కరోనా పరీక్షల్లో ఎందుకింత ఆలస్యం ?

Coronavirus : Why Tests Delay In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ప్రజలు ‘లాక్‌డౌన్‌’ను శిరసావహిస్తూ ఇంటికి పరిమితమైతే సరిపోదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో రోజుకు వేల చొప్పున, లక్షల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కరోనా బాధితులను అతి త్వరగా గుర్తించడం అత్యవసరం. అందుకు వేగంగా రక్త పరీక్షలు నిర్వహించే వైద్య పరికరాలు అంతకన్నా అవసరం. కరోనా స్వల్ప లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఆర్‌టి–పీసీఆర్‌ (రివర్స్‌ ట్రాన్సిక్రిప్టేస్‌ పొలిమెరేస్‌ చెయిన్‌ రియాక్షన్‌ టెస్ట్‌) నిర్వహించే కిట్స్‌ మొదటి విడతగా చైనా నుంచి ఐదు లక్షలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించడం ముదావహం. ( దానిపై చర్చలు అనవసరం: యడియూరప్ప )

ఈ కిట్ల కోసం భారతీయ వైద్య పరిశోధనా మండలి మార్చి 30వ తేదీన చైనాకు ఆర్డర్‌ ఇచ్చింది. అవి ఏప్రిల్‌ 5న భారత్‌కు రావాల్సి ఉంది. యూరప్‌కు ఎగుమతి చేసిన టెస్టింగ్‌ కిట్స్‌లో సమస్యలు ఉత్పన్నమయ్యాయంటూ అక్కడి నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అలాంటి పొరపాట్లు పునరావృతం కారదనే ఉద్దేశంతో చైనా అధికారులు కిట్స్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఎగుమతి చేయడంతో ఆలస్యమైంది. ఈలోగా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చైనా, యూరప్‌ దేశాల నుంచి ఈ కిట్ల కోసం విడి విడిగా ఆర్డర్లు ఇచ్చాయి. ఇంతవరకు ఏ రాష్ట్రానికి కూడా ఈ కిట్లు పూర్తిగా అందిన దాఖలాలు లేవు. 

కాస్తా ముందు చూపు ఉన్నట్లయితే భారత్‌లోనే ఈ కిట్లను ఈపాటికే ఉత్పత్తి చేసుకొని ఉండేవాళ్లం. భారత్‌లో తొమ్మిది కంపెనీలు అసెంబుల్‌ చేసిన టెస్టింగ్‌ కిట్స్‌ పరీక్షించి వాటికి అనుమతి జారీ చేయడానికి పుణేలోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలోజీ (ఎన్‌ఐవీ)’ ప్రభుత్వ ల్యాబ్‌కు ఆలస్యమయింది. ఆర్డర్‌ ఇచ్చినప్పటికీ లైసెన్స్‌లు మంజూరవడానికి మరింత ఆలస్యమైంది. అందుకు సంక్లిష్టమైన క్రమబద్ధీకరణ నిబంధనలతోపాటు ఇతర కారణాలు ఉన్నాయి. ( సర్‌ప్రైజ్‌ సూపర్‌!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే.. )

రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ కోసం కేంద్ర ప్రభుత్వ కంపెనీ అయిన ‘హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌’ సంస్థకు ఎన్‌ఐవీ ఏప్రిల్‌ 4న ఉత్తర్వులు జారీ చేసింది. 14 రోజులు కావస్తున్నా నేటికి కంపెనీ టెస్టింగ్‌ కిట్ల ఉత్పత్తిని ప్రారంభించలేక పోయిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని హెచ్‌ఎల్‌ఎల్‌ కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. వీటి ఉత్పత్తి కోసం  ‘డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’ నుంచి హెచ్‌ఎల్‌ఎల్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంది. భారత్‌లో డ్రగ్స్, డయోగ్నస్టిక్స్‌ తయారీకి, ఎగుమతి, దిగుమతుల వ్యవహారాలను పూర్తిగా డ్రగ్‌ కంట్రోలర్‌ కార్యాలయమే చూసుకుంటుంది. 

తమకు ఉత్తర్వులు అందిన మరుసటి రోజే లైసెన్స్‌ కోసం డ్రగ్‌ కంట్రోలర్‌కు దరఖాస్తు చేసుకున్నామని ఏప్రిల్‌ 13వ తేదీన లైసెన్స్‌ మంజూరయిందని హెచ్‌ఎల్‌ఎల్‌ అధికారులు చెబుతున్నారు. టెస్టింగ్‌ కిట్ల ఉత్పత్తికి ఎన్‌ఐవీ నుంచి ఆర్డర్లు పొందిన ప్రైవేటు కంపెనీలకు లైసెన్స్‌ మంజూరు చేయడంలో కూడా తీవ్ర ఆలస్యమైంది. ఇదే విషయమై భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ వీజీ సోమనిని మీడియా సంప్రతించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

తొలుత కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలు
టెస్టింగ్‌ కిట్ల కోసం భారత వైద్య పరిశోధనా మండలికన్నా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ముందుగా స్పందించాయి. కర్నాటక మార్చి 29వ తేదీనే లక్ష కిట్ల కోసం ఆర్డర్‌ ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్‌ మొదటి వారంలో వరుసగా రాష్ట్రాలు స్పందించి కిట్ల కోసం ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించాయి. రాజస్థాన్‌ లక్షా పాతిక వేల కిట్ల కోసం, కేరళ రెండు లక్షల కిట్ల కోసం చైనా కంపెనీలకు ఆర్డర్లు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్‌ మేరకు దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో ఒకేసారి ఏకంగా లక్ష టెస్టింగ్‌ కిట్లను తెప్పించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ముందుగా తాను పరీక్షించుకోవడం ద్వారా కరోనా పరీక్షలకు శ్రీకారం చుట్టగా ఇప్పుడు వాటిని జిల్లాల వారిగా పంపించే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. సోమవారం నుంచి అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. 

భారత డ్రగ్‌ కంట్రోలర్ జనరల్‌ కార్యాలయం ఏప్రిల్‌ 16వ తేదీ నాటికి 66 రకాల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల కోసం మొత్తం 49 స్వదీశీ, విదేశీ కంపెనీలకు లైసెన్స్‌లు మంజూరు చేసింది. భారత దేశంలో మొదటి కరోనా కేసు జనవరి 30వ తేదీన బయట పడగా, జనతా కర్ఫ్యూను మార్చి 22వ తేదీన అమలు చేయగా, మార్చి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. కరోనా పరీక్షల కిట్ల కోసం మార్చి 30 వ తేదీన ఆర్డర్‌ ఇచ్చారు. ఎందుకింత ఆలస్యం ? భారత్‌ ఉష్ణ మండల దేశం కనుక ఏమీ కాదనే ధీమా కారణమా? అల్లం, వెల్లుల్లి, పసుపు లాంటి రోగ నిరోధక పదార్థాలను వాడే భారతీయులకు ఏమీ కాదనే అతి విశ్వాసం కారణమా ? కంట్రోలర్‌ జనరల్‌ ఆలస్యంగా స్పందించడానికి సంక్లిష్ట నిబంధనల ప్రక్రియ కారణమా? మరింకేమైన కారణాలు ఉన్నాయా? ఏదేమైనా జరగాల్సిన ఆలస్యం జరిగిందీ, ఇప్పటికైనా వేగంగా ముందుకు వెళ్లాల్సిందే. లేకపోతే ఆలస్యం విషమవుతుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top