‘..అందుకే మోదీ ప్రపంచనేత అయ్యారు’

PM Narendra Modi only world statesman to stand China - Sakshi - Sakshi - Sakshi

అంతర్జాతీయ వేదికల మీద భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా గౌరవం ఎందుకు దక్కుతోంది? బ్రిక్స్‌ నుంచి ఆసియాన్‌ వరకు ఏ అంతర్జాతీయ సదస్సు అయినా మోదీ ప్రత్యేకంగా ఎందుకు నిలుస్తున్నారు? మోదీని అంతర్జాతీయ రాజనీతిజ్ఞుడుగా ప్రపంచం ఎందుకు గుర్తిస్తోంది? అన్న ప్రశ్నలకు అమెరికన్‌ రీసెర్చ్‌ అందించిన జవాబులు ఇవే.

వాషింగ్టన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా ప్రశంసలు జట్టు కురిపిస్తూనే ఉంది. రెండు రోజుల కిందట అమెరికాకు చెందిన ప్యూ సంస్థ దేశంలోనే మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు అని సర్వేలో ప్రకటిస్తే.. తాజాగా అమెరికాకు చెందిన మైఖెల్‌ పిల్స్‌బరీ (డైరెక్టర్‌ ఆఫ్‌ సెంటర్‌ ఆన్‌ చైనీస్‌ స్ట్రాటజీ) మోదీని అంతర్జాతీయ రాజనీతిజ్ఞుడుగా అభివర్ణించారు. అగ్రరాజ్యంగా గుర్తింపు పొందిన అమెరికా కూడా స్పందించని అనేక అంతర్జాతీయ అంశాలను మోదీ ప్రత్యేకంగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. ప్రపంచ సమస్యలపై మోదీకి ఉన్న అవగాహనే ఆయనను వరల్డ్‌ స్టేట్‌మన్‌గా మార్చిందని అన్నారు.

చైనాకు దీటుగా..!
‘ఏ ప్రపంచాధినేత ఇంతవరకూ చైనా ఒన్‌ బెల్ట్‌-ఒన్‌ రోడ్‌పై స్పందించలేదు. ఆసియా, ఐరోపా, అమెరికా దేశాలకు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నా.. ఏ దేశం దీనిపై స్పష్టమైన వైఖరిని ప్రకటించ లేదు. కానీ.. మోదీ మాత్రం దీనిపై మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో భారత సార్వభౌమాధికారాన్ని ఆయన ప్రకటిస్తూనే ఉన్నార’ని పిల్స్‌బరీ ప్రత్యేకంగా చెప్పారు. ఈ విషయంపై అమెరికా ఇప్పటివరకూ ఎటువంటి చొరవ చూపలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇండో పసిఫిక్‌ స్ట్రాటజీ
ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ సమస్యలుపై అమెరికాకన్నా వేగంగా మోదీ స్పందిస్తున్నారని పెంటగాన్‌ వర్గాలు, పిల్స్‌బరీ చెబుతున్నారు. ప్రధానంగా దక్షిణ చైనా సముద్రంపై మోదీ చాలా వేగంగా రియాక్ట్‌ అయ్యారని పెంటగాన్‌ వార్గాలు పేర్కొన్నాయి.

హిందూ మహాసముద్రం
ఆసియా, ఐరోపా, అమెరికా దేశాలకు అత్యంత కీలకమైన హిందూ మహాసముద్రంపై చైనా ఆధిపత్యాన్ని మోదీ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అంతేకాక హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు ప్రత్యేకంగా బిలియన్‌ డాలర్ల ఖరీదు పెట్టి అమెరికా దగ్గర పీఏ డ్రోన్ల కొనుగోలుకు మోదీ సిద్ధమయ్యారు.

సీపీఈసీపై తీవ్ర వ్యతిరేకత
సుమారు 50 బిలియన్‌ డాలర్లతో ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా చైనా.. పాకిస్తాన్‌లోని గ్వాదర్‌ పోర్టు వరకూ నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌పై మోదీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాక అంతర్జాతీయ సదస్సుల్లో సీపీఈసీ ప్రస్తావన తీసుకువచ్చారని ఆయన అన్నారు. అలాగే ఒన్‌బెల్ట్‌ -ఒన్ రోడ్‌ను భారత్‌ బహిష్కరించిన విషయాన్ని పిల్స్‌గరీ గుర్తు చేశారు.

సరిహద్దు దేశాలతో..!
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక.. పొరుగు దేశాలతో సంబంధాలను మొరుగుపరిచారని పిల్స్‌బరీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రధానంగా చైనాకు దగ్గరవుతున్న శ్రీలంక, నేపాల్‌ వంటి దేశాలను తిరిగి భారత్‌కు సన్నిహితంగా మార్చడంలోనే ఆయన రాజనీతిజ్ఞత బయటపడుతోందని పిల్స్‌బరీ చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top