మిస్సమ్మ మంచి టీచర్‌ గోవిందం మంచి మాస్టర్‌

Teachers Day Special story to telugu moives - Sakshi

టీచర్స్‌ డే స్పెషల్‌

మేకప్‌ లేని గురువులు బడిలో ఉంటారు.మేకప్‌ ఉన్న గురువులు సినిమాల్లో ఉంటారు.కాని వారి పాఠాల్లో తేడా ఉండదు.వారి ఆదర్శాల్లో తేడా ఉండదు.వారు చూపించే మంచి మార్గంలో తేడా ఉండదు.దైవం కంటే ముందు మనిషి గురువునే తెలుసుకుంటాడు.తల్లిదండ్రుల చేయి తర్వాత గురువు చేయే పట్టుకుంటాడు.మంచి చెప్పాలనుకున్న సినిమాల్లో మంచి గురువు ఎప్పుడూ హిట్టే కొట్టాడు. నూటికి నూరు మార్కులు సాధించాడు.

బేడ్‌ టీచర్స్‌ వల్ల కొంతమందికి గుడ్‌ జరుగుతూ ఉంటుంది. ‘మిస్సమ్మ’ సినిమాలో ఆ జమిందారువారి స్కూల్లో అల్లు రామలింగయ్య సరిగ్గా పాఠాలు చెప్పి ఉంటే సావిత్రి అవసరం ఉండేదే కాదు. అతను అస్తమానం పిల్లల చేత ఆయుర్వేదం మందులు నూరిస్తూ, లేహ్యాలకు సాయం పట్టిస్తూ, గుళికలను చుట్టిస్తూ చేయము అని మొరాయిస్తే బెత్తం తిరగేస్తూ నానా బాధలు పెడుతున్నాడనే జమిందారైన ఎస్వీ రంగారావు కొత్త టీచరు కోసం మేనల్లుడైన అక్కినేని చేత పేపరు ప్రకటన ఇప్పిస్తాడు. దానివల్ల మిస్సమ్మగా సావిత్రి ఆమె భర్త ఎమ్‌.టి.రావుగా ఎన్‌.టి.ఆర్‌ ఆ ఊరికి వచ్చి మెల్లగా ఆ ఇంటికి అయినవాళ్లమని గ్రహించి కథను సుఖాంతం చేస్తారు. పనిలో పనిగా పనివాడు దేవయ్య అను రేలంగి కూడా బాగుపడ్డాడనుకోండి. తెలుగు సినిమాల్లో పాపులర్‌ స్థాయిలో హీరో హీరోయిన్లు టీచర్లు అయ్యింది ‘మిస్సమ్మ’తోనే కావచ్చు. ఆ తర్వాత కాలక్రమంలో టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు తెలుగు సినిమాల్లో టీచర్ల గౌరవం పెంచారు. టీచరు హోదాకు తమ స్టార్‌డమ్‌ను కూడా ఇచ్చారు.

బడి పంతులు
ఎన్‌.టి.ఆర్‌ వంటి స్టార్‌ ‘బడి పంతులు’గా చేయడం ఏమిటి అని ఆ రోజుల్లో మొదట అందరూ వింత పడ్డారు. ఆవేశం కలిగిన హీరో నలుగురినీ చితకబాదే వీరుడు బెత్తం కూడా పట్టకుండా మెత్తగా పాఠాలు చెప్తూ ఎలా మెప్పించగలడు అని కుతూహలం చూపారు. కాని టీచర్‌ అంటే ఇలా ఉంటాడు అని ఎన్‌.టి.ఆర్‌ బడిపంతులులో నిరూపించారు. విద్యార్థులకు ఆయనంటే ఎంత ఇష్టమంటే ఆ రోజులలోనే వారు స్వయం సేవ చేసి కాలిపోయిన ఇంటి స్థానంలో ఆయనకు ఇల్లు కట్టి ఇస్తారు సినిమాలో. ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయుడే విద్యార్థులకు నిజమైన ఆదర్శం. క్లాస్‌రూమ్‌లో ఆదర్శం వెల్లివిరిస్తే సంఘంలో ఆదర్శం వెల్లి విరుస్తుంది. భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు... అని అందరూ పాడుకోగలిగింది అప్పుడే.

కోడెనాగు
క్లాసులో అల్లరి చేస్తే టీచర్‌ దండిస్తాడు. క్లాసు బయట అల్లరి చేస్తే ఏం చేస్తాడు? ‘కోడెనాగు’ సినిమాలో గురువుగా వేసిన ఆచార్య ఆత్రేయ శిష్యుడైన శోభన్‌బాబు కోసం ఎన్నెన్ని అవస్థలు పడతాడో ఎన్నెన్ని తాపత్రయాలు అనుభవిస్తాడో చెప్పలేము. కోడెనాగును చూస్తే జనం పూజలు చేయవచ్చు. కాని దానిని వీధుల్లో ఇళ్లలో తిరగనివ్వరు. ముక్కుసూటిగా వెళ్లే శోభన్‌బాబులాంటి వ్యక్తులకు సంఘంలో చోటు లేదు. అలాంటి వాడికి బాసటగా ఈ సినిమాలోని ఆత్రేయ వంటి గురువు కావలసిందే. ఈ సినిమా క్లయిమాక్స్‌ ఆ రోజుల్లో ఊహకు అందనిది. శిష్యుడి కోసం గురువు ప్రాణాలు వదులుతాడు. ఆ గురువును వెతుక్కుంటూ శిష్యుడు కూడా తన ప్రియురాలితో ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ గురుశిష్యుల అనుబంధం అమరం.

విశ్వరూపం
సినిమాల్లో టీచర్‌ ఇప్పుడు లెక్చరర్‌ అయ్యాడు. యువ స్టూడెంట్స్‌కు దారి చూపే మార్గదర్శి అయ్యాడు. దేశంలో డెబ్బయ్యవ దశకం వచ్చినప్పుడు ఫ్యాషన్‌ కొంచెం శృతి మించింది. విద్యార్థులలో అల్లరి, నిర్బాధ్యత పెరిగాయి. క్లాసులు ఎగ్గొట్టడం, వ్యసనాలకు పాల్పడటం, లెక్చరర్లను ఎదిరించడం... ఈ ధోరణిలో ఉన్న వారిని ఒక దారికి తేవడానికి ‘విశ్వరూపం’ సినిమా ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఇందులో లెక్చరర్‌గా వేసిన ఎన్‌.టి.ఆర్‌ను విద్యార్థులు మొదట ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత ఎంతగా అభిమానిస్తారంటే ట్రాన్స్‌ఫర్‌ అయ్యి వెళుతున్న ఆయన తన ట్రాన్స్‌ఫర్‌ లెటర్‌ చించి పారేసి మరీ ఆ కాలేజ్‌లో ఉండిపోతాడు. ఈ సినిమాలో ఎన్‌.టి.ఆర్‌ చే ప్రభావితులైన స్టూడెంట్స్‌ ఏకంగా డ్యామ్‌ కట్టేంత స్థాయిలో ఏకం అవుతారు. విద్యార్థుల శక్తి సంఘ పురోగతికి ఉపయోగించవచ్చని చెప్పిన బెస్ట్‌ టీచర్‌ సినిమా ఇది.

శంకర శాస్త్రి
పాఠాలు చెప్తేనే గురువా... సంగీత పాఠాలు చెప్తే గురువు కాదా? శంకరాభరణంలో శంకరశాస్త్రికి మించిన గురువు లేడు. ఆ గురువుకు శిష్యుడిగా చేరాలంటే తులసికి చాలా శుశ్రూష చేయాల్సి వస్తుంది. వినయం చూపించి మెప్పించాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ శిష్యుడిని స్వీకరించాక ‘బ్రోచేవారెవరురా’ అంటూ కీర్తనలేం ఖర్మ ఆ శిష్యుడు నిజంగా యోగ్యుడయ్యాడని తెలిసిన క్షణాన ఆ శంకరశాస్త్రి స్వయంగా తన ముంగాలి మీద ఉన్న గండపెండేరాన్ని తీసి మరీ శిష్యుడికి తొడుగుతాడు. ఏ కళ అయినా గురు ముఖతానే నేర్చుకోవాలి అప్పుడే అబ్బుతుంది రాణిస్తుంది అని చెప్పిన సినిమా ఇది. గురువు నుంచి కళను మాత్రమే కాదు విలువలను అలవర్చుకోవాలి అని రాగం తానం పల్లవులను మన మదిలో కదలాడిస్తూ మరీ చెబుతుంది.

ప్రతిఘటన
బెత్తం పట్టే టీచరు అవసరమైతే గొడ్డలి పట్టుకోదా? జవాబు పత్రంలో అప్పు ఆన్సర్‌ రాస్తే సున్నా మార్కులు వేయక తప్పదు. మరి సంఘంలో తప్పు పని చేస్తే ఏం చేయాలి? ‘ప్రతిఘటన’ రౌడీయిజం చేస్తున్న చరణ్‌రాజ్‌ తాను సంస్కరించాల్సిన మొదటి బ్యాడ్‌ స్టూడెంట్‌ అని లెక్చరర్‌ పాత్ర వేసిన విజయశాంతి గ్రహిస్తుంది. అతణ్ణి ఎదిరిస్తుంది. నిలువరిస్తుంది. ఎంత ప్రయత్నించినా పనికి రాకపోగా ఇతర స్టూడెంట్‌లకు హానికరంగా మారినవాణ్ణి డిబార్‌ చేయక తప్పదు. విజయశాంతి కూడా అదే పని చేస్తుంది. చరణ్‌రాజ్‌ను డిబార్‌ చేస్తుంది. సంఘం నుంచి చేస్తుంది. జీవం నుంచి చేస్తుంది. జీవితం నుంచి చేస్తుంది. అతడి మెడ మీద ఆమె తిప్పిన గొడ్డలే ఒక లెక్చరర్‌ ఇప్పటి వరకూ సినిమాలలో ఎత్తిన అతి ఉత్తమ బెత్తం అని చెప్పక తప్పదు.

ముగ్గురు స్టార్లూ మూడు సినిమాలు
హీరో ఎస్‌.ఐ అంటే ఉత్సాహపడే హీరోలు– హీరో టీచర్‌ అంటే వేయడానికి అంగీకరించకపోవచ్చు. తెలుగులో పెద్ద హీరోలు చాలామంది గురుస్థానంలో నిలబడ్డానికి ముందుకు వచ్చారు. వెంకటేశ్‌ ‘సుందరకాండ’లో, చిరంజీవి ‘మాస్టర్‌’లో, బాలకృష్ణ ‘సింహా’లో చేతిలో టెక్స్‌›్టబుక్స్‌ పట్టుకుని బ్లాక్‌బోర్డు మీద లెసన్స్‌ రాశారు. బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, ఎల్బీ శ్రీరాం వంటి నటులు హాస్యం పుట్టించే లెక్చరర్‌ పాత్రలు వేస్తున్నప్పుడు ప్రేమికులు తమ ప్రేమను అర్థం చేసుకుని ఎదిగేలా చేయగలిగే మంచి లెక్చరర్‌ పాత్రలో రావు రమేశ్‌ ‘కొత్త బంగారులోకం’ సినిమాలో కనిపిస్తాడు. 

ఓనమాలు
ఊరికి నడిబొడ్డు ఎలాగో ఊరిలోని టీచర్‌ అలాగా. టీచర్‌ ఊరు విడిస్తే ఏమవుతుంది? ఊరే దారి తప్పుతుంది. ఎవరు ఎంత ఎదిగినా ఎన్ని దూర తీరాలకు చేరినా జన్మభూమికి వస్తూ పోతుండాలని ఊరి మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలని అందుకు ఆ ఊరి టీచరు మూలాధారం కావాలని చెప్పిన సినిమా ‘ఓనమాలు’. ఇందులో టీచర్‌గా రాజేంద్రప్రసాద్‌ ఊరి నుంచి చదువుకుని వెళ్లిన విద్యార్థులు తిరిగి ఊరికి రావాల్సిన అవసరాన్ని క్లయిమాక్స్‌లో చెబుతాడు. సంవత్సరానికి ఒక రోజు ‘మాతృభూమి దినోత్సవం’ పేరుతో ప్రతి ఒక్కరూ సొంత ఊరికి రావాలని కోరుతాడు. ఇంగ్లిష్‌ చదువులు పరాయి సంస్కృతిలో పడి మూలాలు మరిచిపోయినవారి చేత ఓనమాలు దిద్దించిన సినిమా ఇది.

గీత గోవిందం
నాటి సినిమాలలోనే కాదు నేటి సినిమాలలో కూడా నాటి హీరోలే కాదు నేటి హీరోలు కూడా గురు పరంపరను గురువు సంస్కారాన్ని గురువు ఔన్నత్యాన్ని నిలబెడుతున్నారు. ‘గీత గోవిందం’ సినిమాలో లెక్చరర్‌ అయిన విజయ్‌ దేవరకొండ కూడా తన శిష్యురాలిని దారిలో పెడతాడు. డబ్బునో లేదా అందాన్నో ఎర వేస్తే గురువును దారికి తెచ్చుకోవచ్చు అనుకున్న ఒక విద్యార్థినిని చీవాట్లు పెట్టి ఎప్పటికీ ఆమెకు తానొక వెల్‌విషర్‌గా ఉంటానని చెబుతాడు. ఆ అమ్మాయికే కాదు మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది అలాంటి గురువు తోడుగా నిలుస్తాడనుకుంటే.సినిమా శక్తిమంతమైన మీడియా. మార్గదర్శిగా నిలిచే పాత్రలను అది ఆ స్థాయిలో చూపించినప్పుడే వాటి ప్రభావం సినిమాలోనూ సంఘంలోనూ గొప్పగా ఉంటుంది. గురుబ్రహ్మ గురుర్వివిష్ణుః అంటూ దైవం కంటే ముందు గురువును నిలబెట్టారు. తల్లిదండ్రుల తర్వాత ఏ మనిషైనా రుణపడేది గురువుకే.అలాంటి గురువుకి నమస్కారం.సినిమా గురువుకు దండాలు.
– కె 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top