నిర్మాత జయకృష్ణ కన్నుమూత

నిర్మాత జయకృష్ణ కన్నుమూత - Sakshi


 ప్రముఖ రూపశిల్పి, సీనియర్ నిర్మాత జయకృష ్ణ(75) ఇకలేరు. మంగళవారం ఉదయం ఆయన హైదరాబాద్‌లో కన్నుమూశారు.  హీరో కృష్ణంరాజు, హీరోయిన్ జయప్రదలకు పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా ఓ వెలుగు వెలిగిన జయకృష్ణ, ఆ తర్వాత నిర్మాతగానూ రాణించారు.   ‘మనవూరి పాండవులు’, ‘సీతారాములు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘కృష్ణార్జునులు’, ‘సీతమ్మ పెళ్లి’, ‘ముద్దుల మనవరాలు’, ‘వివాహ భోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’ తదితర చిత్రాలను నిర్మించిన జయకృష్ణ కొన్నేళ్ల క్రితమే సినిమాలకి దూరమై విశ్రాంత జీవితం గడుపుతున్నారు.

 

 పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి సమీపంలోని కోమర్రు గ్రామానికి చెందిన జయకృష్ణ, తన బావ లైన ఎడిటర్ గోపాలరావు, మేకప్‌మ్యాన్ సురేశ్‌బాబుల ప్రోత్సాహంతో మద్రాసు చేరుకున్నారు. తొలుత కెమెరా అసిస్టెంట్‌గా, ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అటుపైన మేకప్ డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటిస్‌గా తన  ప్రయాణం మొదలుపెట్టారు. మేకప్ వృత్తిపై ఎంతో ఇష్టాన్ని పెంచుకున్న జయకృష్ణ ఎన్నో మెళకువలు నేర్చుకుని పరిశ్రమకు వచ్చిన ఎనిమిదేళ్లకే చీఫ్ మేకప్‌మ్యాన్ స్థాయికి ఎదిగారు. ‘బంగారు తల్లి’ సినిమా సమయంలో కృష్ణంరాజుతో పరిచయం ఏర్పడి ఆయన పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా చేరారు.

 

 ఆ తర్వాత జయప్రదకు పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా వ్యవహరించారు. అటుపై సినీ నిర్మాణ రంగంపై ఉన్న ఆసక్తితో నిర్మాతగానూ మారారు. ‘కృష్ణవేణి’, ‘భక్త కన్నప్ప’, ‘అమర దీపం’ తదితర చిత్రాలకు భాగస్వామిగా ఉంటూనే నిర్మాణ నిర్వహణ చేశారు. ప్రముఖ పంపిణీదారు ‘లక్ష్మీ ఫిలిమ్స్’ లింగ మూర్తి ప్రోత్సాహంతో 1977లో జేకే మూవీస్ సంస్థను స్థాపించి, బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్ తదితరులతో ‘మనవూరి పాండవులు’ నిర్మించారు. దాసరి దర్శకత్వంలో ‘సీతారాములు’, ‘కృష్ణార్జునులు’, బాపు దర్శకత్వంలో ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘జాకీ’, ‘సీతమ్మ పెళ్లి’, జంధ్యాల దర్శకత్వంలో ‘ముద్దుల మనవరాలు’, ‘రాగలీల’, ‘వివాహభోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’, క్రాంతికుమార్ దర్శకత్వంలో ‘స్రవంతి’ తదితర చిత్రాలను నిర్మించారు.

 

 మూడో సినిమా ‘మనవూరి పాండవులు’కు జయకృష్ణ ఇచ్చిన వెయ్యి నూటపదహార్లే చిరంజీవి అందుకున్న తొలి పారితోషికం. అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవి పెళ్ళికి కూడా జయకృష్ణ ప్రధాన సంధానకర్త. ఒక దశలో ఒకేసారి కమల్‌హాసన్‌తో ‘అభయ్’, రమ్యకృష్ణతో ‘రాజరాజేశ్వరి’ (డబ్బింగ్), సుమంత్‌తో ‘శభాష్’, శ్రీహ రితో ‘దాసు’ చిత్రాలు ప్రారంభించారు. ‘అభయ్’, ‘రాజరాజేశ్వరి’ ఘోరంగా ఫ్లాపవడంతో కోలుకోలేని దెబ్బతిన్నారు.

 

 అప్పటి నుంచి చిత్ర నిర్మాణ రంగానికి దూరమైపోయారు. కుమారుడు ఆ మధ్య ఆత్మహత్య చేసుకోవడం మానసికంగా కుంగదీసింది. ఒకప్పుడు స్టార్ మేకప్‌మ్యాన్‌గా, అభిరుచి గల చిత్రాలు తీసే సిన్సియర్ ప్రొడ్యూసర్‌గా వెలుగు వెలిగిన జయకృష్ణ చివరిదశ మసకబారిపోయింది. ఒకప్పుడు విలాసంగా జీవించిన ఆయన తీరా తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండానే అనామకంగా వెళ్ళిపోయారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top