
నితీశ్ మంత్రివర్గ విస్తరణ.. బీజేపీకి కీలక స్థానం
సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ తిరిగి 24గంటల్లోనే ముఖ్యమంత్రిగా ఈనెల 27న తిరిగి ప్రమాణ స్వీకారం చేశారు.
► మెత్తం 34 మందితో మంత్రివర్గం ఏర్పాటు
► 13మంది బీజేపీ సభ్యులకు అవకాశం
పట్నా: నితీశ్ కుమార్ మంత్రి వర్గ విస్తరణ నేడు జరగనుంది. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ తిరిగి 24గంటల్లోనే ముఖ్యమంత్రిగా ఈనెల 27న తిరిగి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి సహాయ పడిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీని కాదని బీజేపీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కీలక ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి కేటాయించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీని ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
ఈనేపథ్యంలో నితీశ్‌కుమార్ నేడు మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. మొత్తం 34మందితో ఈ విస్తరణ జరగనుంది. ఇందులో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన మిత్రపక్షం బీజేపీకి కీలక స్థానం లభించనుంది. ఈమేరకు బిహార్ బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద రాయ్ మీడియాతో మాట్లాడుతూ విస్తరణలో 13మంది బీజేపీ సభ్యులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. జేడీయూ చెందిన 14మందికి అవకాశం దక్కనుంది. ఇందులో బిజ్రేంద్ర ప్రసాద్ యాదవ్, రజన్ సింగ్ , లేసీ సింగ్, శ్రవణ్ కుమార్, జైకుమార్, ఖుర్షీద్‌లకు కీలక పదవులు లభించనున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర గవర్నర్ త్రిపాఠీ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. బిహార్ మంత్రి వర్గంలో గరిష్టంగా 35మంది మంత్రులకు అవకాశం ఉంది.