. అతడిని వేదిక మీద నుంచి తరిమేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top