వరద నివారణకు మన సంసిద్ధత ఎంత? | Sakshi
Sakshi News home page

వరద నివారణకు మన సంసిద్ధత ఎంత?

Published Sat, Aug 25 2018 5:18 AM

Floods Challenge Before India - Sakshi

దేశంలో దాదాపు 15 శాతం భూభాగం ప్రతి సంవత్సరమూ  వరద ప్రభావాలకు లోనవుతోంది. సగటున 2000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2 కోట్ల ఎకరాల్లో పంట నష్టం (రూ.1800 కోట్లు)  వాటిల్లుతోంది. ప్రభుత్వాలు వరద నియంత్రణ విధానాల్ని కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా ఈ నష్టాన్ని చాలామటుకు నివారించవచ్చునంటున్నారు నిపుణులు. డ్యాముల నిర్వహణ లోపాల వల్లే కేరళకు భారీ నష్టం వచ్చిందని వారు విశ్లేషిస్తున్నారు. డ్యాములు భద్రత / వరద నిర్వహణ విషయాల్లో ప్రభుత్వాలకు శ్రద్ధ లోపించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే విపత్తుల తాలూకూ నష్టం పెరుగుతోందని గత ఏడాది కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక హెచ్చరించింది. 
  
 కాగ్‌ నివేదిక ప్రకారం – వరదల తాలూకూ సమాచారం అందివ్వగల టెలిమెట్రీ స్టేషన్ల నిర్వహణలో తీవ్ర వైఫల్యం కనిపిస్తోంది. దేశంలో 40.8శాతం టెలీమెట్రీ స్టేషన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో పనిచేయించేందుకు నిర్ణీత వ్యవధిలోగా  ఓ కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలన్న కాగ్‌ సిఫారసును సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) పట్టించుకోవడం లేదు. 

  •  15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (కేరళ, పంజాబ్, రాజస్తాన్, అండమాన్‌ – నికోబార్, చండీఘర్, డామన్‌ డయ్యూ,  గోవా, హిమాచల్‌ ప్రదేశ్, లక్షద్వీప్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం)  సీడబ్ల్యూసీ ఎలాంటి ముందస్తు వరద హెచ్చరిక కేంద్రాలనూ ఏర్పాటు చేయలేదు.
  •    కేంద్రం పదకొండో ప్రణాళిక కాలంలో ‘డ్యామ్‌ సేఫ్టీ స్టడీస్‌ అండ్‌ ప్లానింగ్‌’  పేరిట రు .10 కోట్లతో ఓ పథకాన్ని ప్రారంభించింది. ఆ మొత్తాన్ని సవరించి, రూ. 6 కోట్లకు కుదించింది. అందులో ఖర్చు చేసింది రూ. 4.22 కోట్ల మాత్రమే.  ఈ పథకాన్ని తర్వాత కాలంలో డ్యామ్‌ రీహబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (డ్రిప్‌)లో కలిపేసింది.
  •   పదకొండో ప్రణాళికలో – రూ. 279.74 కోట్ల ఖర్చయ్యే నాలుగు వరద నిర్వహణ కార్యక్రమాలు చేపట్టేందుకు కేరళకు ఆమోదం లభించింది. కానీ, 63.68 కోట్ల నిధులు మాత్రమే విడుదలయ్యాయి. 55.22 కోట్లు 12వ ప్రణాళికలో మంజూరయ్యాయి. మొత్తంగా ఈ కార్యక్రమాలకు గాను  కేరళకు దక్కింది రూ. 118.90 కోట్లు మాత్రమే. 

 వరద నిర్వహణకు నిధులేవీ?

  •  వరద నిర్వహణ సంబంధిత మౌలిక సదుపాయాలకు కేంద్రం కేటాయిస్తున్నది చాలా తక్కువే. ఈ యేడాది బడ్జెట్‌లో ముందస్తు వరద సమాచారం / నిర్వహణకు సంబంధించి ఎలాంటి కేటాయింపులూ జరగలేదని పరిశీలకులు చెబుతున్నారు. (నీటి వనరుల అభివృద్ధికి (వాటర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌) 2016 –17లో రూ. 4710 కోట్లు,  2017 –18లో రూ.7660 కోట్లు,   2018 –19లో రూ.8860 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది)
  •  పెద్ద  డ్యాముల నిర్వహణకు సంబంధించి  –  ప్రతి రాష్ట్రం అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు వలసిన ప్రణాళిక రూపొందించి,  కేంద్రానికి సమర్పించాల్సివుంది. దేశంలో దాదాపు 5000 డ్యాములు ఉండగా, కేవలం ఏడు శాతం డ్యాములకే ఇలాంటి కార్యాచరణ ప్రణాళికలున్నాయి. కేరళలోని 61 డ్యాముల విషయంలో ఇలాంటి ప్రణాళికలేమీ లేవు.
  •   వర్షాకాలానికి ముందు, తర్వాత డ్యాములను తనిఖీ చేయించాల్సి వున్నప్పటికీ ప్రభుత్వాలు సంబంధిత నిబంధనను ఖాతరు చేయడం లేదు. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల్లో మాత్రమే అలాంటి తనిఖీలు జరిగాయి.  తనిఖీలకు కేటాయిస్తున్న మొత్తాలే అతి తక్కువ కాగా, వాటిని కూడా ఉపయోగించకపోవడమో లేదా అనధికారిక ప్రాజెక్టులకు మళ్లించడమో జరుగుతోంది.
     

Advertisement
Advertisement