విమానంలో వాటర్ లీకేజీ.. వైరల్ వీడియో

విమానంలో వాటర్ లీకేజీ.. వైరల్ వీడియో


వాషింగ్టన్: ఎక్కడైనా పాత ఇళ్ల పైకప్పు నుంచి వర్షం నీళ్లు కారడం గురించి వింటుంటాం. ఎప్పుడో ఒకసారి గానీ బస్సుల్లో మనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వదు. కానీ ఏకంగా విమానంలో ప్రయాణికులు మొత్తం జర్నీ సమయంలో నీళ్లు కారి మీద పడుతుండగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. గత శుక్రవారం ఉదయం అట్లాంటా నుంచి ఫ్లోరిడాకు వెళ్లిన డెల్టా ఎయిర్ లైన్స్ ప్రయాణికులు ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ తతంగాన్ని ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.



టామ్ మెక్‌కల్లాఫ్ అనే ప్రయాణికుడు కుటుంబంతో సహా డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించారు. అయితే రెండు మేగజైన్ల సాయంతో తండ్రి టామ్ తడవకుండా ప్రయాణమంతా ఎలా ఇక్కట్లు ఎదుర్కొన్నాడో ఓ వీడియోను అతడి కుమారుడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 'మా నాన్న డెల్టా ఎయిర్‌లైన్స్‌లో వాటర్ గేమ్ ఆడుకున్నాడు. గంటన్నరకు పైగా చేసిన ఈ మొత్తం జర్నీలో ఆయన ఇలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని' టామీ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఎయిర్ లైన్స్ అట్లాంటాలో బయలుదేరక ముందే విమాన సిబ్బందికి ఈ సమస్య తెలిసినా పట్టించుకోలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ లీక్ కారణంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని భయభ్రాంతులకు లోనైనట్లు ప్రయాణికులు తెలిపారు.



1800 డాలర్లు ఖర్చుపెట్టి ప్రయాణిస్తే ప్యాసింజర్లకు ఇలాంటి సౌకర్యాన్ని కల్పిస్తారా అని బాధిత ప్రయాణికుడు మెక్‌కల్లాఫ్ ప్రశ్నించారు. మార్చేందుకు ఇతర సీట్లు ఖాళీ లేవని చెప్పిన సిబ్బంది, ఫ్లోరిడాలో విమానం ల్యాండ్ అయిన తర్వాత జరిగిన తప్పిదానికి పరిహారంగా కేవలం 100 అమెరికన్ డాలర్లు ఆఫర్ చేశారని బాధితుడు వెల్లడించారు. తాను రెండు మేగజైన్లను అడ్డుగా పెట్టుకుని తనపై పడుతున్న నీటిని పక్కకు దారి మళ్లించానని చెప్పారు. తనతోపాటు మరో ఆరుగురు ప్రయాణికులు జర్నీ మొత్తంగా ఈ పాట్లు పడ్డారని, డెల్టా ఎయిర్‌లైన్స్ మాత్రం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారంటూ వాపోయారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top