గోండు భాషకు కొత్త సొబగులు

గోండు భాషకు కొత్త సొబగులు


గోండుల భాషపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ‘గుంజాల గోండీ లిపి అధ్యయన వేదిక’ తరఫున చాలా కార్యక్రమాలు జరిగాయి. రేపు గుంజాల గ్రామంలో గుంజాల గోండి లిపి దినోత్సవ సందర్భంగా ఈ వ్యాసం.

 

 ఆదిలాబాద్ జిల్లా నార్నె మండలం గుంజాల అనే గ్రామంపై ఇప్పుడు అనేకమంది భాషా పరిశోధకుల దృష్టి పడింది. ఓ పది రాత పుస్తకాలతో ఆ ఊరిప్పుడు చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ రాత పుస్తకాలు ఏమిటి? అందులో ఏముంది? గిరిజన గోండులు ఐదారు రాష్ట్రాలలో ఉన్నారు. చాలా గిరిజనజాతులకు అత్యంత ప్రాచీన భాష ఉంది. కానీ లిపులు లేవు. అందుకే అవి చాలా వరకు నోటి భాషలే. ఆ నోటి భాష కూడా అంతరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గోండి భాషపై అలనాడు ప్రాకృతం, ఆ తరువాత సంస్కృతం, అరబ్బీ, పారసీకం, ఉర్దూ, హిందీ, మరాఠీ, తెలుగు భాషలు పెత్తనం చెలాయించాయి. గత యాభై ఏళ్లుగా చదువుపేరిట ఇంగ్లిషు కూడా దానిపై స్వారీ చేస్తున్నది.

 

 అయినా అది తట్టుకుని నిలిచింది. చాలా గిరిజన భాషలు మార్పునకు లోనై సాంకర్యంతో కళవెళ పడుతున్నాయి. ఈ సందర్భంలో గుంజాలలో పది రాత ప్రతులు లభించాయి. అదీ గోండీ లిపిలో చేతితో రాసిన ప్రతులు. దీనికే ‘గుంజాల గోండీ లిపి’ అని పేరు. వందేళ్ల క్రితం ఆ ఊరిలో ఈ లిపి ప్రచారంలో ఉండింది. ఈ లిపి సృష్టికర్త ఎవరన్నది నిర్దిష్టంగా చెప్పలేం. ఆ సమాజమే దీన్ని సృష్టించుకున్నది. అయితే మూడు తరాల కింద ఈ లిపిని ఎక్కువగా ప్రచారం చేసింది మాత్రం గుంజాలకి చెందిన పెందూర్ లింగోజి, కుంరా గంగోజి. వీరు ఒక పాఠశాల ఏర్పాటు చేసి దీన్ని నేర్పారు. అలా 60-80 ఏళ్ల కింద నేర్చుకున్న కోట్నక్ జంగు, కుంరా విఠల్, అర్క జైవంత్, కంరా లాల్‌షావు, అర్క కమలాబాయి ఇప్పటికీ ఉన్నారు.

 

 వారు చదవగలరు, రాయగలరు. కమలాబాయి వయస్సు ఇప్పుడు తొంభై ఏళ్లు పైనే ఉంటుంది. దృష్టి మందగించినా ఆ రాతను చూసినప్పుడు ఆమె కళ్లల్లో మెరుపులు. ‘మా భాష మాకు కావాలి. అది మాకు గర్వకారణం’ అంటుందామె. పదేళ్ల వయసులో ‘బిడ్డా! ఇది మన లిపి. దీన్ని చదువు. కాపాడు’ అని ఆమె తండ్రి చెప్పాడట. అందుకే ఆమె ఈ లిపిని కొడుక్కి, మనవరాలికి కూడా నేర్పింది. గిరిజనులకు విద్య దూరం అనుకునే శిష్ట సమాజం నివ్వెరపోయే విషయం ఇది.

