తీరం దాటిన తుఫాన్

తీరం దాటిన తుఫాన్

 హైలైట్స్: డైలాగ్స్ 

 డ్రాబ్యాక్స్:కథనం, పాటలు క్యారక్టరైజేషన్స్

 

 1973 సంవత్సరంలో విడుదలైన ‘జంజీర్’ హిందీ చలన చిత్రసీమలో ఓ ట్రెండ్ సెట్టర్. అమితాబ్‌ను ఎదురులేని సూపర్‌స్టార్‌గా, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తెరపై ఆవిష్కరింప చేసిన సినిమా అది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అమితాబ్‌కు బాలీవుడ్‌లో ఎదురేలేదన్నది వాస్తవం. ‘జంజీర్’ చిత్రం ఒక్క అమితాబ్‌కే కాకుండా ఆ చిత్ర రచయితలు సలీం-జావేద్, దర్శకుడు ప్రకాశ్ మెహ్రాలకూ ఎనలేని గుర్తింపు తెచ్చింది.  జయబాధురి, ప్రాణ్, అజిత్, బిందు వంటి నటీనటులకు మేలి మలుపుగా నిలిచింది. 

 

 ఆ తర్వాత వచ్చిన, ఇప్పుడు వస్తున్న ఎన్నో పోలీస్ పాత్రలకు ‘జంజీర్’లో అమితాబ్ పోషించిన విజయ్ పాత్రే స్ఫూర్తి, ప్రేరణ. అలాంటి క్లాసిక్ రీమేక్‌తో మన రామ్‌చరణ్ బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు అపూర్వ లాఖియా చేసిన ఈ ప్రయత్నం తెలుగులో ‘తుఫాన్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలకు ముందే మెరుపులు, ఉరుములతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన తుఫాన్.. రిలీజ్ తర్వాత ఆ వేగాన్ని కొనసాగించిందో లేదో తెలుసుకోవాలంటే... ముందు కథలోకెళ్దాం. 

 

 ఆటంకాలను అధిగమిస్తూ... అన్యాయాన్ని అణచివేస్తూ... నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచిన పోలీస్ అధికారి విజయ్ ఖన్నా.  ఉద్యోగంలో చేరిన కొంత కాలానికే పలు ప్రాంతాలకు బదిలీ అయి.. చివరకు ముంబైకి చేరిన విజయ్... అక్కడి ఆయిల్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాడు. ఈ క్రమంలో విజయ్ ఖన్నాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నింటిని అధిగమించి ఆయిల్ మాఫియాను ఎలా అణిచేశాడు అనేది ‘తుఫాన్’ చిత్ర కథ.

 

 ‘జంజీర్’ రీమేక్ అనగానే మాతృకతో పోల్చి చూడటం సహజం. నటన పరంగా కూడా రామ్‌చరణ్‌ని అమితాబ్‌తో కంపేర్ చేసి చూస్తారు. అసలు ‘జంజీర్’ పేరు చెప్పకుండా ఇదే పాత్రను చరణ్ పోషిస్తే... ఇంత అంచనాలు ఉండేవి కావు. సో... ఆ అంచనాలే అటు సినిమాకు ఇటు చరణ్‌కు ప్రతికూలంగా నిలిచాయి. నిజానికి పాత ‘జంజీర్’లో అమితాబ్ యాక్షన్, ఎమోషన్స్ నభూతో నభవిష్యతి. రామ్‌చరణ్ నుంచి ఆ స్థాయి పెర్‌ఫార్మెన్స్‌ని ఆశించడం సబబే కాదు. ఎందుకంటే, హీరోగా అతని వయసు కేవలం ఐదు సినిమాలు మాత్రమే. అతని స్థాయికి అతను ‘ఓకే’ అనిపించాడనే చెప్పాలి. చరణ్ తెలుగు ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా బాలీవుడ్ ఫ్లేవర్‌లో సినిమా ఉండటం ఓ మైనస్ అయ్యింది. 

 

 మాలా, విజయ్ పాత్రల మధ్య కెమిస్ట్రీ కుదరలేదనడంలో సందేహం అక్కర్లేదు. మాలా పాత్రకు ప్రియాంక చోప్రా రాంగ్ ఛాయిస్. వీటన్నింటికి తోడూ పాత్రల మధ్య పొంతన లేకపోవడం.. క్లారిటీ లోపించడం చిత్రం జనరంజకంగా లేకపోవడానికి ప్రధాన కారణమైంది. షేర్ ఖాన్ (శ్రీహరి), తేజ (ప్రకాశ్ రాజ్), జయదేవ్ (తనికెళ్ల భరణి), మోనా(మహీ గిల్) వంటి ఇతర పాత్రలు కూడా జీవం లేకుండా తెరపై కదలాడాయి.  అపూర్వ లాఖియా స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పేలవంగా ఉన్నాయి. అభిమానులను ఆకట్టుకునేందుకు ఆయన ఎక్కడా ఓ చిన్న ప్రయత్నం కూడా చేసినట్టు కనిపించదు. దర్శకుడిగా అన్ని విభాగాల్లోనూ ఆయన వైఫల్యం కొట్టొచ్చిన ట్టు అనిపించింది. సాంకేతికంగా కూడా పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. 

 

 ఈ చిత్రంలో ఏమైనా చెప్పుకోవాలంటే డైలాగ్స్ గురించి చెప్పుకోవచ్చు. అయితే అన్ని విభాగాల వైఫల్యం కారణంగా సంభాషణలు కూడా మరుగునపడిపోయాయి. 1973లో విడుదలైన ‘జంజీర్’ జ్ఞాపకాలు ప్రేక్షకుల మదిలో పదికాలాలు పదిలంగా ఉండటం ఖాయం. అలాగే... అమితాబ్ నటించిన చిత్రాలను రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న జాబితాలో షోలే, డాన్ (ఫర్వాలేదు) జాబితాలో ‘జంజీర్’ కూడా చేరడం ఖాయం. విడుదలకు ముందు సంచలనాలకు వేదికగా మారుతుందనుకున్న ‘తుఫాన్’ ఎలాంటి ప్రభావం చూపకుండానే తీరం దాటే పరిస్థితి నెలకొని ఉందని సినీ విమర్శకుల అభిప్రాయం.

 - రాజాబాబు అనుముల
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top