రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫారాల ఎత్తు పెంపు

రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫారాల ఎత్తు పెంపు


- రైల్వే అధికారుల కసరత్తు

- 9వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ షురూ

- రూ.95.63 కోట్ల అంచనా వ్యయంతో పనులు

సాక్షి, ముంబై: లోకల్ రైల్వే ప్రయాణికుల భద్రతకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నగరంతోపాటు శివారులోని మొత్తం 31 లోకల్ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారాల ఎత్తు పెంచేందుకు నిర్ణయం తీసుకొంది. ఈ నెల 9వ తేదీ నుంచి టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు రైల్వే పరిపాలన విభాగం తెలిపింది. 2015 జనవరి వరకూ ఈ పనులు పూర్తిచే యాలని నిబంధనలు విధించనున్నట్లు తెలిపింది. ఈ పనుల కోసం రూ.95.63 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రకటించింది. ఈ పనులు పూర్తికాగానే రెండో విడతలో మరో 46 ప్లాట్‌పారాల ఎత్తు పెంచేందుకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

 

ప్రమాదాలకు నెలవుగా


నగరం, శివారు ప్రాంతాల్లోని పలు లోకల్ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాంలు ఎత్తు తక్కువగా ఉండి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. దీనికి తోడు ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన రైళ్లు భారీఎత్తులో ఉన్నాయి. ప్రయాణికులు రైలు దిగాలన్నా, ఎక్కాలన్నా తీవ్ర అసౌకర్యానికి గురికావల్సి వస్తోంది. మహిళలు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు అదుపుతప్పి రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఏర్పడిన ఖాళీ స్థలంలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.మరికొందరు గాయాలపాలై వికలాంగులుగా మారారు. ఇలాంటి సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ విషయమై ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయమై బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య పలుమార్లు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు రైల్వే పరిపాలన విభాగం కళ్లు తెరిచింది. చివరకు టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. రైల్వే ఫ్లాట్‌ఫాంల్లో ప్రయాణికుల ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడుతోందని అధికారులు భావిస్తున్నారు.

 

ఎత్తు పెంచే ఫ్లాట్‌ఫాంలు ఇవే..

విక్రోలి, విద్యావిహార్, దాదర్, సైన్, కుర్లా, కాంజూర్‌మార్గ్, శ్యాండ్రస్ట్‌రోడ్, రే రోడ్, మసీద్ బందర్, కాటన్ గ్రీన్, వడాల రోడ్, అంబర్‌నాథ్, బీవ్‌పూరి, డోంబివలి, ఆట్గావ్, ఖర్డీ, కసారా, భైకళ, మాటుంగా, ఉల్లాస్‌నగర్, సాన్‌పాడ, జుయినగర్, బెలాపూర్, నేరుల్, డాక్‌యార్డ్ రోడ్ తదితర స్టేషన్లలో ప్లాట్‌ఫాంలు చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. వీటితోపాటు ఇంకా పలు రైల్వే స్టేషన్లలోని ఫ్లాట్ ఫాంల ఎత్తు పెంచాలని నిర్ణయించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top