 

 ఈ రాత ప్రతులను మొదట చూసినప్పుడు మరాఠీనో, దేవనాగరి లిపో అనుకున్నాం. కానీ, అది ఒక విలక్షణమైన లిపిగానే కనిపించింది. అందుకే ఆ లిపిని గోండు పిల్లలకు నేర్పించాలని భావించాం. ఏడాదికింద అఖిల భారత గోండ్వానా గోండి సాహిత్య పరిషత్ జిల్లా మహాసభ జరిగింది. ప్రతి ఏడాది జనవరి 27 గుంజాల గోండీ లిపి దినోత్సవం జరపాలని అప్పుడు నిర్ణయించారు. ఈ ఏడాది కూడా ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో తెలుగు తరవాత భాషా దినోత్సవాన్ని జరుపుకున్న ఘనత గోండులదే. గుంజాల లిపే వారికి ఆ ప్రేరణ.

 

 ‘గుంజాల గోండీ లిపి అధ్యయన వేదిక’ తరఫున చాలా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఐటీడీఏ ఉట్నూరు, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఫర్ దళిత్, ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్‌లేషన్’ (సిడాస్ట్) సహకారంతో మొదటిసారిగా గోండీ లిపిలో మొదటి వాచకం అచ్చేస్తున్నారు. గుంజాల గ్రామంలో లిపి అధ్యయనం కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాజెక్టు ఆఫీసర్ జే. నివాస్  సుముఖత వ్యక్తం చేశారు. ఈ లోగా సిడాస్ట్ గుంజాలకి ఒక పరిశోధక బృందాన్ని పంపింది. జయధీర్, ఆచార్య వి.కృష్ణ ఆధ్వర్యంలో గోండీ లిపిలోని రాత ప్రతులను హిందీ, తెలుగు భాషలలోకి అనువాదం చేసే పని అక్కడ జరుగుతోంది. ఈ లిఖిత సమాచారంలో గోండీ ప్రజల ఆచారాలు, చరిత్ర వెల్లడవుతున్నాయి. ఈ లిపిపై గోండీ పిల్లలు ఆసక్తిగా ఉన్నారు. ఆరో తరగతి చదివే విఠల్ రెండో తరగతి చదివే పిల్లలకు, ఈ లిపిలో అక్షరమాలను, గుణింతాలను నేర్పుతున్నాడు. లాల్‌షావు (75) కోట్నక్ జంగు (72) తమ ఆత్మకథలను గుంజాల గోండి లిపిలో రాస్తున్నారు. వాటిని శ్రీధర్ శ్రీకంఠం తయారుచేసిన సాఫ్ట్‌వేర్ సాయంతో ఆ లిపిలోనే డీటీపీ చేసి పుస్తకం ముద్రించేందుకు రంగం సిద్ధమైంది.

 

 అంటే గోండీ లిపిలో, గోండీ భాషలో అవి మొదటి ఆత్మకథలు అవుతాయి. ఎం.ఏ (తెలుగు) చదివిన కోట్నక్ వినాయక్ తెలుగు నుంచి గుంజాల లిపిలోకి అనువాదం చేయగలడు. అతని సహాయంతో గుంజాల గ్రామంలో లిపి అధ్యయన కేంద్రం కూడా ప్రారంభం కాబోతున్నది. అక్కడ ఒక గోండీ భాషా పాఠశాలకు అంకురార్పణ జరుగుతున్నది. అనువాదం పనిలో ఉండగా గోండీ-తెలుగు భాషలకున్న అనుబంధాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలిగింది. వందలాది గోండీ పదాలు తెలుగులో ఉన్నాయి. తెలుగు భాషా మూలాలే కాదు, సాంస్కృతిక, చారిత్రక లోతులు కూడా తెలుస్తాయని నమ్మకం. బౌద్ధుల నలందలాగా గోండీ లిపి భాషా విషయాలకు గుంజాల కూడా విశ్వవిద్యాలయంగా ఎదగాలని కోరుకుందాం.

 - జయధీర్ తిరుమలరావు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top