మిడతలపై ఎదురుదాడికి ‘ఎల్‌డబ్లూఓ’

How Colonial India Fought Locust Attacks - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ఓ పక్క భారత్‌ సర్వశక్తులా పోరాడుతుండగానే అనూహ్యంగా దేశంపై మరో ఉపద్రవం మిడతల దండు రూపంలో వచ్చి పడింది. దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించిన మిడతల దాడిని అడ్డుకోక పోయినట్లయితే పచ్చని పంటలను కోల్పోవాల్సిన ప్రమాదం ఉంది. అయినా మిడతల దాడిని ఎదుర్కోవడం మనకు కొత్త కాదు. ఇందులో రెండు శతాబ్దాల అనుభవం భారత్‌కు ఉంది. 81 సంవత్సరాల క్రితం, అంటే దేశానికి స్వాతంత్య్రం రాకముందు, బ్రిటీష్‌ పాలనలో మగ్గుతున్నప్పుడే ‘లోకస్ట్‌ వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌’ ఆవిర్భవించింది.

ప్రస్తుత మిడతల దాడిని ఎదుర్కోవడానికి పాత అనుభవాలు ఎక్కువగా పనికొచ్చే అవకాశం ఉంది. భారత్‌పై మిడతల దాడిని బ్రిటీష్‌ పాలకులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకు కారణం వారు వ్యవసాయ పన్నుపై ఎక్కువ ఆధారపడడం, మిడతల దాడిని సకాలంలో అడ్డుకోకపోతే పంటలు దక్కక కరవు కాటకాలు ఏర్పడేవి. పన్నులు చెల్లించే స్థోమత రైతులకు ఉండేది కాదు. 19వ శతాబ్దంలో 1812, 1821, 1843–44, 1863, 1869, 1878, 1889–92, 1896–97 సంవత్సరాల్లో భారత్‌ భూభాగంపై మిడతల దాడులు ఎక్కువగా జరిగాయి.

మిడతల్లో సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన దాని సైకిల్‌ ఏమిటి? ఎప్పుడు అవి పంటలపైకి దాడికి వస్తాయి? వాటి సామాజిక జీవనం ఎట్టిదో తెలుసుకునేందుకు అధ్యయం చేయాల్సిందిగా ఎంటమాలజిస్ట్‌ (క్రిమికీటకాల అధ్యయన శాస్త్రవేత్తలు)లను బ్రిటీష్‌ పాలకులు ప్రోత్సహించారు. మిడతల దండును ఎదుర్కొనేందుకు స్థానికంగా అనుసరిస్తున్న పద్ధతులతోపాటు అంతర్జాతీయంగా అనుసరిస్తున్న పద్ధతులను కూడా పరిగణలోకి తీసుకొని నాటి బ్రిటీష్‌ పాలకులు తగిన చర్యలు తీసుకున్నారు.

1927–29 సంవత్సరంలో భారత్‌లోని కేంద్ర ప్రాంతాలతోపాటు, పశ్చిమ ప్రాంతాలను కూడా మిడతలు ఏకకాలంలో ముట్టడించడంతో వాటిని ఎదుర్కొనేందుకు ఓ కేంద్రీకృత సంస్థ ఉండాలని నాటి పాలకులు భావించారు. 1929లో స్టాండింగ్‌ లోకస్ట్‌ కమిటీని, 1930లో లోకస్ట్‌ బ్యూరోను ఏర్పాటు చేశారు. ఈ రెండింటిని మిలితం చేసి 1939లో ‘లోకస్ట్‌ వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థనే ఇప్పటికీ కొనసాగుతోంది. (భారత్‌పై మిడతల దాడి: పాక్‌ నిర్లక్ష్యపు కుట్ర)

1943లో మిడతలపై తొలి అంతర్జాతీయ సదస్సు
రోజు రోజుకు తీవ్రమవుతున్న మిడతల దాడిని ఎదుర్కోవడం ఎలా ? అన్న అంశంపై ఫ్రాన్స్‌ మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును 1943లో మొరాకన్‌ నగరం రాబత్‌లో ఏర్పాటు చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పలు సహారా ప్రాంత దేశాలు హాజరయ్యాయి. అప్పటికే సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఫ్రాన్స్‌ వలస ప్రభుత్వానికి ఆ సదస్సు ఎంతగానో ఉపయోగపడింది. అప్పట్లో సహారా దేశాల్లో మిడతల దాడులు ఎక్కువగా ఉండేవి. ఆఫ్రికా, ఆరేబియా, ఇరాన్, భారత్‌ సహా ఆసియా దేశాలన్నింటితోపాటు మధ్యప్రాచ్య దేశాలకూ మిడతల దాడులు విస్తరించిన నేపథ్యంలో దీనిపై నేడు అంతర్జాతీయ సదస్సును నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగితేనే సార్థకతతోపాటు సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top