‘ఏపీని ఆదుకున్న ఏకైక పార్టీ మాదే’

BJP MLC Somu Veerraju Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజవాడ : ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకున్న ఏకైక పార్టీ బీజేపీయేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాణం పెట్టి సభా సమయాన్ని వృధా చేసిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు గురించి చంద్ర బాబు ఎన్నడు కేంద్రాన్ని అడగలేదని ఆరోపించారు. ఆంధ్రకు చేసిన అభివృద్ధిపై టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో చర్చకు తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీది అభివృద్ధి వాదం అయితే టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలది పలాయన వాదం అని ఎద్దేవా చేశారు. భద్రాచలం తెలంగాణలో ఉండిపోవడానికి కారణం టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలేనని ఆరోపించారు.

పోలవరంతో బాబుకు సంబంధమే లేదు
పోలవరంతో చంద్రబాబుకు ఎటువంటి సంబంధంలేదని సోము వీర్రాజు అన్నారు. 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు పోలవరం శంకుస్థాపన చేయలేదని ప్రశ్నించారు. 2005లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పోలవరానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఎన్‌ఆర్‌జీఎస్‌ కింద రాష్ట్రానికి 30వేల కోట్లు ఇచ్చామని.. ఈ డబ్బుతో రెండు పోలవరం ప్రాజెక్టులను కట్టవచ‍్చని ఎద్దేవా చేశారు. నీరు చెట్టు అవినీతి సొమ్ముతో ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టు నిర్మించవచ్చని విమర్శించారు.

ఆంధ్రజ్యోతిది సైకిల్‌ వాదమా
ఆంధ్రజ్యోతి దినపత్రికపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. మోదీది పలాయన వాదం అంటూ వార్త రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీది పలాయన వాదమైతే ఆంధ్రజ్యోతిది సైకిల్‌ వాదమా అని ప్రశ్నించారు.జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు జాతీయ వాదం ఎగర వేసిన నాయకులు బీజేపీ నేతలు అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top