కారుపై ఎర్రబుగ్గ వాడతా.. నా ఇష్టం! | I Have right to use red beacon, says Imam of Tipu Sultan Masjid | Sakshi
Sakshi News home page

కారుపై ఎర్రబుగ్గ వాడతా.. నా ఇష్టం!

May 12 2017 7:36 AM | Updated on Sep 5 2017 10:56 AM

కారుపై ఎర్రబుగ్గ వాడతా.. నా ఇష్టం!

కారుపై ఎర్రబుగ్గ వాడతా.. నా ఇష్టం!

కార్లకు ఎర్రలైట్లు వాడరాదని కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని తానేందుకు పాటించాలంటూ ఇక్కడి టిప్పు సుల్తాన్ మసీదు షామి ఇమామ్ అన్నారు.

కోల్‌ కతా: కార్లపై ఎర్రలైట్లు వాడరాదని కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని తానేందుకు పాటించాలంటూ ఇక్కడి టిప్పు సుల్తాన్ మసీదు షామి ఇమామ్ మౌలానా నూర్‌ ఉర్‌ రెహమాన్ బార్కాతి ప్రశ్నించారు. ఎర్రబుగ్గ వాడకం తన హక్కు అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సంస్థలు, ప్రజా ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు వర్తిసాయి తప్ప తనలాంటి మత సంబంధ వ్యక్తులకు కాదని పేర్కొన్నారు.

‘ఓ మతగురువుగా ఎర్రబుగ్గ వాడతాను. అది నా హక్కు. ఎన్నో దశాబ్దాల నుంచి నా కారుకు ఎర్రబుగ్గ ఉంది. కేంద్రం ఉత్తర్వులు నేను పాటించను. నన్ను ఆదేశించడానికి వారికి ఏ హక్కు ఉంది. మా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మాత్రమే పాటిస్తాను. ఇంకా చెప్పాలంటే బెంగాల్‌ లో ఏ ఒక్కరూ ఎర్రబుగ్గను తొలగించలేదు. అలాంటప్పుడు నేనేందుకు కేంద్రం నిర్ణయాన్ని సమ్మతించాలని’  ఇమామ్ మౌలానా నూర్‌ ఉర్‌ రెహమాన్ బార్కాతి ప్రశ్నించారు.

కేంద్రం నిర‍్ణయాన్ని ఆయన ఎలా వ్యతిరేకిస్తారని, కచ్చితంగా మమత బెనర్జీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బీజేపీ సెక్రటరీ లాకెట్‌ ఛటర్జీ అన్నారు. ఏ వర్గానికి ఎర్రబుగ్గ వాడేందుకు అనుమతి లేదన్నారు. ఎర్రబుగ్గ వాడకంపై బర్కాతి చేసిన వ్యాఖ్యలపై కోల్‌ కతా పోలీసులు మాట్లాడేందుకు నిరాకరించారు. అత్యవసర సేవలందించే అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, పోలీసు విభాగాలు తప్ప మరెవరూ కార్లకు బుగ్గలైట్లు వినియోగించరాదని కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మే ఒకటోతేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చరిత్రాత్మక నిర్ణయం ప్రకారం దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులతో సహా ఏ ఒక్కరూ తమ కార్లకు ఎర్రబుగ్గలైట్లు వాడటానికి వీల్లేదు.

Advertisement
Advertisement