కాంగ్రెస్‌కు టెక్నాలజీ అంటే భయం

BJP promotes technology but some parties still oppose EVM, Aadhaar - Sakshi

అందుకే ఆధార్, ఈవీఎంలను వ్యతిరేకిస్తోంది: మోదీ  

బెంగళూరు: కాంగ్రెస్‌కు టెక్నాలజీ అంటే భయమని, అందుకే ఆధార్, ఈవీఎంలను వ్యతిరేకిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్య మిచ్చి ఆధునిక భారతాన్ని ఆవిష్కరించడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఆయన సోమవారం ‘నమో’ యాప్‌ ద్వారా కర్ణాటక యువమోర్చా కార్యకర్తలతో సంభాషించారు. ‘ఒకవైపు కొన్ని పార్టీలు సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వెనకబడి ఉన్నాయి. అవి పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోవడమో లేదా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ప్రచారం చేయడమో చేస్తున్నాయి. అందుకే ఈవీఎం, ఆధార్‌ కార్డు, మొబైల్‌ ఫోన్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు’ అని మోదీ అన్నారు.

ఈ నెల 12వ తేదీన జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో హంగ్‌ వస్తుందని వదంతులున్నప్పటికీ.. ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చడానికి కార్యకర్తలు కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ కర్ణాటక ప్రజల ఉత్సాహం ఏం తగ్గలేదని, వారు తమంతట తామే ఎన్నికల కోసం పోరాడుతున్నారన్నారు. యువమోర్చా కార్యకర్తలను ప్రశంసిస్తూ.. ‘ఆన్‌లైన్‌.. ఆఫ్‌లైన్‌.. సమూహంతో పరిచయాలు.. దేనిలోనైనా యువశక్తి ముందు భాగాన ఉంటుంది. యువతే బీజేపీకి వెలకట్టలేని ఆస్తి’ అని అన్నారు. తమ విధానాల ఫలితంగా పబ్లిక్, ప్రైవేటు, రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తమ హయాంలో ఉపాధి కల్పనలోనే కాదు అన్ని రంగాల్లో విఫలమైందని.. బీజేపీ నాలుగేళ్ల పాలనలోనే ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని మోదీ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top