
‘కృష్ణా జలాల’పై మళ్లీ విచారణ వద్దు
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-89 ప్రకారం కృష్ణా జలాలను ఆ నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకూ తిరిగి కేటాయించాలా?
* ‘ఉమ్మడి నీటిని’ ఏపీ, తెలంగాణల మధ్య పంచితే సరిపోతుంది
* హైకోర్టు భవనాలు.. సచివాలయ భవనాలు పంచినట్టే నీటినీ పంచాలి
* కర్ణాటక, మహారాష్ట్రల కేటాయింపులను కదపరాదు
* కృష్ణా ట్రిబ్యునల్ ముందు కర్ణాటక సుదీర్ఘ వాదన
* నేడు, రేపు కొనసాగనున్న వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-89 ప్రకారం కృష్ణా జలాలను ఆ నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకూ తిరిగి కేటాయించాలా? ఉమ్మడి ఏపీకి చేసిన కేటాయింపులను కొత్తగా ఏర్పడిన ఏపీ, తెలంగాణల మధ్య పంపిణీ చేయాలా?.. తాజా విధివిధానాలు ఎలా ఉండాలనే అంశంపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ బుధవారం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీ పంపకాల ప్రక్రియ విధివిధానాలు, పరిధి నిర్ధారణపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్ర జల వనరుల శాఖలు తమ అభిప్రాయాలను తెలియపరుస్తూ అఫిడవిట్లు, కౌంటర్లు దాఖలు చేశాయి. తొలుత బుధవారం కర్ణాటక తన వాదనలు వినిపించింది.
గురు, శుక్రవారాల్లో మిగతా రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత ట్రిబ్యునల్ తన పరిధిని, విధివిధానాలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం 9 ముసాయిదా విధివిధానాలపై రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉంది. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 ప్రకారం కేటాయింపులు కేవలం కొత్త రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల మధ్యే ఉండాలని కర్ణాటక వాదించింది. కర్ణాటక, మహారాష్ట్రలకు ఈ వివాదంతో సంబంధం లేదని పేర్కొంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బుధవారం కర్ణాటక తరఫున న్యాయవాది అనిల్ దివాన్ వాదనలు వినిపించారు. కాగా, ఏపీ తరపున సీనియర్ న్యాయవాది ఎ.కె. గంగూలీ, న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాసరావు, గుంటూరు ప్రభాకర్, తెలంగాణ రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, విద్యాసాగర్, రవీందర్‌రావు హాజరయ్యారు.
కర్ణాటక వాదన సాగిందిలా..
కృష్ణా జలాల కేటాయింపు వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2, 2004న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను నియమించింది. జలాల వివాద పరిష్కారాల చట్టం-1956 సెక్షన్ 5(2) ప్రకారం 2010 డిసెంబర్ 13న ఈ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించింది. రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో 2013 నవంబరు 29న వివాద పరిష్కారాల చట్టం-1956లోని సెక్షన్ 5(3) ప్రకారం తదుపరి అవార్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఈ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు జరిపింది. నవంబరు 29, 2013న తుది అవార్డు ప్రకటించాక, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిధి ముగిసింది.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 ద్వారా కొత్తగా తెలంగాణ ఏర్పడినందున పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 ప్రకారం కృష్ణా జలాల కేటాయింపు జరపాల్సి ఉంది. అందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మే,15, 2014న నోటిఫికేషన్ జారీచేయడంతో ట్రిబ్యునల్ తిరిగి పనిచేస్తోంది. తుది కేటాయింపు నోటిఫై చేయకుండా, మళ్లీ విచారణ చేపట్టడం వల్ల ప్రయోజనం ఉండదు.
సెక్షన్-89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఏపీ, తెలంగాణలకే పరిమితమై.. వాటి పరిధిలోని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలి. తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు సంబంధించిన ఆపరేషన్ ప్రొటోకాల్ ఈ 2 కొత్త రాష్ట్రాలకే పరిమితం కావాలి. ఈ కొత్త రాష్ట్రాల మధ్య జలాల నిర్వహణ, నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 85(ఏ), 85(ఈ) ప్రకారం ఏర్పాటైన కృష్ణా యాజమాన్య బోర్డు పనిచేస్తుంది. వివాదం ఉంటే దానిని సంప్రదించవచ్చు.
జూరాల వంటి ప్రాజెక్టులకు ఇదివరకే కేటాయింపుల నిర్ధారణ పూర్తయింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, తెలుగు గంగ ప్రాజెక్టులకు ఏపీ, తెలంగాణల మధ్య నీటి కేటాయింపులు జరిపితే సరిపోదా? మిగిలిన కర్ణాటక, మహారాష్ట్రలకు వీటితో సంబంధం ఏమిటి? చట్టం ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి.. వ్యాకరణాన్ని పట్టించుకుంటే ఎలా?. ఆస్తులు, అప్పులు పంచుకోవాలి గానీ.. ఆ ఆస్తులు, అప్పులు ఎలా వచ్చాయని తర్కించుకుంటూ పోతే ఎలా? ఉదాహరణకు.. రూ. 500 కోట్ల రుణం తెచ్చుకున్నారనుకుంటే.. ఆ రూ.500 కోట్లను ఇద్దరు ఎలా పంచుకోవాలన్న దానిపై చర్చ జరగాలి. అంతేగానీ రూ.500 కోట్ల అప్పు ఎందుకు చేశారని అడిగితే ఎలా?.
అలాగే.. కేటాయింపులు జరిగిన తర్వాత ఉమ్మడి ఏపీకి వచ్చిన కేటాయింపుల నుంచి విభజనానంతర ఏపీ, తెలంగాణలు పంచుకోవాలి. అంతేగానీ వివాదాన్ని అన్ని రాష్ట్రాలపైనా రుద్దకూడదు. హైకోర్టు భవనాలు, సచివాలయ భవనాలు పంచుకున్నట్టే నీటి కేటాయింపులను కూడా పంచుకోవాలి.