
సమరం సమ ఉజ్జీల మధ్య సాగితే ఆ మజాయే వేరు.. రాజకీయం రోజుకో రంగు మారుతుంటే ఆ థ్రిల్లే వేరు.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య హోరాహోరీ పోరు నెలకొంటే ఆ కిక్కే వేరు.. పదిహేనేళ్లుగా మధ్యప్రదేశ్‌లో కాషాయం జెండాలే రెపరెపలాడాయి. ఆ పార్టీని ఎదిరించే నాయకుడు లేక పాలిటిక్స్ చప్పగా సాగాయి. అనూహ్యంగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం ‘హస్త’గతమైంది. అప్పట్నుంచి ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ వేరన్న ధీమాతో బీజేపీ ఎన్నికల రణక్షేత్రంలో తలపడుతున్నాయి.
ఒకవైపు మూడుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలను తన గుప్పెట్లో పెట్టుకున్న శివరాజ్‌సింగ్ చౌహాన్.. మరోవైపు కాంగ్రెస్ రాజకీయ దిగ్గజం, ప్రస్తుత ముఖ్యమంత్రి కమల్‌నాథ్. ఈ ఎన్నికల్లో వీరిద్దరి మధ్యే పోటీ. సంక్షేమ పథకాల సారథిగా జనంలో కరిష్మా ఉన్న నాయకుడు చౌహాన్. ఆయనని అందరూ ప్రేమగా ‘మామా’ అని పిలుస్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లో చౌహాన్‌కున్న ఇమేజ్‌కి తోడు మోదీ హవా కలసి రావడంతో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 29 స్థానాలకు 27 చోట్ల జయకేతనం ఎగురవేసింది. కానీ రైతు సమస్యలు, నిరుద్యోగం వంటి కారణాలతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. అయితే ప్రత్యర్థి కంటే ఓట్లు ఎక్కువగా సాధించడం విశేషం. బీజేపీకి 41 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్‌కు 40.9 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 230 స్థానాలున్న అసెంబ్లీలో 114 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ మెజార్టీకి 2 సీట్ల దూరంలో ఉండిపోయింది. బీఎస్పీ మద్దతుతో అధికారాన్ని దక్కించుకుంది. కమల్‌నాథ్ సీఎం పీఠం అధిష్టించిన దగ్గరి నుంచి లోక్‌సభ ఎన్నికలపైనే దృష్టి పెట్టి.. దానికి అనుగుణంగా వ్యూహాలు పన్నుతూ పాలనను పరుగులెత్తిస్తున్నారు. మరోవైపు బీజేపీ.. వందరోజులు దాటిన కమల్‌నాథ్ పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపుతూ సమరశంఖం పూరిస్తోంది. కేంద్రంలో మోదీకున్న ఇమేజ్ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి వస్తుందని భావిస్తోంది.
హేమాహేమీల హోరాహోరీ
అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య లేదు. బీజేపీలో లోక్‌సభ ఎన్నికల్ని ముందుండి నడిపించడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండనే ఉన్నారు. ఇక జనాదరణ కలిగిన నాయకులు సుందర్‌లాల్ పాత్వా, ఉమాభారతి బీజేపీకి అండదండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజకీయ వ్యూహాలే పార్టీని ముందుండి నడిపించనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటి వర్గపోరుకి చెక్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా బీజేపీ బలంగా ఉండే భోపాల్ నుంచి దిగ్విజయ్ సింగ్‌ను ఎన్నికల బరిలోకి దింపింది. ఇక యువనేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కి ఎప్పుడూ అదనపు ఆకర్షణే.
కమల్ వర్సెస్ కమలం
కమల్‌నాథ్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయ్యాయి. ఈ వంద రోజుల్లోనే సీఎం మరో 83 హామీలు ఇచ్చారు. 50 లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని ప్రకటించారు. సామాజిక భద్రతా పింఛన్‌ను రూ.300 నుంచి వెయ్యి రూపాయలకు పెంచారు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రతీ పరిశ్రమకు మూడేళ్లపాటు రూ.10 వేల చొప్పున ఇన్సెంటివ్ ఇస్తామని హామీనిచ్చారు. ఇవన్నీ ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచాయి. వీటన్నింటినీ మించి గ్రామీణ ప్రాంతం అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన కనీస ఆదాయ పథకం (న్యాయ్) ఒక గేమ్ ఛేంజర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ ఈ వంద రోజుల పాలననే ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది. ‘రైతులకు రుణ మాఫీ అన్నారు. కానీ అదొక శుద్ధ అబద్ధం. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామన్నారు. బడ్జెట్‌లో రూ.5,000 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పటివరకు రూ.1300 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంతేకాదు లోక్‌సభ ఎన్నికల తర్వాతే రుణ మాఫీ జరుగుతుందని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే ఎన్నికల కోడ్ అంటున్నారు’ అంటూ శివరాజ్‌సింగ్ చౌహాన్ ఎదురుదాడికి దిగుతున్నారు. కమల్‌నాథ్ అధికారంలోకి రాగానే నీతి, నిజాయితీ ఉన్న అధికారుల్ని మార్చేశారంటూ దుయ్యబడుతున్నారు. కాగా, భోపాల్, రైజెన్, విదిష, సెహోర్ జిల్లాల్లో కాంగ్రెస్ హామీలపై అసంతృప్తి నెలకొనడంతో మూడు నెలల పాలనే ఈ ఎన్నికల్లో అగ్ని పరీక్షగా మారింది.
చౌహాన్ హవా
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు్ల పాటు పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్ పార్టీకి మించి ఎదిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి ప్రధానమంత్రి మోదీని పెద్దగా రానివ్వలేదు కూడా. తన సంక్షేమ కార్యక్రమాలనే నమ్ముకొని ఎన్నికల బరిలో దిగారు. ఓటమి పాలయ్యాక తనదే నైతిక బాధ్యతని ప్రకటించారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్ని కూడా తన భుజస్కంధాలపైనే వేసుకున్నారు. ‘మామ’ మాకు ఎంతో చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎందుకు ఓటమి పాలయ్యారో అర్థం కావడం లేదు. చౌహాన్ సంక్షేమ కార్యక్రమాలతో నేరుగా మా బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వచ్చి పడేవి’ అని విదిషకు చెందిన రైతు ధర్మేంద్ర కిరార్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో చౌహాన్‌కు ఉన్న ఇమేజ్ ఇంకా చెక్కు చెదరలేదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగుతోంది. చౌహాన్ రాష్ట్ర ఖజానాను గుల్ల చేశారని, ఆయన ఓటమి పాలయ్యాక చౌహాన్‌ను బీజేపీ దూరం పెట్టిందని ప్రచారం చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పోస్టర్లలో చౌహాన్ ఫొటో ఎక్కడా ఎందుకు లేదని ప్రశ్నిస్తోంది. అయితే 2003 నుంచి బీజేపీ ప్రచార వ్యూహకర్తల్లో ఒకరైన చౌహాన్‌ను పార్టీ విస్మరించే పరిస్థితి లేదు. లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తా చూపిస్తారనే ఆయనను ప్రతిపక్ష నేతగా కూడా నియమించలేదు. ‘బీజేపీలో అంతర్గతంగా ఉన్న పోరుని అరికట్టి, కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని పెంచే నాయకుడు చౌహాన్. ఎన్నికల సమయంలో ఆయన చూపించే శక్తియుక్తులు మరెవరికీ సాధ్యం కావు’ అని మధ్యప్రదేశ్ రాజకీయ పరిశీలకుడు గిరిజా శంకర్ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచినా పార్టీలో అంతర్గతంగా ఓట్లు తక్కువ నమోదవడంపై చర్చ జరుగుతోంది. దీనిని అధిగమించే వ్యూహాలకు కమల్‌నాథ్ పదును పెడుతున్నారు. 