భార్యకు అల్జీమర్స్‌! భర్తని మర్చిపోతే?..

A Moment To Remember Love Movie Review In Telugu - Sakshi

లవ్‌ సినిమా 

సినిమా : ఏ మూమెంట్‌ టు రిమెంబర్‌
తారాగణం : జంగ్‌ వూ సంగ్‌, సన్‌ ఏ షిన్‌ 
డైరెక్టర్‌ : జాన్‌ ఎహెచ్‌ లీ
భాష : కొరియన్‌

కథ : షూ షిన్‌( సన్‌ ఎ షిన్‌) ఓ పెళ్లైన వ్యక్తిని ప్రేమించి అవమానాల పాలవుతుంది. అతడితో బ్రేకప్‌ తర్వాత మానసికంగా చాలా కృంగిపోతుంది. ఇలాంటి సమయంలోనే చాయ్‌ చుల్‌ షూ(జంగ్‌ వూ సంగ్‌) ఆమెకు ఎదురుపడతాడు. వారి కలయిక కూడా ఆమె అపార్థం చేసుకోవటంతో మొదలవుతుంది. కానీ, వెంటనే ఆమె అతన్ని అపార్థం చేసుకున్నట్లు తెలుసుకుంటుంది. సారీ చెప్పాలనుకుంటుంది కానీ, కుదరదు. ఆ తర్వాత తన తండ్రికి చెందిన కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో పనిచేసే ఫోర్‌మెన్‌గా చుల్‌ షూ ఆమెకు పరిచయమవుతాడు. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. పెళ్లి తర్వాత జంట మధ్య ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసి అతడు పెళ్లికి అంగీకరించడు. ఆ తర్వాత తనకు ఇష్టం లేకపోయినా షూ షిన్ మీద ప్రేమతో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. దాంపత్య జీవితంలో ఇద్దరూ ఎంతో హ్యాపీగా ఉంటారు.

అప్పుడే ఆమెకు అల్జీమర్స్‌ ఉన్నట్లు తెలుస్తుంది. మెల్లమెల్లగా అన్నీ మర్చిపోతుంటుంది. చివరకు చాయ్‌ చుల్‌ షూను కూడా. తన కూతురితో చుల్‌ షూ పడుతున్న కష్టాలు చూసిన షూ షిన్‌ తండ్రి ఆమెకు విడాకులు ఇచ్చేయమని బ్రతిమాలుతాడు. అయినా అతడు ఒప్పుకోడు. ఎట్టి పరిస్థితుల్లో భార్యను వదిలిపెట్టేది లేదని చెబుతాడు. గతం పూర్తిగా మర్చిపోయిన షూ షిన్‌తో చుల్‌ షూ పడే కష్టాలు ఏంటి? షూ షిన్‌ మెదడులోంచి చుల్‌ షూ జ్ఞాపకాలు పూర్తిగా చెరిగిపోతాయా? ఒక వేళ చెరిగిపోతే అలాంటి పరిస్థితిలో చుల్‌ షూ ఏం చేస్తాడు? అన్నదే మిగితా కథ.

విశ్లేషణ : 2004లో విడుదలైన ‘ఏ మూమెంట్‌ టు రిమెంబర్‌’ ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ మూవీ. కొరియన్‌ మార్క్‌ లవ్‌ డ్రామా మనల్ని కట్టిపడేస్తుంది. ప్రేమలో ఇద్దరు వ్యక్తుల మధ్య జ్ఞాపకాలకంటే అనుబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పే సినిమా ఇది. జంగ్‌ వూ సంగ్‌, సన్‌ ఏ షిన్‌లు తమ పాత్రల్లో జీవించి నూటికి నూరు శాతం న్యాయం చేశారని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో కంటతడి పెట్టకపోయినా మన గుండె బరువెక్కడం ఖాయం. ఏ మూమెంట్‌ టు రిమెంబర్‌ స్టోరీ లైన్‌ ఆధారంగా హిందీలో ‘యూ మీ ఔర్‌ హమ్‌’తో పాటు పలు భాషల్లో సినిమాలు తెరకెక్కాయి. 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top