33 శాతం పని మనుషులపై లైంగిక దాడులు | Sexual harassment on maid servants | Sakshi
Sakshi News home page

33 శాతం పని మనుషులపై లైంగిక దాడులు

Oct 17 2018 4:38 PM | Updated on Oct 17 2018 4:44 PM

Sexual harassment on maid servants - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చలనచిత్ర పరిశ్రమ, జర్నలిజం, సాహిత్యం, సంగీతం, వాణిజ్యం, వాణిజ్య ప్రకటనలు, రాజకీయ రంగాల్లో విస్తరిస్తున్న ‘మీటూ’ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం వల్ల పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురయ్యో మహిళలు ముందుకొచ్చి పెట్టే కేసుల సంఖ్య పెరుగుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటికే ఈ కేసులు భారీగా పెరిగాయి. 2014లో ఇలాంటి కేసులు 371 నమోదుకాగా, 2017లో 570 కేసులు నమోదయ్యాయని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నివేదిక తెలియజేస్తోంది. అంటే ఈ మూడేళ్ల కాలంలోనే ఇలాంటి కేసుల సంఖ్య 54 శాతం పెరిగింది. ఇక 2018, మొదటి ఏడు నెలల కాలంలోనే 533 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ పోలీసుల వద్ద నమోదైనవి. కంపెనీల వద్ద నమోదైన కేసులు ఇంతకన్నా ఎక్కువే ఉంటాయి. 

అయితే ‘మీటూ’ ఉద్యమం కారణంగా కంపెనీల వద్ద లైంగిక వేధింపుల కేసులు పెద్దగా పెరగలేదని 44 కంపెనీలకు సంబంధించి ‘నిఫ్టీ’ సమర్పించిన నివేదిక తెలయజేస్తోంది. 2017 సంవత్సరంలో 614 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 620 కేసులు నమోదయ్యాయని నివేదిక వెల్లడిస్తోంది. లైంగిక వేధింపుల కేసులు తక్కువుంటే కంపెనీ వర్గాలను ప్రశంసించాలో, కేసులు ఎక్కువైతే మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చారన్న కారణంగా ప్రశంసించాలో తెలియని మీమాంసలో కంపెనీలు పడిపోయానని, లైంగిక వేధింపులకు సంబంధించి న్యాయ సహాయం అందించే ‘కంప్లైకరో’ వ్యవస్థాపకులు విషాల్‌ కెడా తెలిపారు.

లైంగిక వేధింపుల ఫిర్యాదులను కంపెనీలు ఏర్పాటు చేసిన కమిటీలు ఎలా విచారిస్తున్నాయన్న అంశంపై ఢిల్లీ, నోయిడా, కోల్‌కతా, గురుగావ్‌ లాంటి నగరాల్లో సర్వే నిర్వహించగా 6,047 మంది పాల్గొన్నారు. వారిలో 67 శాతం ప్రతికూలంగా సమాధానం ఇచ్చారు. పనిచేసే చోట లైంగిక వేధింపులను నిరోధించేందుకు 2013లో కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం పది మందికి మించిన ఉద్యోగులుండే ప్రతి కంపెనీలో, సంస్థలో విధిగా ఓ ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి. కమిటీలుండే కంపెనీల సంగతి పక్కన పెడితే, అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళలపై లైంగిక కేసులు ఎలా ఉంటున్నాయి? ముఖ్యంగా ఇంటి పనులు చేసే పని మనుషుల పరిస్థితి ఎలా ఉంది? ఢిల్లీ, ఢిల్లీ కాపిటల్‌ రీజియన్‌లో ‘మరాఠా ఫారెల్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ గత జూన్‌ నెలలో సర్వే నిర్వహించగా, 33 శాతం మంది పని మనుషులు లైంగిక వేధింపులకు గురైనట్లు తేలింది.


 
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల్లో 29 శాతం కూలీలు, 23 శాతం పని మనుషులు, 16 శాతం చిన్న తరహా పరిశ్రమల కార్మికులు లైంగిక వేధింపులకు గురయ్యారని దారిద్య్ర నిర్మూలన కోసం కృషి చేస్తున్న ‘ఆక్స్‌ఫామ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ 2012లో నిర్వహించిన సర్వే తెలియజేస్తోంది. ఇక వస్త్ర పరిశ్రమకు సంబంధించి 14 శాతం మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయినట్లు గార్మెంట్‌ కార్మిక సంస్థ, స్వచ్ఛంద సంస్థ మున్నాడే 2015లో, ఒక్క బెంగళూరు నగరంలో నిర్వహించిన సర్వే వెల్లడిస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణలను విచారించేందుకు ఎలాంటి కమిటీలు లేవని 75 శాతం మంది మహిళా వస్త్ర కార్మికులు తెలిపారు. 

కుటుంబాల్లో లైంగిక వేధింపులు
ఇక ఇళ్లలో పదేళ్ల నుంచి 14 ఏళ్లలోపు ఆడపిల్లలపై పది శాతం అత్యాచారాలు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి పిల్లల ఫండ్‌ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. వీటిలో 99 శాతం కేసులు నమోదు కావని తేల్చింది. కుటుంబ సభ్యులే ఈ అత్యాచారాలకు పాల్పడుతుండడం వల్ల కేసులు నమోదు కావడం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement