ఈ భవనం... నీడ కూడా పడదు! | Sakshi
Sakshi News home page

ఈ భవనం... నీడ కూడా పడదు!

Published Fri, Mar 3 2017 4:02 AM

ఈ భవనం... నీడ కూడా పడదు! - Sakshi

ఒడిశాలోని జగన్నాథ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. సంవత్సరం పొడవునా... ఈ మహా దేవాలయ ప్రధాన గోపురం తాలూకూ నీడ ఎక్కడా కనిపించదట! వందల ఏళ్ల క్రితమే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కట్టడం వల్ల ఇది సాధ్యమైందని మనకు తెలుసు. ఇప్పుడు పక్క ఫొటోలు చూడండి. ఇది న్యూయార్క్‌ మహా నగరంలో త్వరలో నిర్మించబోయే భవనం. పేరు... సోలార్‌ కార్వ్‌ టవర్‌. ఇది కూడా జగన్నాథ ఆలయం మాదిరిగా ఎలాంటి నీడ సృష్టించదు! నగరాల్లో భవనాలు పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్కల ఉన్న వారికి గాలి వెలుతురు తగ్గిపోతాయన్నది మనకు అనుభవమైన విషయమే.

ఈ విషయమై న్యూయార్క్‌ నగరంలో ఇప్పటికే చాలా ఆందోళనలు జరిగాయి. దీంతో అక్కడి అధికారులు పెద్ద పెద్ద భవనాల నిర్మాణానికి అనుమతులివ్వడం లేదు. ఈ నేపథ్యంలో ‘స్టుడియో గ్యాంగ్‌’ అనే సంస్థ ఈ నీడ ఏర్పరచని భవన నిర్మాణానికి ముందుకొచ్చింది. అయినాసరే... దాదాపు మూడుసార్లు న్యూయార్క్‌ అధికారులు దీన్ని తిరస్కరించారు. చివరకు నాలుగో ప్రయత్నంలో నిర్మాణానికి ఓకే చెప్పారు.  దాదాపు 213 అడుగుల ఎత్తున కట్టే ఈ భవనం పూర్తిగా పారదర్శకమైన అద్దాలతో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఫొటోలు చూస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. మొత్తం 1.66 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉండే సోలార్‌ కార్వ్‌ టవర్‌ మాన్‌హటన్‌లోని మీట్‌ ప్యాకింగ్‌ డిస్ట్రిక్ట్‌ వద్ద ఏర్పాటు కానుంది.


భవనం ప్రత్యేకమైన డిజైన్‌ కారణంగా పక్కనే ఉన్న భవనాల్లోని వారికి వెలుతురుతోపాటు పరిసరాల తాలూకూ ‘వ్యూ’ అలాగే ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల వారికి గాలి కూడా మామూలు స్థాయిలో వీచేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు... ఈ భవనం రూఫ్‌టాప్‌పై ఓ భారీ గార్డెన్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా... భవన నిర్మాణంలో రీసైకిల్డ్‌ మెటీరియల్‌ను ఎక్కువగా వాడటం, నీటిని సమర్థంగా వాడుకోవడం, వాననీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం వంటి అదనపు ఫీచర్లు ఏర్పాటు చేసి అత్యంత పర్యావరణ అనుకూల భవనానికి ఇచ్చే లీడ్‌ గోల్డ్‌ సర్టిఫికెట్‌ను అందుకోవాలని చూస్తోంది స్టుడియో గ్యాంగ్‌! ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా?
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Advertisement
Advertisement