ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ | Polling ended peacefully | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

Dec 8 2018 2:15 AM | Updated on Dec 8 2018 10:07 AM

Polling ended peacefully - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. పోలీస్‌ శాఖ చేపట్టిన భారీ బందోబస్తు, వ్యూహాత్మక ఏర్పాట్లతో చిన్న చిన్న ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్‌ పూర్తయింది. మొత్తంగా లక్ష మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారు.

యాక్షన్‌ టీం కుట్ర భగ్నం
ఖమ్మం జిల్లాలోని చర్లలో ఎన్నికల సిబ్బంది, పోలీస్‌ బలగాలను టార్గెట్‌గా చేసుకుని మావోయిస్టు యాక్షన్‌ టీం ల్యాండ్‌మైన్లు పేల్చేందుకు కుట్ర పన్నింది. ముందుగానే పసిగట్టిన గ్రేహౌండ్స్, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ బృందాలు వాటిని నిర్వీర్యం చేశాయి. యాక్షన్‌ టీంలోని పలువురు సభ్యులను సైతం పోలీసులు అరెస్ట్‌ చేయడంతో భారీ ముప్పు తప్పిందని పోలీస్‌ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన ఆసిఫాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్, చెన్నూర్, భూపాలపల్లి, ములుగు, మంథని, కొత్తగూడెం, అశ్వరావుపేట, ఇల్లందు, వైరా, పినపాక, భద్రాచలంలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ముగియడంతో భారీ బందోబస్తు నడుమ ఈవీఎం యంత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించారు. 32,500 పోలింగ్‌ స్టేషన్లలో అదనపు బలగాలను రంగంలోకి దించి భద్రత ఏర్పాట్లు నిర్వహించారు.

రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మంలో చెదురుమదురు ఘటనలు తప్పా మిగిలిన చోట్ల ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు నుంచి 20 వేల మంది, కేంద్ర బలగాల నుంచి 25 వేల మంది, రాష్ట్ర పోలీసులు 50 వేల మంది మొత్తంగా లక్ష మంది వరకు సిబ్బందిని బందోబస్తులో నిమగ్నం చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, ప్రత్యేక తనిఖీ బృందాలతో సోదాలు, అదేవిధంగా అంతరాష్ట్ర సరిహద్దుల్లో సుమారు 250కి పైగా చెక్‌పోస్టులు, జిల్లాల్లో 515 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సుమారు రూ.125 కోట్ల మేర నగదు, 6 లక్షల లీటర్ల మద్యం తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజల సహకారంతోనే..: డీజీపీ
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వారి ఓటు హక్కు వినియోగించుకున్నారని, పోలీసులతో పాటు ప్రజలంతా సహకరించారని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈవీఎంలన్నింటినీ భారీ భద్రతతో స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించామని వెల్లడించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలతో గట్టి భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు 3 నెలల ముందే దీనిపై రాష్ట్ర పోలీసులు టీం వర్క్‌ చేశారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల బందోబస్తులో అంకితభావంతో పనిచేసిన సిబ్బందికి మహేందర్‌రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని డీజీపీ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement