స్టెయిన్‌బెక్ దురాక్రమణ | Madurantakam narendra write on durakramana book | Sakshi
Sakshi News home page

స్టెయిన్‌బెక్ దురాక్రమణ

Feb 8 2016 12:06 AM | Updated on Sep 3 2017 5:08 PM

స్టెయిన్‌బెక్ దురాక్రమణ

స్టెయిన్‌బెక్ దురాక్రమణ

జాన్ స్టెయిన్‌బెక్ నవలిక ‘ది మూన్ యీజ్ డౌన్’ను విద్వాన్ విశ్వం 1943లోనే ‘దురాక్రమణ’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారని నాగసూరి వేణుగోపాల్ ఇటీవల వో వ్యాసంలో రాశారు.

ఇప్పుడే చదివిన పుస్తకం
 
జాన్ స్టెయిన్‌బెక్ నవలిక ‘ది మూన్ యీజ్ డౌన్’ను విద్వాన్ విశ్వం 1943లోనే ‘దురాక్రమణ’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారని నాగసూరి వేణుగోపాల్ ఇటీవల వో వ్యాసంలో రాశారు. నేను ఫోన్ చేసి అడిగితే దాని జిరాక్సు కాపీని పంపారు.
 
స్టెయిన్‌బెక్ అరుదైన గొప్ప రచయిత. ఆయన రచనలన్నీ గొప్పవే. ‘ది మూన్ యీజ్ డౌన్’ను చాలా కాలం క్రితమే చదివినా, దాని అనువాదాన్ని చదవడం కూడా గొప్ప అనుభవంగానే మిగిలింది. ‘దురాక్రమణ’ ఫాసిజాన్ని విమర్శిస్తూ రాసిన నవలిక.
చిన్న నగరాన్నొకదాన్ని శత్రువులు ఆక్రమించుకుంటారు. ఆ నగరపు పౌరులు పెద్దగా ప్రతిఘటించకుండా లొంగిపోతారు. శుత్రుసైన్యాధిపతి ఆ నగరపు మేయరు యింటిలోనే తన ఆఫీసును పెట్టుకుంటాడు.
 
తాను ఆక్రమించుకున్న రాజ్యంలో ప్రశాంతత వుండాలనీ, అక్కడి ప్రజల్నే బొగ్గుగనిలో పనివాళ్ళుగా వాడుకోవాలనీ ప్రయత్నిస్తాడు. అయితే శాంతికాముకులూ, సామాన్యులూ అయిన ఆ నగరపు పౌరులు మొదటినుంచీ ఆందోళన పడుతూనే వుంటారు. వాళ్ళలో వొకడు వో సైన్యాధికారిని గాయపరచి, మరణశిక్షను అనుభవిస్తాడు. దాంతో ఆ నగర ప్రజలు యెదురు తిరిగే అవకాశం కోసం యెదురుచూడ్డం ప్రారంభిస్తారు.
 
వూరుకాని వూరులో వచ్చి బతకాల్సిరావడంతో శుత్రుశిబిరాలన్నీ బలహీనపడతాయి. క్రమంగా గెలిచిన శుత్రువులు యుద్ధమెంత అనవసరమైన పనో తెలుసుకుంటారు. జిగురు కాగితాన్ని ఆక్రమించుకున్నా మనుకుని దానికి తగులుకుపోయిన యీగల్లా మిగిలామని అర్థం చేసుకుంటారు. నగరపు పౌరులు కొందరు యింగ్లాండుకు పారిపోయి, అక్కడినుంచీ డైనమైట్ పంపిస్తారు. యీ గొడవ నాపకపోతే మేయరునుగూడా చంపుతామని శుత్రుసైన్యాధిపతి ప్రకటిస్తాడు. చావు దగ్గరవుతున్నప్పటికీ బెదరకుండా మేయరు ‘‘బాకీ తీర్చే తీరుతాం’’ అనడంతో నవల ముగుస్తుంది.
 
యీ నవలిక చాప్లిన్ ‘ది గ్రేట్ డిక్టేటర్’ అంత గొప్పగా ఫాసిజం దుమ్ము దులిపి పారేస్తుంది. అయితే స్టెయిన్‌బెక్‌లో చాప్లిన్‌కున్నంత హాస్యమూ, వ్యంగ్యమూ లేవు. చాలా సీరియస్‌గా వుంటూనే, దురాక్రమణ దుర్మార్గం మాత్రమేగాకుండా అసాధ్యమని గూడా సహేతుకంగా నిరూపిస్తాడు. తరువాత దీన్ని సినిమాగా కూడా తీశారు.
 
యీ నవలికను విశ్వంగారు స్వాతంత్రం రాకముందే అనువదించారు. యీ పుస్తకాన్ని ప్రచురించిన నవ్య సాహిత్యమాల, అనంతపురంవాళ్ళు అప్పుడే యిలాంటివే 16 పుస్తకాలు ప్రచురించారని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యీ అనువాదంలో విశ్వం లెక్కలేనన్ని అనంతపురం మాటలు వాడుతూ, మాండలిక రచనలకు తెరతీశారు. ఆయన అసలు సిసలైన రాయలసీమ సాహిత్య వైతాళికుడు.

మధురాంతకం నరేంద్ర

9866243659

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement