
నిర్మాత నమ్మకాన్ని అభినందించాలి
నీ ఎన్న మాయం సెయ్‌దాయ్ చిత్ర నిర్మాత నమ్మకాన్ని అభినందించాలని ప్రముఖ గీత రచయిత పిరైచుడర్ అన్నారు.
నీ ఎన్న మాయం సెయ్‌దాయ్ చిత్ర నిర్మాత నమ్మకాన్ని అభినందించాలని ప్రముఖ గీత రచయిత పిరైచుడర్ అన్నారు. నరేన్ సమర్పణలో ఎన్.పిక్చర్స్ సెల్ఫీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కవితనరేన్ నిర్మిస్తున్న చిత్రం నీ ఎన్న మాయం సెయ్‌దాయ్. నవ నటుడు వివేక్‌శేఖర్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నేహా సక్సేనా నాయకిగా నటిస్తున్నారు. మరో నాయకిగా అర్షితసాయ్ నటిస్తుండగా మదురై షర్మిళ, మోనిక, షీబా, మాస్టర్ తమిళ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి ఆర్.బాలాజీ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.
డేవిడ్ భరత్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్స్ ధియేటర్‌లో నిర్వహించారు. చిత్ర ఆడియోను ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా ఆవిష్కరించగా గీత రచయిత పిరైచుడర్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన తారలతో చిత్రం చేయడానికి సాహసించిన నిర్మాత నమ్మకాన్ని అభినందించాలన్నారు. అదే విధంగా పలువురికి అన్నదానం చేస్తున్న ఈ చిత్ర నిర్మాత విజయం సాధించాలన్నారు. చిత్ర పాటలు, ప్రచార చిత్రం చూసిన తరువాత కచ్చితంగా నీ ఎన్న మాయం సెయ్‌దాయ్ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగిందని సీనియర్ దర్శకుడు శక్తి చిదంబరం పేర్కొన్నారు.