‘తెలంగాణ తెలుగు’ ఉన్నట్టా? లేనట్టా?

‘తెలంగాణ తెలుగు’ ఉన్నట్టా? లేనట్టా?


సందర్భం

ముఖ్యమంత్రి ఆలోచన మేరకు తెలంగాణ తెలుగు భాష అని ప్రజలు అనవద్దు. సరే. ఐతే, తెలంగాణ భాష అనేది ప్రభుత్వం ఉనికిలో ఉందా లేదా అనే విషయాన్ని విస్పష్టంగా ప్రజలకు వివరించవలసి ఉంది. దానినే రేపు తెలంగాణ సమాజం అంతా అంగీకరించవలసి ఉంటుంది.



సెప్టెంబర్‌ 9వ తేదీ కాళోజి జయంతి. ఆ రోజున తెలంగాణ భాషా దినోత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంతోషించాల్సిందే. ఏటా జయంతులు, వర్ధంతులు తామున్నామని గుర్తు చేస్తుంటాయి. ప్రభుత్వంలో, సమాజంలో ఎలాంటి కదలికలు లేకపోవడం వల్ల అవి యాంత్రికమవుతాయి. అంతేకాదు. ఆయా వ్యక్తుల స్ఫూర్తికి విరుద్ధ దిశలో జరుగుతూ ఉంటాయి. ఇది మరీ విషాదం. ఆయా సుప్రసిద్ధులకు అపచారం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా సరికాదు.


గిడుగు రామ్మూర్తి జన్మదినాన్ని తెలుగు భాషాదినోత్సవంగా జరపాలని ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కాళోజి జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా జరపాలని తెరాస ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రెండు కొత్త రాష్ట్రాలలో ఇప్పుడు రెండు తెలుగు భాషలకు విలువ లేకుండాపోయింది. విద్య, న్యాయ, పరిపాలనా రంగాలలో తల్లి నుడికి అవమానం జరుగుతున్నది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడ్డానికి ఆంధ్ర భాషే కారణం. రాష్ట్రాలు విడిపోవడానికి కూడా తెలుగు భాషే ఒక ప్రధాన కారణం. ఐనా అంతటి, ప్రాధాన్యతా అంశం అయిన భాషలకి దశాబ్దాలుగా అవమానం జరుగుతున్నది.



మొదటి ప్రపంచ మహా సభలు జరిపిన ఆనాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దగ్గర నుంచి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వరకు, మధ్యలో తెలుగుదేశం పాలనలో ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో సైతం అందరిదీ ఒకే తీరు, ఒకే విధానం. వ్యవహార భాషగా, బోధన భాషగా, పాలన భాషగా, కోర్టు భాషగా ఉండాల్సిన తెలుగు భాష ఎక్కడా కానరాదు. ఆయా రంగాలలో తెలుగు ఉంటే ప్రజలకు చాలా ఉపయోగం. కాని ప్రభుత్వాలు ప్రజల దృక్కోణంలోంచి ఆలోచించడం లేదు. అంటే ప్రజలు సృష్టించుకున్న భాషపై ఒకనాడు అగ్రకులాల పెత్తనం, ఇప్పుడు అదే తరహాలో ప్రభుత్వాల పెత్తనం కొనసాగుతున్నది. ప్రజల తల్లి భాషను అసలే పట్టించుకోవద్దు. వ్యవహారంలో, సాహిత్యంలో పండిత భాషకు పట్టం కట్టాలి. సామ్రాజ్యవాదుల, జాతీయ ప్రభుత్వాల భాషా పాలసీలకు అనుగుణంగా తల వంచి జో హుకుం అనాలి.



భాషని ప్రజాస్వామీకరించడానికి గిడుగు, కాళోజీలు ఎంతో కృషి చేశారు. నిజాయితీగా పోరాడారు. ఎవరికీ తలవంచలేదు. భాషా ఛాందసాన్ని తగ్గించి, ప్రజల భాషా విధానాన్ని పెంచారు. దానివల్ల అక్షరాస్యత శాతం పెరిగింది. భారత దేశంలో ప్రస్తుతం అక్షరాస్యతలో తెలంగాణ అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కన్నా అధమ స్థాయిలో అంటే 32వ స్థానంలో ఉంది. ఇప్పుడున్న భాషా విధానాన్ని చూస్తే వయోజన విద్యని కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారేమో అని భయంగా ఉంది. ఏ భాషకూ కొరగాని సంకర, దద్దమ్మ విద్యార్థుల తరాన్ని తయారు చేయడం వల్ల కొత్త రాష్ట్రంలో విద్యాస్థాయి తగ్గిపోతుంది. ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వాలు తల్లిభాషా దినోత్సవాలు జరపడానికి అర్హులా? ఏమైనా అంటే, ఆ సందర్భంగా సాహిత్య తదితరమైన నాలుగు అవార్డులు ఇచ్చి భాషా దినోత్సవాన్ని నిర్వహించామని చెప్పుకోవడం ఏపాటి సబబు. కాళోజి పురస్కారం పేరుతో కాళోజి స్ఫూర్తికి విరుద్ధమైన, వ్యతిరేక విలువలు కలిగిన వారికి పురస్కారాలు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.



తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు డాక్టర్‌ నందిని సిధారెడ్డి ‘దక్కన్‌ ల్యాండ్‌’ మాసపత్రిక (జూలై, 2017)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘ఈ ప్రపంచ మహాసభలను తెలంగాణ పేరిట నిర్వహిద్దామని కొందరు అన్నా, సీఎం మాత్రం ప్రపంచ తెలుగు మహాసభలుగానే సూచించారు’’ అని చెప్పారు. కాళోజి పేరుతో ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం జరుపుతుంది. కాని ప్రపంచ మహాసభలను మాత్రం తెలుగు మహాసభల పేరనే జరుపుతారట! ఎంత విచిత్రం! ఎంత వైరుధ్యం. ఇది భాషా హిపోక్రసి. తెలంగాణా సాధనలో ‘తెలంగాణ భాష’ కూడా ఒక బలమైన హేతువు. శ్రీకృష్ణ కమిషన్‌కి ఇచ్చిన వందలాది నివేదికలలో తెలం గాణ భాష గురించినవి అనేకం ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రపంచ మహాసభలు ఏ భాష గురించి మాట్లాడతాయి? అసలు ప్రభుత్వం లెక్కల్లో తెలంగాణ భాష ఉన్నట్లా? లేనట్లా? తేలవలసి ఉంది. అధినాయకులకు భాష పట్ల వివక్ష గురించి తీరిగ్గా ఆలోచించడం కష్టం. ముఖ్యమంత్రిగారికి ఎన్నో భాషా కోణాల గురించి తెలియచెప్పవలసిన బాధ్యత భాషా సంస్కృతుల శాఖల, సంస్థల పెద్దలపై ఉంటుంది.



ఇవాళ కేవలం తెలుగు భాషపై సభలు జరిపితే రేపు తెలంగాణ భాష అని అనడం సాధ్యం కాదు. తెలుగు విశ్వవిద్యాలయంవారు తెలంగాణ నిఘంటువుని తయారు చేస్తున్నామనే పదే పదే గుప్పించే ప్రకటనలకు అర్థం ఏమిటి? తెలంగాణ భాష ఉన్నదనేగా! ప్రపంచ తెలుగు సభల నిర్వహణ వైఫల్యం దాని పేరులో, ఆలోచనల్లోనే దాగి ఉన్నట్లుగా అనిపిస్తున్నది. బంగారు తెలంగాణలో తెలంగాణ వైఢూర్యాల భాష భాగంగా లేకపోతే ఎలా? తెలంగాణ వారి పండుగలు చాలావరకు వేరే. బతుకమ్మ, బోనాల వంటివి తెలంగాణ రాష్ట్ర పండుగలు ప్రకటించుకున్నాం. మన సంస్కృతి వేరే అని స్పష్టంగా చెప్పుకున్నప్పుడు లేని బాధ, భాష వరకు తేడా ఎందుకు? ఇంగ్లిష్‌ అంతటా ఒకటే. కాని బ్రిటిష్‌ ఇంగ్లిష్, అమెరికన్‌ ఇంగ్లిష్‌ అని వేరు వేరుగా పిలుచుకుంటారు.



ముఖ్యమంత్రి ఆలోచన మేరకు తెలంగాణ తెలుగు భాష అని ప్రజలు అనవద్దు. సరే. ఐతే, తెలంగాణ భాష అనేది ప్రభుత్వం ఉనికిలో ఉందా లేదా అనే విషయాన్ని విస్పష్టంగా ప్రజలకు వివరించవలసి ఉంది. దానినే రేపు తెలంగాణ సమాజం అంతా అంగీకరించవలసి ఉంటుంది. కాని భాషకీ, హృదయానికీ సెంటిమెంట్‌ ఎక్కువ. తల్లిని తిడితే బాధపడినట్లే, తల్లి భాషని అవమానపరిస్తే జనం భగ్గుమంటారు. ఆ సెంటిమెంటుని, సున్నితమైన అంశాన్ని తట్టిలేపడం ఇప్పుడు అవసరమా! అకాడమి అధ్యక్షులు అన్నట్లు ఇది కేవలం కె. చంద్రశేఖరరావు అభిప్రాయమా? పాలసీ పరంగా సీఎం గారి ఆలోచనా? తెలియవలసి ఉంది. ఏది ఏమైనా వారి ఆలోచనే అని, ఆయనని ఒక్కరినే బాధ్యునిగా చేయడం సరికాదు.


కాళోజి బతికి ఉంటే తెలంగాణ భాష కోసం గేయాలు రాసేవారు. తన అభిప్రాయాల్ని కరాఖండిగా చెప్పేవారు. ప్రభుత్వానికి నచ్చచెప్పేవారు. కాళోజి మన మధ్య లేరు. వందలాది ‘నా గొడవ’ కవితల్లో భాష గురించి అనేక భావాలను మరోసారి అవగాహన చేసుకోవాలి. ఆయన పేర జరిపే తెలంగాణ భాషా దినోత్సవాన్ని గౌరవిస్తూ ప్రపంచ మహాసభలని తెలంగాణ భాషా సాహిత్య, సంస్కృతుల వేడుకలుగా జరిపిం చడం ఔచిత్యం. అది కాళోజికి ఇచ్చే గౌరవం.

(కాళోజి జయంతి(సెప్టెంబర్‌ 9)ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతున్న సందర్భంగా)





జయధీర్‌ తిరుమలరావు

వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక

మొబైల్‌ : 99519 42242


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top