కమలంలో ఖుషీ | BJP in happy with elections | Sakshi
Sakshi News home page

కమలంలో ఖుషీ

Dec 8 2018 2:18 AM | Updated on Dec 8 2018 5:21 AM

BJP in happy with elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుం దన్న ధీమాను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం పోలింగ్‌ ముగిసిన అనంతరం పార్టీ శ్రేణులు తమ అంచనాల్లో నిమగ్నమయ్యాయి. కచ్చితంగా గెలిచే స్థానాలతో పాటు ఎక్కువ అవకాశం ఉన్న స్థానాల వారీగా పార్టీ అభ్యర్థులకు పడిన ఓట్లపై లోతైన విశ్లేషణ చేస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదన్న అంచనా వేస్తున్న బీజేపీ తమకు వచ్చే స్థానాలు కీలకం అవుతాయన్న ఆలోచనలు చేస్తోంది. తమ సిట్టింగ్‌ స్థానాలు అన్నింటిని గెలుచుకోవడంతోపాటు జిల్లాల్లో కనీసంగా 10 స్థానాల వరకు తాము గెలిచే అవకాశాలున్నాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

క్యాంపెయినర్ల ప్రచారంతో భారీ మార్పు
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్ర నేతలు.. ఇలా దాదాపు 40 మందికి పైగా స్టార్‌ క్యాంపెయినర్లు 180కి పైగా బహిరంగ సభల ద్వారా చేసిన ప్రచారం పార్టీకి ఎంతో మేలు చేకూర్చిందన్న సంతృప్తిని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను మొదటిసారి 118 స్థానాల్లో పోటీ చేసి పార్టీ సత్తా నిరూపించుకుందని చెబుతున్నారు. అయితే ఆ ప్రచారం మరింత ముందుగా ప్రారంభించి, మరింత కష్టపడి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని, మరింత ఎక్కువ ప్రయోజనం పార్టీకి చేకూరేదని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారాన్ని సిట్టింగ్‌ స్థానాలతో పాటు గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాలు, తాము గెలిచే అవకాశమున్న మరికొన్ని స్థానాలపైనా దృష్టి సారించి చేపట్టడం బీజేపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలను పెంచాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. అంబర్‌పేట, గోషామహల్, ఖైరతాబాద్, ముషీరాబాద్, ఉప్పల్‌ సిట్టింగ్‌ స్థానాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్‌ అర్బన్, కల్వకుర్తి, సూర్యాపేట, నిర్మల్, ముథోల్, కామరెడ్డి, జుక్కల్, ఆదిలాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశముందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.

అంచనాలకు దగ్గరగా ఎగ్జిట్‌ పోల్స్‌
తాము లేకుండా తదుపరి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేది లేదని పేర్కొన్న అమిత్‌ షా, జేపీ నడ్డా, రాం మాధవ్‌ వంటి అగ్ర నేతల వ్యాఖ్యలకు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు సమీపంలో ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎంఐఎంలేకుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏర్పాటులో పాలు పంచుకునే పరిస్థితికి బీజేపీ చేరిందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్ల కిందట కేంద్ర కేబినెట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, తెలంగాణ ప్రభుత్వంలో హైదరాబాద్‌లోని ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు చేరుతారని భారీఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇపుడు అవే అంచనాలు, విశ్లేషణలు పార్టీ వర్గాల్లో మొదలయ్యాయి.  ఎంఐఎం లేకుండా టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో చేరే విషయంలో పార్టీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయం మేరకు నడుచుకుంటామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement