ఆ బాణీలో ప్రత్యేకత అది!

ఆ బాణీలో ప్రత్యేకత అది!


 సందర్భం:    ఘంటసాల జయంతి

వి.ఎ.కె. రంగారావు  (ప్రసిద్ధ సినీ, సంగీత, కళా విమర్శకుడు)


 

 అమర గాయకుడు ఘంటసాల సంగీతం అందిం చిన తొలి చిత్రం అంటే, సినీప్రియులు సహజంగా ‘మనదేశం’ పేరు చెబుతారు. కానీ, అంతకన్నా ముందే ఆయన కొన్ని చిత్రాల్లోని పాటలకు బాణీలు కట్టారని చాలామందికి తెలియదు. కృష్ణవేణి నటించిన ‘లక్ష్మమ్మ’కి పాటలు రాసింది, ట్యూన్లు చేసింది ప్రముఖ లలిత సంగీతజ్ఞుడు బాలాంత్రపు రజనీకాంతరావు. అప్పటికే రజనీ ఆకాశవాణిలో ప్రభుత్వోద్యోగి. అందువల్ల ఆ సినిమా టైటిల్స్‌లో ఆయన అసలు పేరు వాడలేదు. గమ్మత్తేమిటంటే, ఆ చిత్రానికి పాటలు రికార్డు చేసింది ఘంటసాల వెంకటేశ్వరరావు.

 

 టైటిల్స్‌లో ‘జి.వి. రావు’ అని వేశారు. ఆ సినిమాలో తాను పాడిన పాటల కోసం ఘంట సాల స్వయంగా రజనీ దగ్గరకు వెళ్ళి, పాటలు నేర్చుకొని వచ్చి మరీ, రికార్డింగ్‌కు పాడారు. మరో విశేషం ఏమిటంటే, ఆ సినిమాలో రెండు పాటలు మాత్రం రజనీకాంతరావు బాణీల్లో కాకుండా, వాటిని ఘంటసాల మార్చి, కొత్త బాణీలు కట్టుకొని పాడారు. ఆ సంగతి స్వయంగా రజనీకాంతరావే నాకు చెప్పారు. ఆ రెండు పాటల్లో ఒకటి - వేశ్య పాత్రధారిణి కుమారి రుక్మిణి మీద ఫరజు రాగంలో వచ్చే ‘సుదతి నీకు తగిన చిన్నదిరా...’ జావళీ.

 

 అలాగే, చాలామందికి తెలీని మరో సంగతి - అక్కినేని నటించిన ‘బాలరాజు’లో కూడా ఘంటసాల బాణీలు కట్టిన పాటలు న్నాయి. ఆ చిత్రానికి సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావు. ఆయనకు సహాయకుడు - ‘జి.వి. రావు’. ఆ చిత్రంలో మూడు పాటలు స్వయంగా ఘంటసాల బాణీలు కట్టినవే. ఆ పాటలేమిటంటే, ‘నవో దయం...’ అనే బృంద నృత్యం, ‘తీయని వెన్నెల రేయి...’ గీతం, ‘తేలీ చూడుము హాయి...’ అనే పాట. ఈ పాటలకున్న మరో విశేషం- పాట లకు వాద్యగోష్ఠి కూర్చినది మరో సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బురామన్. టైటిల్స్ చూస్తే ఆర్కెస్ట్రా సుబ్బురామన్ అండ్ పార్టీ అని ఉంటుంది.

 

 అలా ‘లక్ష్మమ్మ’ (ఆలస్యంగా 1950లో రిలీజైంది)లో 2 పాటలు, ‘బాలరాజు’ (’48)లో 3 పాటలకు సంగీతం అందించాక... ఘంటసాల పూర్తిస్థాయిలో సంగీత దర్శకుడిగా పనిచేసింది ‘మనదేశం’ (’49)లో. ఆ చిత్రానికి పనిచేస్తున్నప్పుడే ‘కీలుగుఱ్ఱం’ (’49) అవకాశమొచ్చింది. అదీ గమ్మత్తుగా! ‘కీలుగుఱ్ఱం’ చిత్రాన్ని మొదట తీయాలనుకున్నది - నిర్మాత, దర్శకుడైన మీర్జాపురం రాజా కాదు. ముందుగా పెదపవని జమీందార్ ఈ సినిమాను ప్రారంభించారు. అప్పటికి ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఘంటసాలను కూడా అనుకోలేదు. అయితే, అవాంతరాలతో ఆ చిత్రం ఆగిపోయింది. పెదపవని వారు మానుకోవడంతో, ఈ ‘కీలుగుఱ్ఱం’ స్క్రిప్టును మీర్జాపురం రాజా వారికి ఇచ్చారు రచయిత తాపీ ధర్మారావు. కృష్ణవేణి తాను నిర్మిస్తున్న ‘మనదేశం’కి సంగీత మిస్తున్న ఘంటసాల పేరు ‘కీలు గుఱ్ఱం’కి సిఫార్సు చేశారు.

 

 ‘పెద్ద బడ్జెట్‌లో తీస్తున్న సినిమా అంటూ మొదట ఆయన తటపటాయించారు. అయితే, కృష్ణవేణి అంతగా చెప్పడంతో ఘంట సాలతో ముందుగా 2 పాటలకు సంగీతం కట్టించి చూద్దామనుకున్నారు. అవి అద్భుతంగా ఉండడంతో, ఆయననే ‘కీలుగుఱ్ఱం’కి మ్యూజిక్ డెరైక్టర్‌ను చేసేశారు. ఇక అక్కడ నుంచి సంగీత దర్శకుడిగా ఘంటసాల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. అలా ‘లక్ష్మమ్మ’ సమయంలోనే నమ్మకం కుదిరి, ‘మనదేశం’లో పూర్తి బాధ్యతలిచ్చి, ఆయనను సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది.గాయకుడిగా ఆయన తెలుగు పాటల్లో నాకు నచ్చినవి చాలానే ఉన్నాయి. ఆ కథ మరోసారి. కెరీర్ తొలి రోజుల్లో ఘంటసాల తమిళ గీతాలు పాడినా, అవన్నీ ఆయన కంఠం పరిపక్వత చెందక ముందువి. నాకు తెలిసి ఆయన హిందీలో పాడిన ఒకే పాట - తమిళ ‘రత్నతిలకం’కి హిందీ అనువాదమైన ‘ఝండా ఊంఛా రహే హమారా’(’64)లోని టైటిల్ సాంగ్.

 

 ఘంటసాల ప్రైవేట్ రికార్డులూ ప్రసిద్ధమే. జాషువా, కరుణశ్రీ, ప్రసాదరాయ కులపతి లాంటి ప్రసిద్ధుల పద్యాలు ఆయన గ్రావ్‌ుఫోన్ రికార్డులుగా ఇచ్చారు. ఆ రికార్డుల్లో ముందు వచ్చే వచనం ఘంటసాల స్వయంగా రాసుకొన్నదే. రేడియో నాటిక ‘లైలా మజ్ను’ కోసం రజనీ రాసి, సంగీతం కూర్చిన 2 పాటల్ని రేడియోలో ఘంటసాల పాడారు. ఆ తర్వాత ‘మజ్ను విలాపము’, ‘లైలా విశ్వరూపము’ పేరుతో రికార్డులుగా ఇచ్చారు. ఘంటసాల తెరపై కనిపించిన చిత్రమంటే చాలామంది ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం’ (’60)లో ‘శేషశైలావాస..’ పాట  చెబుతారు. కానీ, అంతకన్నా ముందే ‘యోగి వేమన’ (’47)లో ఎం.వి. రాజమ్మ నర్తించే ‘ఆపరాని తాపమాయెరా...’ జావళీలో చేతిలో తాళాలు పట్టుకొని జతులు వేస్తూ, అంటూ కనిపిస్తారు ఘంటసాల. అంతకు ముందు ‘త్యాగయ్య’ (’46)లో శిష్యబృందంలోనూ ఆయన ఉన్నారంటారు. నాకు పోలిక తెలియలేదు.

 

 సంగీత దర్శకుడిగా ఘంటసాల బాణీలో ప్రత్యేకత ఉంది. శాస్త్రీయ, జానపద, ప్రేమగీతాలలో వేటికి బాణీ కట్టినా ఆ పాటలకు నోటికి సులభంగా పట్టుబడే సుగుణం ఆయన విలక్షణత. ఘంటసాల బాణీల్లో వినిపించే ‘వాల్మీకి’లోని ‘జలల జలల జలధార...’, ‘శకుంతల’లో ‘...సుధలు కురియు సుమసీమ’ అంటూ వచ్చే పాట శుద్ధ మలయమారుత రాగంలో అలరిస్తాయి. శాస్త్రీయ స్వరాల వ్యవహారం ఎక్కువగా వినిపించే పెండ్యాల పాటలంత బాగానూ ఉంటాయి. ఘంటసాల గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఇవాళ్టికీ అజరామరమైంది అందుకే. మరొక్క మాట - ఘంటసాల గురించి వచ్చిన మొట్టమొదటి పుస్తకం ‘భువనవిజయం’. దాన్ని ప్రచురించింది నేను. ముఖపత్రం బాపూది. ముప్పాతిక శ్రమ ఘంటసాల సావిత్రమ్మ గారిది. ఒక వీసం పి.ఎస్. గోపాలకృష్ణది. పేరు నాది! నాకంటే అదృష్టవంతుడు ఎవరు!  


సంభాషణ: రెంటాల జయదేవ

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top