45 శాతంపైగా ఉన్న ఓబీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఓబీసీ రిజర్వేషన్లను 14 నుంచి 27 శాతానికి పెంచుతూ నిర్ణయించింది. అయితే ఎన్నికల ముందు ఇది సరి కాదంటూ హైకోర్టు అక్షింతలు వేసి పెంపు నిర్ణయంపై స్టే విధించింది. జనాభాలో 21.1 శాతానికి పైగా ఉన్న ఆదివాసీల ఓట్లను ఆకర్షించడానికి అటవీ హక్కుల చట్టం కింద భూ యాజమాన్య హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడమే లోక్‌సభ ఎన్నికల్లో తమకు లాభం కలిగిస్తుందని కమల దళం భావిస్తోంది. ఇప్పటి వరకు ఏడుగురు సిట్టింగ్ ఎంపీలను మార్చేసింది. ‘ఈ ఎన్నికల్లో మోదీ ఇమేజ్‌నే నమ్ముకున్నాం. మోదీ పాలనపై 60 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇక కమల్‌నాథ్ ప్రభుత్వంపై చాలా జిల్లాల్లో అసంతృప్తి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ హామీ శుద్ధ అబద్ధమని విస్త్రృతంగా ప్రచారం చేస్తాం’ అని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు
హిందూత్వ
మధ్యప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 90 శాతానికి పైగా హిందువులే కావడంతో హిందూత్వ కార్డు ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో హిందూత్వ గాలులు బలంగా వీస్తున్నాయి. శివరాజ్‌సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్న కాలంలో హిందూ మితవాదిగానే ఉన్నా హిందూత్వ వాదానికి బలం చేకూర్చేలా వ్యవహరించారు. కమల్‌నాథ్ తన వంద రోజుల పాలనలో హిందూత్వ బ్రాండ్‌ని ప్రచారం చేయడానికి ప్రాధాన్యతనిచ్చారు. వచ్చే నాలుగు నెలల్లో వేలాది గోశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా చూస్తున్న రాజకీయ పరిశీలకులు కమల్‌నాథ్ బీజేపీకి బీ–టీమ్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
నిరుద్యోగం
అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్మ్స్ (ఏడీఆర్) సర్వేలో వ్యవసాయం కంటే నిరుద్యోగమే ఈ ఎన్నికల్లో అధిక ప్రభావం చూపిస్తుందని 62 శాతం మంది ఓటర్లు తమ మనోగతాన్ని చెప్పారు. సరైన ఉద్యోగావకాశాలు లేక యువత నిరాశలో కూరుకొని ఉండడం బీజేపీకే నష్టం కలిగిస్తుందన్న అంచనాలైతే ఉన్నాయి.
వ్యవసాయ సంక్షోభం
2011 జనాభాæ లెక్కల ప్రకారం 71 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తారు. పంటలకు కనీస మద్దతు ధర, రుణమాఫీ అమలు, రైతు ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టే వారికే ఓట్లు వేస్తామంటూ వాళ్లు నినదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ ఇంకా పూర్తిగా జరగకపోవడం కమల్‌నాథ్ సర్కార్‌ని ఆత్మరక్షణలో పడేసింది. మరోవైపు వైద్య సౌకర్యాలు, విద్యుత్, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల కల్పన కూడా ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి.
ఫలితాల వెనక గణితాలు
2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 45 శాతం ఓట్లతోనే 165 సీట్లు సాధించగలిగింది. అదే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 54 ఓట్ల శాతంతో 27 సీట్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. మళ్లీ 2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2018 ఎన్నికల్లో 4 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. కానీ సీట్లు మాత్రం 165 నుంచి 109కి పడిపోయాయి. మన ఎన్నికల వ్యవస్థలో వైచిత్రికి ఇదే పెద్ద ఉదాహరణ. ఈ ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై ఎలా పడుతుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల ఓట్లు, సీట్లను వివిధ కోణాల్లో పరిశీలించిన నిపుణులు బీజేపీకి 17, కాంగ్రెస్‌కి 12 రావచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ఈసారి హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నారు.
మొత్తం ఓటర్లు : 5.14 కోట్లు
గ్రామీణ ప్రాంత ఓటర్లు : 72.4 శాతం
ఎన్నికల తేదీలుఏప్రిల్ 29,మే 6, మే 12, మే 19
2009 లోక్‌సభ ఫలితాలు
బీజేపీ 16
కాంగ్రెస్12
బీఎస్పీ 01
2014 లోక్‌సభ ఫలితాలు
బీజేపీ 27
కాంగ్రెస్02